Thursday, March 1, 2018

"నాటు వైద్య రత్న " లక్ష్మీ కుట్టి అమ్మ

కేరళలో ఫిబ్రవరి 16, 17, 18 తారీఖుల్లో జరిగిన దక్షిణ భారత దేశ సాహిత్య సాంస్కృతిక సమ్మేళనంలో పాల్గొనేందుకు నాకు ప్రత్యేక ఆహ్వానం అందింది. సాహిత్య సదస్సులో మాట్లాడేందుకు "వర్తమాన / ఆధునిక తెలుగు కవిత్వంలో స్త్రీల జీవిత చిత్రణ " అన్న అంశం మీద ప్రసంగిన్చేందుకు వాళ్ళు నన్ను ఆహ్వానించారు. ఈ సదస్సుల్లో పాల్గొనడం నాకు ఎంతో ఆనందం కలిగించాయి. అందుకు కారణాలు అనేకం. ఒక్కొక్కటిగా నా బ్లాగులో ఇలా రాస్తాను.

పరపతి పదవి ఆస్థి అంతస్తులు వుపయోగించి అవార్డులు కోసం వెంపర్లాడే వాళ్లు పద్మ భూషన్లు పద్మ విభూషన్లు రాజకీయ పరపతిని ఉపయోగించి తెచ్చుకునే వాళ్ళని ఎందరినో చూస్తున్నాం.  కానీ ఆదర్శం కోసం నిలబడే వాళ్ళు ఆదర్శవంతమైన జీవితం జీవించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు.  అవార్డులు వచ్చిన వాళ్లనందరిని  గుర్తుంచుకోలేంకానీ జీవితాన్ని అవార్డుల కన్నా ఉన్నతంగా స్వీకరించే లక్ష్మి కుట్టి అమ్మ లాంటివాళ్లు  అనేకమందిని  స్ఫూర్తిపొందేలా చేయడం చాలా అరుదుగా తారసపడే యదార్ధం .  అలాంటి లక్ష్మి కుట్టి అమ్మతో వేదిక పంచుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని విషయం

                                                           * * * * * * * * * * *

మొదటి రోజు నేను "పద్మ శ్రీ" అవార్డు గ్రహీత  లక్ష్మి కుట్టి అమ్మతో వేదిక పంచుకోవడం. 75 ఏళ్ళ యువ రక్తంతో యువకుల కన్నా ఎక్కువ  చలాకీగా కనిపిస్తూ మాట్లాడే లక్ష్మి కుట్టి అమ్మ. మాట్లాడమని పిలిచినప్పుడు గంట సేపు గుక్క తిప్పుకోకుండా మాట్లాడి ఆహుతులను ఆశ్చర్యచకితులను చేసిన లక్ష్మి కుట్టి అమ్మతో వేదిక పంచుకోవడం ఒక విశేషం అయితే ఆవిడతో మాట్లాడి ఆవిడ గురించి సమాచారం తెలుసుకుని ఆశ్చర్య పోవడం ఇంకో విశేషం.

ఆమె అడవికే అమ్మ . కేరళలో ఓ గిరిజన వర్గానికి చెందిన ఆమె తన జ్ఞాపకశక్తిలో నిక్షిప్తమైన 500 లకు పైగా ఔషధాలను తయారుచేసి అక్కడి గిరిజనులకు వైద్యురాలిగా పేరు తెచ్చుకుంది. ఆమె సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆమెకు భారత ప్రభుత్వం ఇచ్చే నాలుగవ స్థాయి అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చి సత్కరించింది.

తిరువనంతపురం జిల్లా " కల్లార్ " అనే ప్రాంతంలో , ఈత కొమ్మలతో కప్పబడ్డ ఒక చుట్టు గుడిసెలో ఉంటున్న ఈ 75 ఏళ్ళ తల్లి కవిగా , పాము కాటుకువిరుగుడు మందు ఇచ్చే వైద్యురాలిగా , ఉపాధ్యాయురాలిగా సుప్రసిద్ధురాలు. తన ఇంటి చుట్టూ అందుబాటులో ఉన్న ఔషధ  మొక్కలతో  తన దగ్గరకు వచ్చే వారికి వైద్యం చేయడమే కాకుండా ఆ విషంతో  ఉక్కిరి బిక్కిరయ్యే ఆ భాదితులకు తన మాటలతో ఉపశమనం కలిగిస్తుంది.

దేశంలోనే అత్యుత్తమ నాలుగవ పౌర పురస్కారం పద్మ శ్రీ అందుకున్న లక్ష్మీ కుట్టి అమ్మ అవార్డు స్వీకరిస్తూ చెప్పిన మాటలు ఆమెలోని సమాజం పట్ల ప్రేమ , తన ప్రజల జీవితాల పట్ల తనకున్న ఆర్తిని కనపరుస్తాయి. __"  మా ఊరికి ఇప్పటికీ రోడ్డు లేదు. 1952 లోనే రోడ్డు వేయమని అనుమతులు జారీ అయినా ఇంత వరకు అది మొదలైన పాపాన పోలేదు. కొన్ని కిలోమీటర్లు మా గ్రామాలగుండా  అడవుల్లోంచి దాటి ప్రయాణం చేసి పట్టణాలకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి  వస్తుంది. ఆ ప్రయాణంలో అప్పుడప్పుడు క్రూరమృగాలు ఏనుగులు తారసపడి భయపెడుతుంటాయి. అందువల్ల అనారోగ్యంగా ఉన్న వాళ్ళు అస్వస్థులను నా దగ్గరకి మెరుగైన వైద్యం కోసం తీసుకురాడానికి చాలా సమయం పట్టి వైద్యం అందక చనిపోతున్నవారు కూడా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుని రోడ్డు వేయించే పనికి సత్వరం పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను " ___

తిరువనంత పురానికి 43 కి.మీ.ల దూరంలో రెండు కిలోమీటర్లు అలా పైకి వెళ్ళే అరణ్య మార్గంలో నడిస్తే  పాము కాటుకు , విషానికి విరుగుడు ఇచ్చి బ్రతికించే మన లక్ష్మి కుట్టి అమ్మ నివాసం తారస పడుతుంది. వెదురు బొగులు చుట్టూ పాతి దాన్ని ఈత ఆకులతోకప్పినట్టు ఉండే గుడిసెలోనే లక్ష్మి కుట్టి అమ్మ నివాసం.

ఆ ఇంటిని అక్కడి ఆదివాసి గిరిజనుల తెగల వాళ్ళు "శివ జ్యోతి " అని పిలుచుకుంటారు. ఆ ఇంట్లో
ఎప్పుడు ఆరిపోకుండా వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ కరెంటు కూడ లేని ప్రాంతంలో ఏ రాత్రి వెళ్ళినా వైద్యం అందుతుంది. రాత్రుళ్ళు కూడా ఆ ఇంట్లో దీపం ఆరిపోదు. ఆమె ఇంటి చుట్టూ. నానా రకాల ఔషధ మొక్కలు వ్యాపించి ఉంటాయి. ఈ లక్ష్మి కుట్టి అమ్మకు మాత్రమె ఏ మొక్కలతో ఏ పాము విషానికి విరిగుడు మందు ఇవ్వచ్చో తెలుసు. తనకు తెలిసిన జ్ఞానం తన జ్ఞాపకంలో ఉన్న వాటితో ఆమె సుమారు  అయిదు వందల మందులను తాయారు చేయగలదు. రోజు వేలకొలది గిరిజనులు వివిధ గ్రామాలనుంచి ఆమె దగ్గరకి వైద్యం కోసం ఆమె దగ్గరకి వస్తారు.

కొంత మంది వైద్యం కోసం వస్తే మరి కొంత మంది ఆమె దగ్గర ఆ వైద్య విద్యని నేర్చుకోడానికి వస్తారు. ఆమె కథలు అల్లుతుంది కవిత్వం కూడా రాస్తుంది. ఆమె ఉంటున్న ఆ అడవిలో ప్రతి మూల మూల ఆమెకి పరిచయం.గొప్ప గొప్ప చదువులు చదువుకున్న , సాంఘీక స్థాయి ఉన్న వాళ్ళ మధ్య ఈ సంవత్సరానికి గాను" గోట్ర" తెగకు చెందిన మన లక్ష్మి కుట్టి అమ్మ ఎంతో గౌరవంగా పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించింది.

ఆమె అంటుంది -" అనారోగ్యాన్ని , రోగాన్ని దేవునిగా చూడాలి . వైద్యం అంటే మనకు తెలిసిన ఆకులనే మూళికలు ఔషదాలనే శ్లోకాలుగా మంత్రాలుగా భావించి ఉచ్చరిస్తూ అర్చన చేయటం "- అని .

ఆమెకి జాతీయ గుర్తింపు వచ్చినా చాల సామాన్యురాలిగా తనని తానూ చూసుకోవటం ఆమె గొప్పతనానికి నిదర్శనం. ప్రక్రుతి అడవి తనకు చాల నేర్పాయని లక్ష్మి కుట్టి అమ్మ చెప్తుంది. మిమ్మల్ని కాటేసిన పాముని మీకు హాని చేసిన జంతువులను చంపొద్దు అని ఇతర వైద్యుల్లాగే ఆమే చెప్తుంది. రేబిస్ వ్యాదికి తప్ప మిగత అన్నీ రోగాలకి ఆమె మందులిస్తుంది.

ఆమె చెప్తుంది- ఎవరైనా ఆపదలో ఉంటే తనలోని అంతరంగం తనకి ఆ విషయం ముందే తెలియజేస్తుందని. అప్పుడు తను వాళ్ళు వచ్చేప్పటికి ఆ మందులని సిద్ధం చేసుకుంటుందట .
కొన్న సార్లు ఆమె వైద్యం అవసరం ఉన్న వాళ్ళు రోజుల తరబడి ఉండిపోవలసి వస్తుంది. ఆమె వాళ్లకి వసతి భోజన సదుపాయాలు చూసుకుంటుంది.

1995 లో కేరళ ప్రభుత్వం ఆమె సేవలని గుర్తించి " నాటువైద్య రత్న " బిరుదుతో సత్కరించింది. ఇప్పటివరకు లక్ష్మి కుట్టి అమ్మ ౩౦౦ మందికి పైగా పాముకాటుకు గురైన వ్యక్తులకు విరుగుడు మందిచ్చి వాళ్ల ప్రాణాలని కాపాడింది.

పరిశోధక విద్యార్ధులు కూడా ఆమె దగ్గర నేర్చుకోడానికి వస్తారు. అలా ఎందరికో ఆవిడ గైడ్ లాగ వ్యవహరించి వాళ్ళ పరిశోధనలకు సహాయపడింది. వివిధ యూనివర్సిటీలకు విసిటింగ్ ప్రొఫెసర్ గా కూడా ఉన్నారు లక్ష్మి కుట్టి అమ్మ.

జవహర్ లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ , ఇంటర్ నేషనల్ బయో డైవర్సిటి బోర్డ్ , ఇంటర్ నేషనల్ బయో డైవర్సిటి సెంటర్ లాంటి యూనివర్సిటీలకు తన సేవలందిస్తున్నారు లక్ష్మి కుట్టి అమ్మ .

కేరళలో ఇలా నాటు వైద్యం తెలిసిన సంతతికి చెందిన వాళ్ళలో లక్ష్మి కుట్టి అమ్మే చివరది.
ఎనిమిదో తరగతి వరకు చదివిన లక్ష్మి కుట్టి అమ్మ మళయాళమే కాకుండా హిందీ ఇంగ్లిష్ కూడా మాట్లాడగలదు . తనకున్న సాహిత్య అభిరుచితో మలయాళ సాహిత్యాన్ని విపరీతంగా చదివే కుట్టి అమ్మ కవిత్వం కూడా  రాస్తుంది . తన కవిత్వం వివిధ సంకలనాలుగా కూడా ప్రచురించ బడింది. చదువుకోవాలన్న ఆసక్తి కలిగిన లక్ష్మి కుట్టి అమ్మ తమ సామాజిక వర్గం నుంచి ఆ ప్రాంత గిరిజనుల్లోనే మొదటిగా చదువుకున్న మహిళ. చదువుకోడానికి " కల్లార్ " నదిని దాట వలసి వచ్చేది. ఆ నది మీద ఇప్పటికి వంతెన లేదు. ఆ నదిపై వంతెన రావాలని వాళ్ల గిరిజన గ్రామానికి రోడ్డు రావాలని లక్ష్మి కుట్టి అమ్మ ఆశతో ఎదురు చూస్తుంది.

లక్ష్మి కుట్టి అమ్మ ఎందరికో ఆదర్శం . తన కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
-
మెర్సీ మార్గరెట్

నేను లక్ష్మి కుట్టి అమ్మ రామ నున్ని దక్షిణ భారత దేశ సాహిత్య సమ్మేళనంలో 

లక్ష్మి కుట్టి అమ్మ మాట్లాడేప్పుడు నేను తీసిన ఫోటో  








No comments:

Post a Comment