Friday, February 9, 2018

fantastic five 
------------------
My experience with five fantastic movies of IRAN 
-----------------------------------------------------------------
తడిని, తేమని ఎంతసేపు మోయగలం. బొట్టు బొట్టుగా వాక్యం గుండె చెలిమెలో మునిగితేలేప్పుడు వాటికి గాలం వేసి లాగటమూ కష్టమే. వారం రోజులుగా లార్వా చుట్టుకున్నట్టు ఇరాన్ సినిమా దారంతో చుట్టుకుని ఇవ్వాళ సీతాకోక చీలుకలా పర్షియా పదాలపై వాలి పుప్పొడి పీల్చుతున్నట్టుంది. సమూహాల మధ్య పర్షియా వాక్యాల్ని వెదజల్లితే చెమర్చే గుండెలు వాటంతటవే చిగురిస్తతాయేమో.
ఎడారులు. ఎగుడుదిగుడు లోయలు. సన్నని కాలవలు. మట్టిదిబ్బలు. ఫ్లోరింగ్ కూడా సరిగా లేని ఇళ్లు. మట్టికొట్టుకుపోయిన వాహనాలు. రక్తమోడుతున్న మానవదేహాల ఎర్రెర్రని కథలు. యాసిడ్లో ముంచి తీసిన ప్రేమ. తండ్రిని చూడాలన్న తపన. ఏ నిమిషమో తెలియక పడే బాంబుల ప్రమాదాలు. ఎన్నెన్ని గొంతుపెగలని మాటలు ఒక్కొక్కొటి ఒక్కో రక్తమోడే కవిత.
చూట్టానికేవయితేనేం సినిమాలే అనుకుంటాం. కళాఖండాలని చూస్తున్నప్పుడు ఇలాంటి ఒక్క సినిమా చూసినా చాలు అనిపిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఫంటాస్టిక్ ఫైవ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఇరాన్ సినిమోత్సవం ఇవ్వాళ ముగిసింది. అందరు పక్కవాళ్లను ఎవరో కొత్తవాళ్లలా కాకుండా సినిమా అవగానే ఆ భావప్రపంచాన్ని వ్యక్తీకరించడానికి పక్కవారి కళ్లలోకి చూస్తూ ఏమీ మాట్లాడకుండానే తమని తాము వొంపేసుకోవటం ఈ పర్షియన్ సినిమా చేసినపని.
సినిమా చూసిన ప్రతొక్కరు ఆ భావావేశానికి సమానంగా లోనై డైరెక్టర్ తో ప్రయాణం చేయగలగటం ఆ సినిమా సాధించుకునే విజయం. అవార్డులు రివార్డులు కాదు అది చూసిన వాళ్ల కళ్లు కొంత సేపు ఆ అనుభూతిని వెలిగించుకుని సంచరించగలగాలి. అప్పుడు కదా సినిమాకి సార్ధకత.
ఫంటాస్టిక్ ఫైవ్ అని ప్రదర్శించిన సినిమాలు ఐదు అయినా ఆదివారం నాటి "where is my friends Home" తో ఆరు అనుకోవాలి. ఆదివారం నుంచి నిన్నటి సాయంత్రం వరకు అధ్బుతమైన సాయంత్రాలవి. ఏదో ఒకటో రెండో చూసి ఆపేద్దాంలే అనుకున్నా. కానీ నాతో కుదరలేదు. హృదయం కఠినమైపోయి యే స్పర్శను అనుభవించలేనివాళ్లకి ఈ ఇరాన్ సినిమాలను చూపించాలని అంటాన్నేను.
ఆదివారం రోజు :
••••••••••••••••••
"where is my friends Home"
1987 లో అబ్బాస్ కైరొస్తమీ రచన దర్శకత్వంలో వెలువడ్డ సినిమా. అబ్బాస్ " కొకర్ ట్రైలాజీ"లోని ఒక సినిమా." కొకర్ అనేది ఉత్తర ఇరాన్ ప్రాంతానికి చెందిన ఒక గ్రామం.
అబ్బాస్ కైరొస్తమీ చేసిన "where is my friends home "(1987), "And life goes on " (1992), " through the olive trees"(1994), ఈ మూడు సినిమాలు కొకర్ ట్రైలాజీగా పివవబడతాయ్. కొకర్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని అక్కడ ఆ ప్రాంతం భౌతిక పరిసారల నుంచి మనుషులు వాళ్ల కట్టుబాట్లు ఆచారాలు వాళ్ల మానసిక స్థితి చూపిస్తూ సినిమా తీశాడీ దర్శకుడు.
where is my friends Home లో కూడా అహమద్ అనే స్కూల్ కెళ్లే కుర్రాడు ఒకరోజు అనుకోకుండా తన ఫ్రెండు పుస్తకంబ్యాగ్లో పెట్టుకొస్తాడు. ఆ రోజు ఇచ్చిన హోం వర్క్ చేయకపోతే వాళ్లని స్కూల్ నించి తీసేస్తాం అన్న హెచ్చరిక చేస్తాడు టీచర్. ఇప్పుడా పుస్తకం ఆ స్నేహితుడిది అతనికి ఇచ్చేయాలి. అందుకోసం అహమద్ కొకర్ పక్కనున్న గ్రామంలో ఉండే తన స్నేహితుడి ఇళ్లు వెతుకుతూ పుస్తకం తీసుకుని బయలుదేరతాడు.
సినిమా అంత ఎగుడు దిగుడుగా ఉండేదారులుగా ఉన్న ఊరు చిత్రం కనిపిస్తుంది. మట్టిగోడలు. మనలా అమరిఉన్న ఇళ్లు దారులు పరిస్థితులు కావవి. అహమ్మద్ పుస్తకం పట్టుకు వెళ్లేదొకటే కాదు. అక్కడ అతడి వెంట ప్రయాణం చేస్తూ కొకర్ ప్రాంతాన్ని ఆనాటి పరిస్థితుల్ని చూపిస్తూ కట్టిపడేస్తాడు దర్శకుడు. ముఖ్యంగా ఆ పిల్లోడు నడిచెళ్లే ఆ ఎత్తుపల్లాల దారి మానవజీవితపు ఎగుడుదిగుడు పరిస్థితుల్ని మాట్లాడుతుంది. ఆ కుర్రోడి స్థానంలో మనం చేరిపోయి ఆ చీటిని. చీకట్లో నిశ్శంబ్ధంగా వెంటాడే గాలిని. భయపేట్టే కుక్కలనీ , గాలిదుమారాన్ని అనుభూతిస్తూనే జీవితాన్ని చూసిన ముదుసలి వ్యక్తి ఆవేదన ఆరాటాన్ని అనుభూతి చెందుతాం. ఒక వర్తమానాన్ని భవిష్యత్తును ఒకే తెరపై చూపిస్తూ కేవలం జీవితాన్ని మానవీయ నైతిక విలువల గురించి మాట్లాడతాడు దర్షకుడు. ఒక గమ్యం ఒక, ఒక లక్ష్యం ఆనుభవం దాని వెనక ఖర్చయ్యే జీవితం. జీవితంలో ఉండాల్సిన విలువలు. మానవత్వం. కాలంతో పాటు మారుతున్న విలువలు నాగరికత ఇలా అన్నీ ఈ గంట పదిహేను నిమిషాల చిత్రంతో కళ్ళకు కడతాడు దర్శకుడు. 

1987 లో ఈ సినిమా వచ్చాన  మూడుసంవత్సరాలకి 1990లో ఇరాన్ లో పెద్దభూకంపం వచ్చి 50000 మంది చనిపోయారు. ఆ కోకర్ ప్రాంతం నేలమట్టం అయింది. ఈ సినిమాలో చేసిన ఆ ఇద్దరు పిల్లవాళ్ళు బ్రతికే ఉన్నారా అన్న అన్వేషణతో ఒక దర్శకుడు అతడి కొడుకు కలిసి చేసే ప్రయాణం " and Life goes on" వీలయితే అదీ చూడండి. 

ఫెంటాస్టిక్ ఫైవ్ సినిమాలలో మొదటి రోజు సోమవారం :
••••••••••••••••••
••••••••••••••••••••••••••••••••••••••••••••••••
"lantouri-  లాంటౌరి "

ఇరాన్ భాషలో లాంతౌరి అంటే పోకిరి, రౌడి లాంటి అర్ధం. ఒక పోకిరిగా పెరిగిన వాడు జర్నలిస్ట్ ఇంకా ఆక్టివిస్ట్ అయిన  అమ్మాయిని ప్రేమిస్తున్నా అని వేదించి తను కాదు అన్నందుకు ముఖం మీద ఆసిడ్ పోసేయడం కథ. 

సినిమా చూడ్డానికి నేను చెప్పినంత స్ట్రైట్ గా కథ చెప్పడు దర్శకుడు. మానవహక్కుల కార్యకర్త , కవి , సగటు పౌరుడు , కన్విక్ట్ స్నేహితుడు మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయాలు చెపుతూ వెళ్ళడమే. సినిమా ఒకరి కళ్ళతో చూపించలేదు. సమాజం అంతా మాట్లాడుతుంది. అందరూ దోషుల దగ్గర నుంచి ఆ సంఘటనకి సంభంధం ఉన్న అందరితో మాట్లాడిస్తాడు దర్శకుడు. వాళ్ళు మాట్లాడుతున్నది వింటూ మనం కథని ఆ కోణాల్లో చూస్తూ వెళతాం. ఎవరు ఎలా మాట్లాడి వాళ్ళను వాళ్ళు ఆవిష్కరించుకున్న చివరికి యాసిడ్ దాడికి గురైన మరియం మాట్లాడేప్పటికీ సినిమా చూస్తున్న అందరూ  భావోద్రేకానికి లోనయ్యారు.
-" వెలుతురుందో చీకటో , ఇది పగలో రాత్రో , నేను చాలా సుదీర్ఘ నిద్రలో ఉన్నట్టున్నాను. నన్నెవరైనా వచ్చి లేపండి అని "-  యాసిడ్ దాడివల్ల కళ్ళు పోగొట్టుకున్న మరియం అడిగేప్పుడు గుండె చేరువైపోతుంది. 

మరణశిక్షకి వ్యతిరేకంగా పోరాడే ఆమెపైనే అలాంటి దాడి జరిగినప్పుడు ఆమె స్పందన చూసి మనమూ భావేశానికి లోనవుతాం. ఆ దోషి  పాషాకి శిక్ష అమలు జరిగే చివరి నిమిషంలో మరియం -" నేను క్షమిస్తున్నాను "అని చెప్పినప్పుడు పైడి జయరాజు హాల్ అంతా చప్పట్లు. ఆ చప్పట్లే చెప్తాయి ప్రేక్షకుడు ఆ సినిమాకి ఎంతగా కనెక్ట్ అయిపోయాడో. 

ప్రేమ అంటే ఏంటి ?  చూసి నవ్వగానే  అమ్మాయి ప్రేమించినట్టా ? కలిసి తిరిగితే అమ్మాయి ప్రేమిస్తున్నట్టా ? స్నేహం చేసిన ప్రేమనే అనుకోవాలా ? ఉన్మాదులుగా మారే వ్యక్తుల జీవితాలు వాళ్ళ  మానసిక ప్రవృత్తులు ప్రతీది ఒక గంట సమయంలో ప్రేక్షకుల ముందు ఆవిష్కరించాడు దర్షకుడు - "రెజా డార్మిసియన్" . స్కూలల్లో కాలేజీలలో ప్రదర్శించి స్టూడెంట్స్తో మాట్లాడించేలా చేయాల్సిన సినిమా. గుండెంత వేదనతో నిండిపోయి ఎన్నో ప్రశ్నలతో తిరిగిపంపిన సినిమా. అందరూ బయటికొచ్చి వేదనతో బాధని ఒకరి కళ్ళలోంచి మరో కళ్ళలోకి ఒంపుకున్న సినిమా. 


ఫెంటాస్టిక్ ఫైవ్ సినిమాలలో రెండో రోజు మంగళ వారం  :
••••••••••••••••••
••••••••••••••••••••••••••••••••••••••••••••••••
" My brother khosrow "

ఖోశ్రో అనే వక్తి బైపోలార్ డిసార్డర్తో మెంటల్ డిప్రెషన్లో  ఉండే వ్యక్తి. ఇతడికి ఒక తమ్ముడుంటాడు నాసర్ అని. అతడు డెంటిస్ట్. ఈ ఖోశ్రో కొన్ని రోజులు నాసర్ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అతడు అక్కడ ఎలాంటి ఎలాంటి పరిస్తితులకు కారణం అయ్యాడు ఎలా తన తమ్ముడితో గొడవలయ్యాయి. మానసిక బలహీనతలు మనిషిని మనుషుల మధ్య సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయి అన్న విషయాలను చక్కగా చిత్రీకరించాడు దర్శకుడు ఎహ్సాన్ బిగ్లరి.  

ఒక మనిషి జీవితంలో పెంపకం ఎంత ముఖ్యం. పెంపకం మనిషి జీవితంపై ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుంది. పెట్రియార్కియల్ వ్యవస్టలో మనిషి ఎలా రూపుదిద్దుకుంటాడు లాంటివాటిని సంఘర్షణాత్మక మానసిక ధోరణులని చక్కగా ఎలావేట్ చేస్తాడు దర్శకుడు. 

ఫెంటాస్టిక్ ఫైవ్ సినిమాలలో మూడో రోజు బుధవారం  :
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
" ROSVAEI "  రొస్వై 

రొస్వై అంటే" స్కాండల్ "అని. ఏం స్కాండల్ జరిగింది? ఇస్లాం మతగురువు ఇమామ్ , దేవుడు ఖురాన్ అంటే  తిరస్కారం ధిక్కారం ఉండి ఏ విధమైన మతాచారాలు పాటించని అమ్మాయికి సహాయ పడడం. 

లోకం దృష్టి ఎప్పుడూ ఎలా ఉంటుంది. అమ్మాయిని పొందాలనుకునే వాడు ఎన్ని రకాల ప్రయత్నం చేస్తాడు. అభ్యుదయవాదిలా మారడం వెనక పునాదుల్లో సనాతన ఆచారాల లోతులు ఎలా ఉంటాయో మాట్లాడుతుంది ఈ చిత్రం. 

అఫ్సానా అనే అమ్మాయి ఇంటికి పెద్దది తల్లి నడవలేదు. తండ్రి విపరీతమైన అప్పులు చేసి చనిపోతాడు. ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు. కుటుంభ బాధ్యతలు మోయడానికి దొంగతనాలు చేస్తూ వస్తుంది. వాళ్ళుంటున్న ఇల్లు ఆ ఊర్లో పేరు మోసిన హజిజ్ది . వాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కన్నేస్తాడు. వాళ్ళ నాన్న అప్పులని సాకుగా పెళ్లి చేసుకుంటే అన్నిటిని మాఫ్ చేస్తా అంటాడు. ఆ అమ్మాయి ఆ ప్రామిసరీ పత్రాలని దొంగతనం చేసి పారిపోతూ ఆ ఊర్లో పెద్ద పేరున్న మత గురువు ఇంట్లో దాక్కుంటుంది. అతడు ఆమెని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఆ అమ్మాయి అందరు మగవాళ్ళ లాగే ఆ ముసలి ఇమామ్ అనుకుంటుంది. కాని ఆ ముసలి ఇమామ్ తో తాను కలవడం తన జీవితంలో ఎలాంటి ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందో చూడాల్సిందే.

అమ్మాయి శారీరక అవసరాలకి ఒప్పుకుంటే ఒకలాగ ఒప్పుకోక పొతే నిందలేస్తూ ఒక లాగా. అలాంటి అమ్మాయిలకి సహకరిస్తే వాళ్ళనూ ఎంత వరకు భ్రష్టు పట్టించే విధానం ఏ ఒక్క ప్రాంతానికో బాషకో పరిమితమై లేదు. అన్నిటా ఎల్లడలా ఆడవాళ్ళ పరిస్టితి ఎంత దారుణంగా ఉంటుందో చూపించే సినిమా. చివరికి ఈ మగస్వామ్యంలో స్త్రీ పవిత్ర అపవిత్రతల నిర్ధారణ నిమిషాల మీద డిసైడ్ అయిపోయి ఆమెని షైతాన్ ని చేసి రాళ్ళతో కొట్టే వరకు వెళ్ళే సంఘటనలు కొత్తేం కాదు. అయితే ఆమె పరివర్తనను ఆమె పట్ల సమాజం తీరును చూపిస్తూనే అల్లకల్లోల పరిస్తితుల్లో ఇమామ్ రూపంలో వెంటిలేషన్ ఎలా దొరుకుతుందో చూపిస్తూ వెళ్ళడం. రెండు పాత్రలు ఆధునిక సనాతన ధర్మాల పోటీని సమర్ధవంతంగా మనకు కళ్ళకు కట్టడం చూస్తాం. చివరి వరకు ప్రేక్షకున్ని లాకేళ్లి ఆ ప్రార్ధనా మందిరం ముందు నిజాయతీగా మోకరిల్లెట్టు చేస్తాడు దర్శకుడు. మన సత్యం మన వెంటే వస్తుంది అనేది అంతః సూత్రంగా కనిపిస్తూ వస్తుంది.

నిజంగా నిజాయితీకి చివరి వరకు ఎవరు నిలువగలం. ప్రశ్నించుకుంటే మనమూ త్రాసులో తెలిపోతాం. 

ఫెంటాస్టిక్ ఫైవ్ సినిమాలలో నాలుగో రోజు  గురు వారం  :
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

VILAEIHA "  విలయిహ 

ఏం రాస్తాను ఈ సినిమా గురించి. దుఃఖమా. యుద్ధమా. యుద్దకాలంలో భర్తల కోసం ఎదురుచూసే స్త్రీల గురించా ?. తండ్రి రాక కోసం రాత్రంతా నిద్రపోకుండా ఎదురుచూసే పిల్లల గురించా ? లేని సముద్రాన్ని సృష్టించి చేపలు పట్టేఆట ఆడే తల్లి గురించా ? కొడుకుకి పిల్లల్ని చూపించాలని ఆరాటపడే తల్లి గురించా. ఎవరి కొడుకో  యుద్ధంలో గాయపడ్డ శతగాత్రుడు తల్లి గురించి పడే తపన గురించి ? నీ భర్త కొడుకు వీర మరణం పొందాడన్న ఉత్తరం ఎవరి పేరు మీదైనా రాని నాకు కాకూడదని భయపడే స్త్రీల గురించా ? బాంబు దాడిలో తల్లడిల్లే ప్రాంతం గురించా ? మనిషి రాక కోసం చూసే ఎదురు చూపు గురించా ?

ఎదురు చూపులు సినిమా అంతా ఎదురు చూపు . యుద్దానికి వెళ్ళిన కొడుకు ఇంటికెప్పుడొస్తాడనే ఎదురుచూపులు. భర్త రాక కోసం గుమ్మానికి కళ్ళు వేలాడదీసి ఎదురుచూసే భార్యలు. తండ్రిని హత్తుకుని పడుకోవాలని చూసే పిల్లల ఆరాటం . 

అజీజ్ అనే ముసలావిడ తన మనవడు మనవరాలుతో రెఫ్యూజీ సెంటర్ కి ఉండడానికి వస్తుంది. ఆమె కోడలికి పిల్లల్ని ఆ యుద్ధ వాతావరణంలో ఉంచడం ఇష్టంలేక దేశం ధాటి వెళ్ళాలని పాస్పోర్ట్ తీసుకుని పిల్లల్ని తీసుకెళ్ళడానికి వస్తుంది. ఎలియాస్ అనే ఒకే ఒక్క వ్యక్తి వాళ్లకు ఉత్తరాలు తెచ్చిస్తుంటాడు. ఆయన వాహనం వస్తుందంటే ఎవరిదో మరణ వార్త వస్తున్నట్టే. 

మనం ఎంత చక్కటి పరిస్థితుల్లో ఉన్నాం కదూ. కొంచెం కూడా దుమ్ము కనిపిస్తే తట్టుకోలేని ప్రాణులం . కాని అటుగా ఒక ప్రపంచం ఉంది అక్కడ నిత్యం యుద్ధమే జీవితంగా బ్రతికే వాళ్ళ జీవితాలు కేవలం ఆ రోజుకోసం బ్రతకడం ఎంత ముఖ్యమో మాట్లాడుతుంటాయి. ఆ వేదన ఎంత రాసినా తగ్గదు చూడాల్సిందే 

" మోనిర్ గేహ్ది "ఈ సినిమాకి  దర్శకురాలు.  అన్ని ఆంక్షల్లో ఆడవాళ్ళు సినిమా రంగంలో రాణించడం ఇలాంటి సినిమాలు ప్రపంచ సినిమా ప్రదర్శనల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం అభినందించాల్సిన విషయం. 

ఫెంటాస్టిక్ ఫైవ్ సినిమాలలో ఐదో రోజు  శుక్ర వారం  :
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

" breath  " బ్రీథ్

యుద్ధాన్ని ఒక పదేళ్ళ తెలివైన  పాప కళ్ళతో చూపించిన సినిమా.. ఆ పాప వెంట వెళ్తూ తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటూ చివరికి ఎంతో తెలివైన భవిష్యత్తు గురించి ఎన్నో కోరికలతో కలలు కనే పాప యుద్ధ రాక్షసినోటికి బలైపోయిన కథ. 

చదువంటే అమితంగా ఇష్టపడే క్లాస్లో అందరికంటే ముందుండే పాప. కొత్త విషయాలను ఎప్పటి కప్పుడు చదివి తెలుసుకోవాలనే కుతూహలం కలిగిన పాప. పెద్డైయ్యాక వైద్యురాలై తండ్రి ఉబ్బసం రోగాన్ని నయం చేయాలనుకునే పాప యుద్ధం మింగేయడం చూడగలమా ?

కాని యుద్ధం అలాంటి ఎందఱో చిన్నారుల జీవితాల్ని చిదిమేస్తూనే ఉంది. సినిమా మొదటి నుంచి చివరి వారకి దర్శకురాలు ప్రేక్షకున్ని కదలనివ్వకుండా కట్టి  పడేసింది. 

“Cinema, culture and art do not recognize any border, but in fact bring humanity closer together,” అని చెప్పే ఈ దర్శకురాలు Narges Abyar .  ఆస్కార్ క ఇరాన్ నుంచి ఉత్తమ చిత్రంగాఎంట్రీ పొందింది.  హృదయం ఉంది అనుకున్న ప్రతి వాళ్ళు చూడాల్సిన సినిమా 

లాంతౌరి బ్రీథ్ , విలయిహ  చూసి మూల్గులు తీయని గుండె వుండదు కన్నీరు కార్చని నయనం ఉండదు.అంటే మానవత్వంతో తొణికిసలాడే వాళ్ళు కాకుంటే తప్ప . మై బ్రదర్ ఖోశ్రో రొస్వై చూసి భావోద్రేకానికి గురవని హృదయం ఉండదు. ఈ అయిదు రోజులు ఇరాన్ లోని ప్రతి ప్రాంతాన్ని తిరిగి చూసిన అనుభూతి. ప్రతి ఇరానియన్ మనకి బాగా కావలసిన వాళ్ళే అన్న భావన. ఇవి మన జీవితంలోని కథలే మన మాటలే అన్న మనతనం. 

అధ్బుతమైన పర్షియన్ సినిమాలను" ఫెంటాస్టిక్ ఫైవ్ గా  " ప్రదర్శించిన తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖకి మామిడి హరికృష్ణ అన్నకి కృతజ్ఞతలు. ఔత్సాహిక సినిమా దర్శక నటులను ప్రోత్సహించేందుకు మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం.మీరు చేస్తున్న ఈ  వ్యవసాయం ముందు ముందు మీరు ఆశించిన మంచి రాబడినిస్తుందని ఆశిస్తూన్నాను 


No comments:

Post a Comment