Friday, January 15, 2016

మరణం కళ్ళలోకి సూటిగా ..!

సాయంత్రం ఆరవుతుంది. ఉదయానికి సాయంత్రానికి రాత్రికి తేడా లేకుండా చలి. నిన్నటి రోజు ఇంకొంచెం ఎక్కువే. బయటి వాతావరణం లోపలి వాతావరణాన్ని అదుపులోకి తీసుకుంటుందా ? లేక లోపలి వాతావరణం ఇదేంటని నిలదీయకుండా అదే మునగదీసుకుని గాజు అద్దంపై మంచు బిందువుల్లా జారిపోడానికి ఇష్టపడుతుందా ? ఏమో ..?

బాధ ఎలా వుంటుంది అంటే ఏమని చెప్తాం ? బాధ అంటేనే ఆమడ దూరంలో ఉంటాం. కోరి కోరి బాధను ఎవరమైనా ఇష్టపడతామా ? మార్చుకునే అవకాశమే ఉంటే మా బాధను మీరు తీసుకోండి. మీ సంతోషాన్ని మాకివ్వండని అడుకున్నే వాళ్ళం కదా . ఒక వేళ బాధను మూటగట్టి పక్కన పెట్టె అవకాశమే వుంటే ఎంచక్కా మూట దించినట్టు బాధను దించేసుకునే వాళ్ళం. కాని ఇది దిన్చేసుకోవాలి అని అనిపించని బాధ.

ఎందుకో ఈ రెండు రోజులుగా నాకు ఈ బాధ నచ్చుతుంది. ప్రేమలో ఎదురు చూసే వాళ్లకు బాధ తీయగా వుంటుంది ..విరహాగ్ని లో కొట్టుమిట్టాడే వాళ్లకు కూడ అని అంటారు . కాని "ఈ బాధ" దాని తాలుక ఈ నొప్పి అలాంటిది కాదు. మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని అనిపించే బాధ. చావుతో నీవంటే నాకు భయం లేదు అని చెపుతూనే ప్రేమించి నమ్మిన వ్యక్తిని వదిలి వెళుతున్నానే అని మూలిగే బాధ.

కళ్ళ ముందు చావు కూర్చుంటే ఎలా వుంటుంది ఎవరికైనా ? కూర్చున్నది కూర్చోక - ' రా..! నిన్ను తీసుకెళ్తా ' అంటే ఎవరమైనా ఏం చేస్తాం? చంగున అక్కడి నుండి దూకి లేని రెక్కలుంటే బాగుండుననో అందకుండా దౌడు తీయగల కాళ్ళు లేవే అని ఆలోచిస్తూ పరుగెత్తడం చేస్తాం. కాని ఇదేంటి. ఇంత సమాధానంగా చావును ఎదుర్కొన్న అతని బాధను మళ్ళీ మళ్ళీ అనుభవించాలని అనుకోవడం. ఆ బాధని మళ్ళీ మళ్ళీ గాయం చేయమని హత్తుకోవడం ఎంత పిచ్చితనం కదా.

ఇదంతా ఎందుకు చెపుతున్నాన్నా.. నిన్నొక పుస్తకం చదివా అదొక నవల . లా చదివి అండర్ వరల్డ్ లో అడుగు పెట్టి , గ్యాంగ్ వార్లకి నాయకత్వం వహించి . ఇలాంటి ఎన్నో సంఘటనలని చూసిన వ్యక్తి రాసిన నవల.

ఎన్నో పుస్తకాలు చదువుతుంటాం. చదివిన పుస్తకాలన్నీ వెంటపడతాయా ? ఏవో కొన్ని అలా మనతోనే నడుస్తుంటాయి. వాటిలో ఈ పుస్తకం ఒకటి. చదివేప్పుడు నన్ను నేను మర్చిపోయి ఆ పదాల వెంట వాక్యాల వెంట కళ్ళను పరుగుతీయించే ఆ మనిషి వెంట నడిచా " అతడు " అంత తాపీగా చావును ఎదుర్కోవడానికి ఇష్టపడుతుంటే శ్రీధర్ లాగే నాకు అతడిపై కోపమొచ్చింది. ఏం జరుగుతుందో అన్న ఉత్కంట. శ్రీధర్ ఎవరూ అని అడగాలనుందా .. ? " అతడిని చంపబోయే వ్యక్తి . అతడి చావు. నిజంగా జరిగిన ఈ సంఘటనకి సాక్షి .ఆ ఉత్కంట నా వేళ్ళను చెంపలపై పోనిచ్చి ఎండిన మొటిమలను గిల్లిస్తుంటే తెలియకుండానే ఇంకా పక్కురాని మొటిమను గిల్లేసుకున్నా. ఒక వైపు రక్తం.. దాన్ని పక్కనే ఉన్న గుడ్డకి తుడుచుకుంటున్నానా కాని చదవడం మాత్రం ఆపాలనిపించలేదు. చదవడం ఆపేస్తే " అతడి " చూపులని , అతడి మాటలని నేను మిస్ అయిపోతానేమో అన్న ఆత్రుత. అతడు బ్రతికుంటే బాగుండు అనిపించింది. అతడి ప్రాణం ముందు నా మొటిమ ఒక లెక్కా అనిపించింది. రశ్మీతో అతడి జీవితం ఆనందంగా ఉంటే బాగుండుననిపించింది. అతడు తప్పించుకుపొతే బాగుండు నని శ్రీధర్ లాగే నాకు అనిపించింది.

అసలు చావు ముందు కూర్చుని , చావబోయే వ్యక్తి చావుతో హృదయాన్ని విప్పి మాట్లాడుకోవదమేంటి. చావు నిజం. మనిషీ నిజం . చుట్టూ జరిగే పరిస్థితులు, వాతావరణమే నిజం అబద్ధంగా , అబద్ధమైనది నిజంగా అనిపిస్తుందేమో ఆ బాస్ లాగా. అతడూ హత్యలు చేసిన నేరగాడు కిల్లరే కావచ్చు. చీకటి రాజ్యంలో చావుకు , వెలుతురు లో బ్రతికే వాళ్లకి చావు ఒకటేలా ఉన్నా మానసిక సంఘర్షణలు వాళ్ళు చావును స్వీకరించే పధ్ధతి ఎంత వేరుగా వుంటుందో తెలుస్తుంది.

పుస్తకం చదివి ఊరుకోవచ్చుగా.. ఊహు ఆ కథని తీసుకుని చేసిన సినిమాని చూశా " ఎదెగారికే ". అది ముందే చదివానన్న విషయం జ్ఞాపకానికి వచ్చినా " అతడి " ముఖం , ఆ బాధ తీసుకునేప్పుడు అతడి హావ భావాలు చూస్తూ అతడి బాధను మళ్ళీ తీసుకోవాలని అనిపించింది ఎందుకో నా పిచ్చి కాకపొతే. ఇలా ఆ బాధ గురించి ఇక్కడ రాయకపోతే " అతడి " చూపులు , చావు కనికరించాలని అనుకున్నా వద్దని అతడు వదిలేసుకున్న ప్రాణం విలువ రశ్మీ కోసమేగా అని నేను జడ్జ్ చేసే ప్రయత్నాలు ఇంకా కొన్ని రోజులు నన్ను వెంటాడతాయి. అందుకే ఇలా రాసి ఆ బాధను ఈ గోడకి గుచ్చేస్తున్నా.

నవల లో వున్న "అతడే" కాదు. నవల రాసిన అగ్ని శ్రీధర్ ఎవరా అని కొంచెం వెతికి తెలుసుకున్నా. అగ్ని శ్రీధర్ గారంటే కూడా అభిమానం పెరిగింది. ఏంటో ?


‘‘క్రిమినల్సూ, ప్రొఫెషనల్ కిల్లర్సూ కూడా మన లాంటి మనుషులేననే అవగాహనని కలిగించింది తెగింపు నవల’’ అంది మా అమ్మాయి జ్యోతి. అన్నిటికన్నా పెద్ద నేరం నేరస్థుల పట్ల ఫెలో ఫీలింగ్ లేకపోవడమే. మనకీ క్రిమినల్సుకీ తేడా పర్సంటేజిలోనే. ‘తెగింపు’లో చంపే వ్యక్తి, చంపబడే వ్యక్తి ఎదురుగా కూర్చొని గుండె తలుపులు తెరుచుకునే తీరు విశిష్టమైనది. కృష్ణార్జునుల సంభాషణ కన్నా గొప్పది అంటారు రాణి శివశంకరశర్మ

సృజన్ గారు నిజం చెప్పొద్దూ .. అగ్ని శ్రీధర్ గారు కన్నడలో ఎలా రాసారో కాని మీ తెలుగు అనువాదంలో " తెగింపు" చాలా స్పష్టంగా మీ రచనలాగే వుంది. నాకు మీరు ఈ పుస్తకం పంపకపోతే ఎంత మిస్ అయిపోయేదాన్నో.. మీకు నా కృతజ్ఞతలు. మీరు మరిన్ని రచనలు చేయాలని మంచి పుస్తకాల్ని మాకు స్నేహితులుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను .

మెర్సీ మార్గరెట్ 15/1/2015

No comments:

Post a Comment