Wednesday, February 28, 2018

శివా రెడ్డి గారితో బ్రెజిల్ ముచ్చట్లు

శివా రెడ్డి గారు బ్రెజిల్ గారు భారత దేశం తరపున మరో ఇద్దరుకవులతో కలిసి బ్రెజిల్ ప్రయాణం చేసోచ్చారు. ఒక కవిగా ఆయన అనుభవాలు . ఆయన యాత్ర విశేషాలు ఆయనతో సాగిన మాటా మంతి ఉన్నది ఉన్నట్టుగా ..

మెర్సీ : సర్ ఇంతకు ముందు చాల ప్రయాణాలు చేసారు కదా వాటన్నిటి కన్నా ఈ ప్రయాణం
ఎందుకు ప్రత్యేకమైనది ?

శివారెడ్డి సర్ : అమెరికా పోయా. ఇంగ్లాడ్ పోయా . జర్మనీ పోయా. కువైట్ పోయా.
వివిధ దేశాలకు వెళ్ళొచ్చా కాని ఈ ట్రిప్ చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఒకటే ఈ వయసులో
26 గంటలు విమాన ప్రయాణం చేయడం. రెండు ఒక దేశం నుంచి ముగ్గురు కవులను
ఎక్స్లూసివ్ గా ఇంకో దేశం పంపించడం. ఇది ఒక దేశ సాహిత్యకారులని ఇంకో దేశానికి పంపడం.
వాళ్ల దేశం నుంచి మళ్ళీ మన దేశానికి రావడం ద్వారా జరిగే “కల్చరల్ ఎక్స్చేంజ్ “అనుకోవాలి.
ఎలా అయితే భారతీయ కవులంగా మేము వెళ్లి కవితలు చదివి బ్రెజిల్ తిరిగొచ్చామో అలాగే వచ్చే
రోజుల్లో బ్రెజిల్ నుంచి ఇంకో కవిత్వ బృందం భారతదేశం వచ్చి తమ కవితలు చదవడం
భారతదేశాన్ని చూసి వెళ్ళడం జరుగుతుంది.


మెర్సీ : ఈ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రయాణ భాద్యతలు , రూపకల్పన ఎవరిది ?
ఎవరెవరు పాలు పంచుకున్నారు ?

శివారెడ్డి సర్ : సాహిత్య అకాడెమి , మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ నుంచి పంపారు.
బ్రెజిల్ లో వాళ్ళ ఎంబసి వాళ్ళు మా వసతి భోజన సదుపాయాలన్నీ చూసుకున్నారు. మేము
వెళ్లకముందే కవితలు పంపమన్నారు. మా బృందంలో ముగ్గురు కవులం తలా ఆరు ఏడూ కవితల్ని
వాళ్లకు పంపాం. అవి పోర్చుగీసులోకి అనువాదం చేయబడ్డాయి. బ్రెజిల్ రాజబాష పోర్చుగీసు. వాళ్ళది
పోర్చుగీసు కాలని. మనది బ్రిటిష్ కాలని. అందుకని వాళ్లకి ఇంగ్లీషు భాష లాంటివి రావు.


మెర్సీ : ఒక సాధారణ వ్యక్తిగా లేక కవిగా మీరు బ్రెజిల్ ని ఎలా చూసారు ?

శివారెడ్డి సర్ : బ్రెజిల్ మనకన్నా చాలా పెద్ద దేశం. మన కన్నా ముందు స్వాతంత్ర్యం
సాధించుకున్న దేశం. మనకు౦ 170 ఏళ్ళ కిందే స్వాతంత్ర్యం వచ్చింది. కల్చరల్ హెరిటేజ్
ఉన్న దేశం. దానిదైన ఉద్దేశానికి దానిదైన ఒక కల్చర్ దానిదైన ఒక అభివ్యక్తి , వ్యక్తిత్వం ఉంది.
మనిషికి ఉన్నట్టుగానే ప్రతిదేశానికి దానిదైన స్వభావము వ్యక్తిత్వమూ ఉంటుంది.
బ్రెజిల్ కూడా అంతే . బ్రెజిల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫుట్ బాల్ గేం , ఫుట్ బాల్ టీం ,
ఫుట్ బాల్ ప్లేయర్ పేలే, అలాగే కాఫీ గుర్తొస్తుంది.అంత అధ్బుతమైన కాఫీ ఇంకెక్కడా తాగలేదు.

మెర్సీ : మీ బృందంలో ఎవరెవరు ఉన్నారు ? ఏ ఏ ప్రాంతానికి చెందిన కవులు
ఇక్కడ భారతదేశం నుంచి బ్రెజిల్ వెళ్ళారు ?

శివారెడ్డి సర్ : తెలుగు కవిగా నేను , కాశ్మీరీ కవి షఫీ షౌక్ , ఒరియా కవయిత్రి మోనాలిసా.
మమ్మల్ని ముగ్గురిని బ్రెజిల్ పర్యటనకి గాను ఎంపిక చేసి పంపించారు. ధిల్లీ వెళ్లి ధిల్లీ నుంచి
దుబాయ్ వెళ్లి అక్కడ నుంచి బ్రెజిల్ వెళ్లాం. బ్రెజిల్ రాజధాని అయిన  బ్రెసిలియాకి వెళ్లాం.
ఇలాంటి ప్రయాణాలు ఊహాశక్తిని ఇస్తాయి. అవి రాయడానికి ప్రేరణనిస్తాయి.

మెర్సీ : బ్రెజిల్ లో ఏ ఏ ప్రాంతాల్లో మీరు మీ కవితల్ని చదివి వినిపించారు. ?

శివారెడ్డి సర్ : బ్రెజిల్ లో మూడు నగరాలు తిరిగాం. ఒకటి బ్రెసిలియా, రెండోది సాపౌలో,
మూడోది రియో. ఈ మూడు పట్టణాలలో కవిత్వ పఠనం చేశాం. అప్పటికీ మా కవితలు
పోర్చుగీసులోకి అనువాదం అయి ఉండడం వల్ల అప్పటికప్పుడు ఏదైనా మాట్లాడితే
వెంటనే దాన్ని పోర్చుగీసు భాషలోకి అనువదించి చెప్పడానికి ఒక అనువాదకుడు దాన్ని
పోర్చుగీసులో చెప్పేవాడు. నేను ఓ కవితని తెలుగులో చదివాక మిగితావి మిగిలినవి
ఇంగ్లీషులో చదివా వాటికి సమాంతరంగా అనువాదాలు చదివారు

మెర్సీ : మీరు అక్కడున్నప్పుడు మిమ్మల్ని కవిత్వం రాసేట్టుగా ఏదైనా అంశాలు
ప్రేరేపించాయి ?
శివారెడ్డి సర్ : మేము అక్కడ ఉన్నప్పుడే వాళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.
ఆ వేడుకలపై నేను ఓ కవిత రాసాను. షఫీ షౌక్ కూడ కవిత రాసాడు.
నేను మొత్తం ఎనిమిది కవితల వరకు రాసాను. ఇంగ్లీషులో కూడా కవితలు రాసాను.

మెర్సీ : మీ ముందటి అంతర్జాతీయ ప్రయాణమప్పుడు ఎప్పుడైనా ఇలాగే కవిత్వం
రాసారా ?
శివారెడ్డి సర్ : నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక్క కవితా రాయలేదు.
జర్మనీ వెళ్ళినప్పుడు నెల రోజులు ఉండొచ్చా ఒక్క కవితా రాయలేక పోయా.
అలాగే కువైట్ వెళ్ళినప్పుడు కూడా . ఒక్క కవిత రాయలేకపోయాను. ఇంగ్లాడు వెళ్ళినప్పుడు
ఒక పదికవితల వరకు రాసాను. మళ్ళీ బ్రెజిల్ వెళ్ళినప్పుడు రాసాను.

మెర్సీ : మీరు పర్యటించిన దేశాలలో కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు రాయలేక పోవడం

బ్రెజిల్ ఇంగ్లాడ్ వెళ్ళినప్పుడు రాయడం వెనక కారణం ఏమై ఉండొచ్చు ?
శివారెడ్డి సర్ : కొత్త మనుషులు , కొత్త ప్రాంతం , కొత్త వాతావరణం రాయడానికి ఓ కవికి కొత్త

ఊహా శక్తిని ఇస్తాయి. అవి రాయడానికి ప్రేరణనిస్తాయి. ఎప్పుడైతే కవి ఆ వాతావరణంతో

తెలియకుండా మమైకం అవుతాడో అప్పుడే కవిత్వాన్ని పలకగలడు. అందుకు కవి మానసిక

స్థితి కూడా అనుకూలంగా ఉండాలి.


మెర్సీ : బ్రెజిల్ లో  మీరెక్కడెక్కడ కవితలు చదివారు ?
శివారెడ్డి సర్ : నేను బ్రెజిల్ యూనివర్సిటీలో చదివాను.
 బ్రెజిల్ రాయబార కార్యాలయంలో రెండో రోజు సాయంత్రం చదివాను.
రాజధాని  బ్రెసిలియాలోని ఒక యూనివర్సిటీలో మొదటి రోజు చదివాను.
అక్కడి నుంచి సాఫౌలో కెళ్ళాం. సాఫౌలో లో నే ప్రపంచ ప్రసిద్ది గాంచిన అరెనా డే సాఫౌలో
అనే ఫుట్ బాల్ స్టేడియం ఉంది.  అరవైదు వేల  ఎనిమిది వందల మంది ప్రేక్షకులు కూర్చునే
స్టేడియం. అదీ గాక ఇరవై వేల తాత్కాలిక సీట్లు అదనం. ఇంకా అక్కడ గ్రాఫిటీ చేసిన
గోడలతో పెద్ద వీది ఉంది. అక్కడ ఆ బొమ్మలు యుద్ధానికి సంబంధించి ఆ విధ్వంసానికి
సంబంధించిన చిత్రాలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. యుద్ధాలు లేని శాంతియుత
ప్రపంచాన్ని కాంక్షిస్తున్నట్టు ఉంటాయి ఆ గ్రాఫిటీ చిత్రాలు. ప్రతి మూడు నెలలకు
ఒకసారి కొత్తగా మళ్ళీ వాటిపై చిత్రిస్తూనే ఉంటారట.

సాఫౌలో వెళ్ళిన వాళ్ళు స్టేడియం , గ్రాఫిటీ వేసిన గోడలు చూడకుండా వెళ్లరు.
సాఫౌలోలో రెండు స్థలాల్లో కవితా పఠనం చేశాం. సాఫౌలో లోని  “ పెద్ద బుక్ స్టోర్స్  చైన్ “ ఉంది.
అది ఓ పెద్ద పుస్తకాల వీధి. దాని పేరు “ లివరేరియా కాల్చుర “ ( Livararia Cultura )
అక్కడా రెండు చోట్ల వేదికలా వేసి పుస్తకాలు కొనడానికి వచ్చే వాళ్ళు వినేలా
కవితా పఠనం ఏర్పాటు చేసారు.   

ఫుట్ బాల్ మ్యూజియం చూసాం. ఫుట్ బాల్ ఆట ఎలా పుట్టింది ఎలా పరిణామం
చెందుతూ వస్తుంది అని అక్కడ ఒక షో వేసారు. అక్కడ నుంచి రియోలో కూడా ఫిలాసఫీ
డిపార్ట్మెంట్ లో సెలెక్టెడ్ ఆడియన్స్ మధ్య కవితా పఠనం చేసాం.  

మెర్సీ : సాఫౌలో లో మాట్లాడారన్నారు కదా ? ఏ విషయాలు మాట్లాడారు?
శివారెడ్డి సర్ : సాఫౌలో లో నాకు పది నిమిషాలు మాట్లాడే అవకాశం లభించింది.
బ్రెజిల్ భారత దేశానికి మధ్య ఉన్న సామ్యం గురించి, రెండు దేశాలు కలోనియల్ గా
వ్యత్యాసాలున్న దేశాలు. వాళ్ళది ముందుగా చెప్పినట్టు పోర్చుగీస్ కాలనీ, మనది బ్రిటిష్ కాలనీ.
వాళ్లకి ముందు స్వాతంత్ర్యం వచ్చింది. మనకన్నా వంద సంవత్సరాల ముందే
వాళ్లకి స్వాతంత్యం వచ్చింది. వాళ్ళది కూడా రిచ్ కల్చర్ , సామ్యవాద దేశం.
99% మంది పోర్చుగీస్ మాట్లాడేవాళ్ళే. మూడు పట్టణాల్లో కవితలు చదవడం.
వాళ్లకు మనకి ఉన్న పోలికలు బేధాలు వివరించడం. భారత దేశం యొక్క సారాంశాన్ని
కూడా వల్ల ముందు వ్యక్త పర్చడం. ఇన్ని కులాలు ఇన్ని మతాలూ, భాషలూ,
వివిధ ఐడెంటిటీలు, అభిప్రాయాలు  కమ్యూనిటీలుగా ఉన్న ఈ దేశం ఎలా ఐక్యంగా
నిలబడి ఉండగలుగుతుంది అనేది మాట్లాడను. గ్రేట్ డైవర్సిటీ ఉండి కూడా యూనిటి
ఎలా కలిగిఉంది. అలాగే తెలుగు సాహిత్యంలో వచ్చిన ట్రెండ్స్. గురజాడ నుంచి
శ్రీ శ్రీ వరకు , ఉనికికి సంభందించిన సాహిత్య ధోరణుల గురించి మాట్లాడాను.
1986 తరువాత దళితవాదం, స్త్రీ వాదం, ప్రాంతీయ వాదం,
వీటిని ప్రాతిపదికగా చేసుకొని ఎంతటి గొప్ప సాహిత్యం వచ్చిందన్న విషయాలు మాట్లాడను.

మెర్సీ : బ్రెజిల్ లో  మీకు చూడగానే  నచ్చిన ప్రదేశాలు , అబ్బురపరిచిన సన్నివేశాలు
ఏమైనా ఉన్నాయా సర్ ?
శివారెడ్డి సర్ : బ్రెజిల్ వెళ్ళే ముందు బ్రెజిల్ సాహిత్యం గురించి కొంత చదివి వెళ్లాను.  
మనకి లాగే వాళ్ళకూ జాతీయకవి ఉన్నారు. కార్లోస్ ద్రుమ్మండ్ డే అన్ద్రాడే
( Carlos Drummond de Andrade ). మనకి శ్రీ శ్రీ ఎలాగో వాళ్లకి అన్ద్రాడే అలాగ.
రియోలో అట్లాంటిక్ సముద్రానికి ఉన్న బీచ్ లలో ఎక్కువ మందిని ఆకర్షించే
ఒక బీచ్ ఉంది.  అది “ కోపకబాన “ ( Copacabana ) బీచ్. ఆ బీచ్ అంత “ఫుల్ అఫ్ లైఫ్ “.
ఆ బీచ్ లోనే కార్లోస్ ద్రుమ్మండ్ డే అన్ద్రాడే విగ్రహం బీచ్ బెంచీ మీద కూర్చున్నట్టు
ఉంటుంది. మనకు లాగ చచ్చిపోయిన వాళ్ళని ట్యాంక్ బ్యాండ్ మీదో మూసి నది పక్కనో
కాదు. అక్కడ ఆ కవి కూర్చుని ఆలోచిస్తూ మనలని పలకరిస్తున్నట్టు జీవించి ఉంటున్న
వాడిలాగే ఉంటాడు. ఆయనతో ఫోటో తీసుకున్నా.
అక్కడే రియో లో Rio de Janeiro అనే”  క్రైస్ట్ ది రిడీమర్ “ విగ్రహం ఉంది. అది 98 అడుగుల
ఎత్తున్న విగ్రహం. చూడగానే ఆకట్టుకునేట్టు బీచ్ పక్కన ఎత్తైన ఒంటిశిల కొండ పైన
చెక్కబడింది. అసలు అక్కడ అలా చెక్కడం పెద్ద సాహసం. ఆ శిల్పి ని మెచ్చుకోవాల్సిందే.
అక్కడ జాతరలా ఉంటుంది. అది చూడాల్సిందే అక్కడికి వెళితే.
నాకు ఒక మిగిలిపోయిన కోరికగా అనిపించింది మాత్రం అక్కడ గ్రామాలని చూడలేకపోవడం.
అక్కడ గ్రామాలు ఎలా ఉన్నాయో చూడాలన్న కోరిక ఉండిపోయింది. ఎందుకంటే బ్రెజిల్
అనే దేశం పాలకీ , పాడికీ గొప్ప పేరున్న దేశం. అయితే అది ఒక పది రోజుల ట్రిప్ మాత్రం
అవడం వల్ల అన్నీ చూట్టం కుదరలేదు.

మెర్సీ : సర్ ఇలాంటి ప్రయాణాల వల్ల ఏంటి లాభం ?
శివారెడ్డి సర్ : ఏ కొత్త ప్రాంతానికైనా వెళ్ళినా అది ఒక లాంటి జ్ఞాన సముపార్జన.
అది నైసర్గికమైనది కావచ్చు. భౌగోళికమైనది కావచ్చు. సాహిత్యపరమైనది కావచ్చు.
ఇవన్నీ మనకూ వాళ్ళకున్న సామ్యాన్ని స్వారూప్యాన్ని తెలియజేస్తాయి. వాళ్లకతో మనకున్న
గొప్ప సాహిత్య సంపదల్ని పంచుకోడానికి   వీలవుతుంది. కవి ప్రయాణాల ద్వారా తన
దృష్టిని ఇంకా తేట పరుచుకోగలడు. సాహిత్య అకాడెమీ వాళ్లు కూడా మందలా మమ్మల్ని
తోలకుండా ముగ్గురిని పంపడం ద్వారా కొంత ప్రశాంతంగా అక్కడి వాతావరణాన్ని
ప్రదేశాల్ని అర్ధం చేసుకుని కొంత చిక్కటి అనుభవాల్ని పొందేందుకు అవకాశం కలిగింది.

మెర్సీ : చివరిగా మీ ఈ బ్రెజిల్ యాత్ర గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ?
శివారెడ్డి సర్ : వాళ్లకు సాహిత్యంలో నోబుల్ ప్రైజ్ రాలేదు. వాళ్ళ సాహిత్యం అందరికీ
తెలియకపోవడానికి వాళ్ళ సాహిత్యం వేరే భాషల్లోకి వెళ్లకపోవటం కూడా ఒక కారణం
అయ్యుంటుంది. మేమైనా కేవలం బయట బయట చూసాం తప్ప అంతగా అంతర్వీక్షణం
చేయగలిగే వీలు చెక్కలేదు. అక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వంగా ఉన్నారు. అమెరికాలా
కాకుండా బ్రెజిల్ శాంతిని కోరుకునే దేశం. అమెరికా దురాక్రమణ చేసే దేశంగా కనిపిస్తే.
బ్రెజిల్ కి దానికై దానికి స్వంత నాగరికత సంస్కృతి ప్రత్యేకత ఉన్నాయి దానికి
స్వాతంత్రోద్యమ స్ట్రగల్ ఉంది.

“life is short knowledge is infinity “ అని యూలిసిస్ ( ulysis )తన పోయెంలో అన్నట్టు,
తిరగటం వల్ల వచ్చే జ్ఞానం గొప్పగా ఉంటుంది. చదవడటం కన్నా చూడటం వల్ల
నాలెడ్జ్ ఎక్కువగా వస్తుంది.





























No comments:

Post a Comment