Sunday, March 20, 2016

‘గ్వంతనమేర ’ ఇప్పుడు నా పాట..!

అప్పుడప్పుడే అస్తమించడానికి సిద్ధపడుతున్నాడు సూర్యుడు. సూర్యుని వెనకే వాళ్ళు నడుస్తున్నట్టున్నారు. వాళ్ళని గమనిస్తూ వాళ్లకి కొంత దూరంలో నేను. ఎటు చూసినా చెరుకుగడల తీపి వాసన. వేపుగా పెరిగిన చెరుకు తోటల్లో వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలన్న ఆసక్తి నాది.

ఒకాయనేమో నెత్తి మీద టోపీ , నీలి రంగు జాకెట్ , చెవులను కప్పేస్తూ పెరిగిన జాలు లాంటి ఎరుపు రంగు జుట్టు , పెరిగిన గడ్డం , నోటిలో సిగార్తో గుప్పు గుప్పున పొగలొదులుతూ నడుస్తుంటే, మరొకాయన రెండు భుజాలకు తగిలించుకున్న బ్యాగు, మెడలో ASA అని రాసున్న నీలి రంగు కండవా , ఉంగరాల జుట్టుతో ఆకాశంలోని నక్షత్రాలను చూపిస్తూ మాట్లాడుతున్నాడు. గుప్పుగుప్పున పొగలొదులుతున్న అతని పేరు వింటే సామ్రాజ్యవాదుల గుండెల్లో భయం ప్రతిధ్వనిస్తుంది. ఆయన చేతికందిన చెరుకు గడని కోసి మధ్యలో విరిచి భుజాలకు సంచి తగిలించుకున్న కుర్రాడికి తినమని ఇస్తూ మాట్లాడుకుంటున్నారు. నవ్వు కుంటున్నారు. విశ్వం గురించి ఆ కుర్రాడు చెబుతుంటే వింటూ పక్కనున్నాయన పాబ్లో నెరుడా కవిత్వాన్ని ప్రేమగా ఆ కుర్రానికి చెబుతున్నాడు. అవును వాళ్ళని నేను పోల్చుకున్నాను . సామ్రాజ్య వాదుల గుండెల్లో గుబులు పుట్టించి" గుండెల్లో కవిత్వం చేతుల్లో ఆయుధంతో " సంచరించే అతడు చేగువేరా, అతనితో నడుస్తూ నక్షత్రాల ధూళి గురించి మాట్లాడుతూ విశ్వరహస్యాలను చర్చిస్తున్న ఆ కుర్రాడు మొన్న అమరుడయ్యాడే ఆ రోహిత్ . ఇద్దరూ సూర్యుని వెనకే నడుస్తూ వెళ్తున్నారు. నేను వాళ్ళని పిలిచాను. ఇంకా ఇంకా వాళ్ళ మాటల్ని .. నాకు గుర్తుగా ఇచ్చి వెళ్ళమని పిలుస్తున్నాను . కాని వాళ్ళు ఆగట్లేదు . నేను వాళ్ళను కేకేస్తూ పిలుస్తూనే వున్నాను కానీ .. కానీ .. వెంటనే నాకు మెళకువొచ్చింది. నిద్ర నుంచి గభాలున లేచి మరో సారి చదువుతూ నిద్రలో వదిలేసినా పుస్తకాన్ని వెతుకుతూ "ఛే "ఎక్కడ ? యేడి? అని వెతుక్కుంటుంటే? సురేష్ నా పక్కనే వున్న " నాలోని రాగం క్యూబా " అనే పుస్తకం తీసి - తీసుకో అంటూ -ఇచ్చాడు. ఇదంతా కలేనా ? అవును కలే . " చే " తో పాటు "రోహిత్ వేముల " కూడా నా కలలో ?. ఎందుకు అంటే ? ఆశ్చర్యం మేమి లేదనిపించింది. నాలోని రాగం క్యూబా " రెండవసారి చదువుతూ ఫిడేల్ క్యాస్ట్రో ని , క్యూబన్లని, చేగువేరాని ప్రేమించడం అభిమానించడం మొదలైంది. ఇంతలో రోహిత్ మరణం. చావును ఇష్టంగా కౌగలించుకున్న అతడి ధైర్యం, కులపీడనకు గురై జీవితాన్ని కోల్పోతున్నానన్న ఆందోళన , తరతరాల పీడనలో తనవారిని గురించిన బాధ అతని మరణం ఇవన్నీ హృదయాన్ని కలచివేసాయ్. ఆ ఇద్దరూ తమ జీవితాల్ని సారవంతంగా సమాజంలో మేలుకొలుపు కలిగించడానికి త్యాగం చేసి నాకు ఇష్టమైన వాళ్లైయారు. నా గుండెల్లో చెరగని ముద్ర వేసారు . జి. ఎన్ . మోహన్ గారి " నాలోని రాగం క్యూబా " ఇప్పుడు నాలోని రాగం కూడా అయ్యింది. క్యూబా నన్ను కూడా తనలోనికి ఆహ్వానించినట్టు అనిపించింది. హవానా పట్టణంలో నన్ను నడిపిస్తూ హెమింగ్వే కథలను నాకు కూడా చెబుతూ తమ చెరుకు తోటల గుండా నను తీసుకుని వెళ్లి చిరిగిన గుడ్డలతో కుట్టుకున్న తమ దేశ జెండాను నాకు బహుమానంగా ఇచ్చినట్టు అనిపించింది. ఈ పుస్తకం మీరు పంపక పొతే ఎంత మిస్ అయ్యుండేదాన్ని సృజన్ గారు. మీ అనువాదం నాకు అనువాదం లా అనిపించనే లేదు . మీ కళ్ళతో మీరు చూసిన క్యూబాని నాకు పరిచయం చేసినట్టు అనిపించింది. ఇంకో విషయం చెప్పనా మీరు కూడా మోహన్ గారిలా , నాలా క్యూబాని మీ లోని రాగంగా మార్చుకున్నారేమో అనిపించింది. " నాలోని రాగం క్యూబా " నాకో పచ్చని కలని చూపించింది . పోరాడి పడి లేచే అలల్లా క్యూబా సామ్రాజ్యవాది అమెరికా చేతుల్లో ఓడిపోవడం ఇష్టంలేక యుద్ధం చేస్తూ నిలబడడం ఆనందాన్ని కలిగించింది. జాతీయతను కాపాడుకోడానికి ప్రతి క్యూబా పౌరుడు తమని తాము దేశానికి అర్పించుకున్న నిజాయితీ , పోరాట పటిమ, గుండెని తట్టింది. అమెరికాని నగ్నంగా నిలబెట్టి చూపించిన ఈ పుస్తకం నాకు ప్రియమైన నేస్తమైంది. సామ్రాజ్యవాదాన్ని ఎదిరించడమే కాదు జీవితంలోని ప్రతి సంఘటనను ఎదుర్కొని నిలబడమనే స్ఫూర్తి నిచ్చింది. రోహిత్ వేముల లాంటి ఒక అమరన్ని నాకు చూపించి ఇన్ని రోజులుగా నిద్రపోతున్న మా సోమరితనంపై కొరడా విసిరి జాగృతం చేసిన వీరునిగా నిలబెట్టిన ఈ కాలంలో ఈ పుస్తకం చే ని రోహిత్ ని వాళ్ళ ప్రపంచాల్ని అర్ధం చేసుకునే వీలు కల్పించింది. నిజమే కలలు చాలా ఖరీదైనవి. స్వప్నించలేని వాడు విప్లవాలు చేయలేడు. దేశాన్ని జనాన్ని విముక్తం చేయలేడు. ఆదిపత్యాల మీద, దోపిడీ మీద , సామ్రాజ్యవాదం -సామ్రాజ్య వాద విస్తరణ మీద , దాని సంస్కృతి మీద నిరంతరం యుద్ధం చేసిన దేశాలకి క్యూబా ఒక ప్రతీక . ఇలాంటివి ఎన్ని చదివి రోహిత్ తనని తానూ జాగృతం చేసుకున్నాడో కదా అని రోహిత్ ని అర్ధం చేసుకునేందుకు ఈ పుస్తకం నాకు ఎంత ఉపయోగపడిందో చెప్పలేను. అణగదొక్కబడుతున్న క్యూబన్ ప్రజలలో ఒకడిగా కలిసిపోయి రోహిత్ నను చూస్తున్నట్టు అనిపించింది ..! క్షమించండి ఇక పుస్తకం గురించే మాట్లాడతాను . " ఒక స్వప్న సంచలనాన్ని రికార్డు చేసినట్టు , గొప్ప కైపుతో ,మగ్నతతో, ఆనందంతో, ఆరాధనతో లోకానికి క్యూబాను ఎత్తిచూపాడు మోహన్ " - అని శివారెడ్డి గారు ముందు మాట రాస్తూ అన్నారు. నిజమే భారతదేశం పేరు చదివినప్పుడల్లా రోమాలు నిక్కబొడుచుకోవడం. కృతజ్ఞతతో కూడిన ఫిడేల్ క్యాస్ట్రో మాటలు చదివేప్పుడు హృదయం ద్రవించి నీరుకారడం. యుద్దాలకోసం క్యూబన్లు సిద్ధ పడ్డ తీరు చదివి అమెరికా మీద కోపం రావడం సహజంగా జరిగిపోతాయి. నిజం చెప్పొద్దు అమెరికా మీద నాకెంత కోపం వచ్చిందంటే పుస్తకం చదివాక సురేష్ తో అన్నా కదా మనం అవకాశం దొరికినా అమెరికాకి వెళ్లొద్దు అని . అంత పెద్ద దేశం ఎలా క్యూబాని గుప్పిట్లోకి తీసుకోడానికి విశ్వప్రయత్నాలు చేసిందో చదివితే ఎవరికైనా కోపం వస్తుంది. జి. ఎన్. మోహన్ గారు ఒక జర్నలిస్టు , కవి , అనువాదకులు కావడం వల్లనేమో ఈ పుస్తకం ఏదో కవరేజ్ చదివినట్టుగానో , డాక్యుమెంట్ చదివినట్టు గానో కాకుండా కవితాత్మకంగా వుంటుంది. తెలుగులో అనుసృజన చేసిన సృజన్ గారు ఆ శైలిని అంతే బాగా తర్జుమా చేసి ఉండకపోతే ఈ మాటని శివారెడ్డి గారు -" ఎంతో సమ్మోహనభరితంగా గొప్ప ప్రేమతో, గొప్ప ఉద్వేగంతో రాసిన వచన కావ్యమిది -"అని ఎలా అనేవారు ?

యే పుస్తకం చదవడం మొదలు పెట్టినా ముందుమాటలను కూలంకషంగా చదవడం అలవాటు నాకు. ఈ పుస్తకాన్ని కూడా తెరిచి ఆయనను గురించిన వాఖ్యాల్ని ఆ తరువాత ఆయన " నాలోని రాగం క్యూబా " కి పరిచయంగా రాసుకున్న ముందు మాటని చదివితే కొన్ని పాదాలు ఎంత నచ్చాయో చెప్పలేను. జి. ఎన్ . మోహన్ గారు "ఎక్కుండి" అనే కవి గారు రాసిన మాటలతో మొదలు పెడుతూ "భరిణెలో మిధిల" అంటారు . - " ఎప్పుడైనా ఒక్కసారి నేను మిధిలకెళ్ళి జనక మహారాజు పొలంనుండి మట్టి తెస్తాను . దున్నిన ప్రతిచోట ఆడపిల్లలే దొరికే ఆ మిధిలను ఒక్కసారి చూడాలి . " అంటూ అక్కడే హృదయానికి హత్తుకుపోయేది ఈ పుస్తకం అని చెప్పకనే చెబుతారు. ఒక్క రూపాయి ఇచ్చినందుకు ఆ దేశం ఒక్క రూపాయి దేశంగా తన హృదయాన్ని ఎలా ఆక్రమించి రాగమైందో, మన్సూర్ గారి సంగీతంలా , పి. టి. ఉష పరుగులా , జి.ఆర్ విశ్వనాథ్ మంత్రందండం బ్యాట్ లా , అమ్మజ్ఞాపకాల్లా , జానపద కథల్లా, సారంగి తంత్రుల్లా, క్యూబా జి.ఎన్. మోహన్ లోని రాగంగా ఎలా మారిందనేది చదివితే ఆ రాగం మిమ్మల్ని కూడా నిలవనీయదు సుమా ..! జాగ్రత్త. జోస్మార్టి విమానాశ్రయం నుంచి నిరాభరణ సుందరి అయిన క్యూబాని చూసి రచయిత ఎలా మనసు పారేసుకున్నారో ,అక్కడ జరుగిన "ఉన్ ఫెస్టివల్" కి హాజరై ఆ యాత్రా జ్ఞాపకాలని క్యూబా చరిత్రని కలిపి చెప్పడం హాయిగా సాగే కవిత్వం లాగే అనిపిస్తుంది . " అమ్మా మా పిల్లోడిని గాని , పిల్లని గాని చూసారా అని " 30 వేల మంది పిల్లల్ని పోగొట్టుకున్న తల్లులు ఆ అర్జెంటీనా కన్నీటి సంఘటన ఇంతవరకు వాళ్ళ పిల్లలు బ్రతికున్నారో చనిపోయారో కూడా తెలియని స్థితిని చెప్పమంటూ గుర్తు సుకుంటూ ఆ తల్లులు అలా అడగడం కలచి వేస్తుంది. కాఫీ లో పాలు కలుపుకుని తాగడంలో బ్రిటీష్ వారు నేర్పివెళ్ళిన అలవాటు మనకి . దానితో పాటు మరిన్ని అలవాట్లు , యూ ఇంగిలీస్ , బ్లడీ బ్రిటీస్ -" అని రచయిత చాలా అలవాట్లను వదిలివేయలేని మన సోమరితనంపై చురక "కాఫీ విత్ మిల్క్ ప్లీస్ " అనే అధ్యాయంలో చదివి మనం కూడా తలదిన్చుకుంటాం. అమెరికాకి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటూ 12 లక్షల పై చిలుకు జనాభాతో 500 ఏళ్ళ పోరాట చరిత గలిగిన చిన్న దేశం ఇంకా అమెరికా చేతుల్లో ఎలా పీడిమ్పబడుతుందో , వాళ్ళని ఆర్ధికంగా, రాజకీయంగా కూలదోసినా రసాయనాల దాడి జరుగినా ఎదుర్కొని పోరాడి ఎలా నిలబడ్డారో స్పష్టంగా రాస్తారు రచయిత. రూపాయి ఖర్చు కూడా చేయకుండా వార్తా సంస్థలు ఎలా వార్తల్ని రాస్తున్నాయో చెబుతూ అమెరికన్ ప్రెస్ నుంచి వార్తల్ని కొని అచ్చేసి, అమెరికా ఏదైతే ప్రపంచానికి చెప్పాలని అనుకుంటుందో దాన్ని ఎలా ప్రచారం చేసుకుంటుందో చెబుతూ సోమరిపోతులైన జర్నలిస్టులను, వార్తా సంస్థలని దులిపేస్తారు మోహన్ గారు. " హస్తలా విక్టోరియా సియంప్రే "- అంటే " గెలుపు సాధించే వరకు .. నేను మీ వాడినే " అన్న "చే గువేరా " చివరిగా క్యాస్ట్రో కి రాసిన మాటల్ని గుర్తు చేస్తూ రాసిన అధ్యాయం. 

ప్రేమలేనప్పుడు అనే చివరి అధ్యాయం చదువుతుంటే పుస్తకం ముగించే ముందు మరోసారి గట్టిగ క్యూబని గుండెకు హత్తుకోవాలనిపిస్తుంది. "గ్వంతనమేర పాట" ఇప్పడు నా పాటైంది .. ఈ వారం రోజులుగా నా నోట్లో నానుతూనే వుంది. మీరు కూడా చదవండి మిమ్మల్ని కూడా ఈ పుస్తకం కట్టి పడేస్తుంది. మీలోని రాగమై కొద్దిగా నైనా సామ్రాజ్యవాద భూతంపై ఎలా తిరగబడాలో, క్యూబన్లలా జాతి జాతంతా ఐక్యంగా ఎలా వుండగలిగారో తెలియజేస్తుంది. మంచి పుస్తకాన్ని నాకిచ్చి చదవమని ప్రోత్సహించిన సృజన్ గారికి ఎన్నెన్నో థాంక్సులు .. మెర్సీ మార్గరెట్ 24 -1 -2016



Friday, January 15, 2016

మరణం కళ్ళలోకి సూటిగా ..!

సాయంత్రం ఆరవుతుంది. ఉదయానికి సాయంత్రానికి రాత్రికి తేడా లేకుండా చలి. నిన్నటి రోజు ఇంకొంచెం ఎక్కువే. బయటి వాతావరణం లోపలి వాతావరణాన్ని అదుపులోకి తీసుకుంటుందా ? లేక లోపలి వాతావరణం ఇదేంటని నిలదీయకుండా అదే మునగదీసుకుని గాజు అద్దంపై మంచు బిందువుల్లా జారిపోడానికి ఇష్టపడుతుందా ? ఏమో ..?

బాధ ఎలా వుంటుంది అంటే ఏమని చెప్తాం ? బాధ అంటేనే ఆమడ దూరంలో ఉంటాం. కోరి కోరి బాధను ఎవరమైనా ఇష్టపడతామా ? మార్చుకునే అవకాశమే ఉంటే మా బాధను మీరు తీసుకోండి. మీ సంతోషాన్ని మాకివ్వండని అడుకున్నే వాళ్ళం కదా . ఒక వేళ బాధను మూటగట్టి పక్కన పెట్టె అవకాశమే వుంటే ఎంచక్కా మూట దించినట్టు బాధను దించేసుకునే వాళ్ళం. కాని ఇది దిన్చేసుకోవాలి అని అనిపించని బాధ.

ఎందుకో ఈ రెండు రోజులుగా నాకు ఈ బాధ నచ్చుతుంది. ప్రేమలో ఎదురు చూసే వాళ్లకు బాధ తీయగా వుంటుంది ..విరహాగ్ని లో కొట్టుమిట్టాడే వాళ్లకు కూడ అని అంటారు . కాని "ఈ బాధ" దాని తాలుక ఈ నొప్పి అలాంటిది కాదు. మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని అనిపించే బాధ. చావుతో నీవంటే నాకు భయం లేదు అని చెపుతూనే ప్రేమించి నమ్మిన వ్యక్తిని వదిలి వెళుతున్నానే అని మూలిగే బాధ.

కళ్ళ ముందు చావు కూర్చుంటే ఎలా వుంటుంది ఎవరికైనా ? కూర్చున్నది కూర్చోక - ' రా..! నిన్ను తీసుకెళ్తా ' అంటే ఎవరమైనా ఏం చేస్తాం? చంగున అక్కడి నుండి దూకి లేని రెక్కలుంటే బాగుండుననో అందకుండా దౌడు తీయగల కాళ్ళు లేవే అని ఆలోచిస్తూ పరుగెత్తడం చేస్తాం. కాని ఇదేంటి. ఇంత సమాధానంగా చావును ఎదుర్కొన్న అతని బాధను మళ్ళీ మళ్ళీ అనుభవించాలని అనుకోవడం. ఆ బాధని మళ్ళీ మళ్ళీ గాయం చేయమని హత్తుకోవడం ఎంత పిచ్చితనం కదా.

ఇదంతా ఎందుకు చెపుతున్నాన్నా.. నిన్నొక పుస్తకం చదివా అదొక నవల . లా చదివి అండర్ వరల్డ్ లో అడుగు పెట్టి , గ్యాంగ్ వార్లకి నాయకత్వం వహించి . ఇలాంటి ఎన్నో సంఘటనలని చూసిన వ్యక్తి రాసిన నవల.

ఎన్నో పుస్తకాలు చదువుతుంటాం. చదివిన పుస్తకాలన్నీ వెంటపడతాయా ? ఏవో కొన్ని అలా మనతోనే నడుస్తుంటాయి. వాటిలో ఈ పుస్తకం ఒకటి. చదివేప్పుడు నన్ను నేను మర్చిపోయి ఆ పదాల వెంట వాక్యాల వెంట కళ్ళను పరుగుతీయించే ఆ మనిషి వెంట నడిచా " అతడు " అంత తాపీగా చావును ఎదుర్కోవడానికి ఇష్టపడుతుంటే శ్రీధర్ లాగే నాకు అతడిపై కోపమొచ్చింది. ఏం జరుగుతుందో అన్న ఉత్కంట. శ్రీధర్ ఎవరూ అని అడగాలనుందా .. ? " అతడిని చంపబోయే వ్యక్తి . అతడి చావు. నిజంగా జరిగిన ఈ సంఘటనకి సాక్షి .ఆ ఉత్కంట నా వేళ్ళను చెంపలపై పోనిచ్చి ఎండిన మొటిమలను గిల్లిస్తుంటే తెలియకుండానే ఇంకా పక్కురాని మొటిమను గిల్లేసుకున్నా. ఒక వైపు రక్తం.. దాన్ని పక్కనే ఉన్న గుడ్డకి తుడుచుకుంటున్నానా కాని చదవడం మాత్రం ఆపాలనిపించలేదు. చదవడం ఆపేస్తే " అతడి " చూపులని , అతడి మాటలని నేను మిస్ అయిపోతానేమో అన్న ఆత్రుత. అతడు బ్రతికుంటే బాగుండు అనిపించింది. అతడి ప్రాణం ముందు నా మొటిమ ఒక లెక్కా అనిపించింది. రశ్మీతో అతడి జీవితం ఆనందంగా ఉంటే బాగుండుననిపించింది. అతడు తప్పించుకుపొతే బాగుండు నని శ్రీధర్ లాగే నాకు అనిపించింది.

అసలు చావు ముందు కూర్చుని , చావబోయే వ్యక్తి చావుతో హృదయాన్ని విప్పి మాట్లాడుకోవదమేంటి. చావు నిజం. మనిషీ నిజం . చుట్టూ జరిగే పరిస్థితులు, వాతావరణమే నిజం అబద్ధంగా , అబద్ధమైనది నిజంగా అనిపిస్తుందేమో ఆ బాస్ లాగా. అతడూ హత్యలు చేసిన నేరగాడు కిల్లరే కావచ్చు. చీకటి రాజ్యంలో చావుకు , వెలుతురు లో బ్రతికే వాళ్లకి చావు ఒకటేలా ఉన్నా మానసిక సంఘర్షణలు వాళ్ళు చావును స్వీకరించే పధ్ధతి ఎంత వేరుగా వుంటుందో తెలుస్తుంది.

పుస్తకం చదివి ఊరుకోవచ్చుగా.. ఊహు ఆ కథని తీసుకుని చేసిన సినిమాని చూశా " ఎదెగారికే ". అది ముందే చదివానన్న విషయం జ్ఞాపకానికి వచ్చినా " అతడి " ముఖం , ఆ బాధ తీసుకునేప్పుడు అతడి హావ భావాలు చూస్తూ అతడి బాధను మళ్ళీ తీసుకోవాలని అనిపించింది ఎందుకో నా పిచ్చి కాకపొతే. ఇలా ఆ బాధ గురించి ఇక్కడ రాయకపోతే " అతడి " చూపులు , చావు కనికరించాలని అనుకున్నా వద్దని అతడు వదిలేసుకున్న ప్రాణం విలువ రశ్మీ కోసమేగా అని నేను జడ్జ్ చేసే ప్రయత్నాలు ఇంకా కొన్ని రోజులు నన్ను వెంటాడతాయి. అందుకే ఇలా రాసి ఆ బాధను ఈ గోడకి గుచ్చేస్తున్నా.

నవల లో వున్న "అతడే" కాదు. నవల రాసిన అగ్ని శ్రీధర్ ఎవరా అని కొంచెం వెతికి తెలుసుకున్నా. అగ్ని శ్రీధర్ గారంటే కూడా అభిమానం పెరిగింది. ఏంటో ?










‘‘క్రిమినల్సూ, ప్రొఫెషనల్ కిల్లర్సూ కూడా మన లాంటి మనుషులేననే అవగాహనని కలిగించింది తెగింపు నవల’’ అంది మా అమ్మాయి జ్యోతి. అన్నిటికన్నా పెద్ద నేరం నేరస్థుల పట్ల ఫెలో ఫీలింగ్ లేకపోవడమే. మనకీ క్రిమినల్సుకీ తేడా పర్సంటేజిలోనే. ‘తెగింపు’లో చంపే వ్యక్తి, చంపబడే వ్యక్తి ఎదురుగా కూర్చొని గుండె తలుపులు తెరుచుకునే తీరు విశిష్టమైనది. కృష్ణార్జునుల సంభాషణ కన్నా గొప్పది అంటారు రాణి శివశంకరశర్మ

సృజన్ గారు నిజం చెప్పొద్దూ .. అగ్ని శ్రీధర్ గారు కన్నడలో ఎలా రాసారో కాని మీ తెలుగు అనువాదంలో " తెగింపు" చాలా స్పష్టంగా మీ రచనలాగే వుంది. నాకు మీరు ఈ పుస్తకం పంపకపోతే ఎంత మిస్ అయిపోయేదాన్నో.. మీకు నా కృతజ్ఞతలు. మీరు మరిన్ని రచనలు చేయాలని మంచి పుస్తకాల్ని మాకు స్నేహితులుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను .

మెర్సీ మార్గరెట్ 15/1/2015