Thursday, November 12, 2015

రబియా-అల్ - బస్రి 717-801

అన్వేషణ ఎప్పుడూ మంచిదే. అయితే అన్వేషణ ఫలిస్తే కావాలనుకున్నది పొందుకుంటాం. లేదంటే మనల్ని అటో ఇటో వెళ్లి వెతుక్కోమనే స్వరం కనుక్కుంటాం. ఈ రోజు సూఫీ కవిత్వం గురించి చదువుతుంటే "soofi mysitical poetry" దొరికింది. చదవడం చదవడమే రబియా-అల్ - బస్రి గురించి. నాకు నచ్చేసాయి .అందుకే నాకు వచ్చినట్టు అనువాదం చేసుకున్నాను. మళ్ళీ చదువుకోవచ్చని. ఏమో షేర్ చేస్తే మీకు కూడా నచ్చక పోదా అని షేర్ చేస్తున్నాను. ( కవిత్వానికి ఆధ్యాత్మికతకి అన్నిటికన్నా ముందు సంబంధం ఏర్పడిందా అని అనిపిస్తుంది )   రబియా బస్రి మార్మికసూఫీ కవిత్వం చెప్పిన వారిలో రబియా బస్రి ఒకరు. మార్మిక సూఫీ కవిత్వాన్ని అందించిన మొదటి కవయిత్రి ఈమె. రబియా నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఆమె బస్రాకి చెందిన సూఫీ హసన్ అనుయాయి . ( సూఫీ హసన్ ఎవరా అని గూగుల్ చేసి చూసినప్పుడు అతని గురించి ఎన్నో ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలిసాయి ). తనని తాను దేవుని పరిచారికగా సమర్పించుకున్న సన్యాసిని రబియా. ఆమె ఆధ్యాత్మిక జీవితం గురించి , తనకున్న దైవభక్తి గురించి అందరూ ఆమెని కొనియాడేవారు. సమయం దొరికినప్పుడల్లా ఆమె గురించి చెప్పుకునే వారు. ఒక సన్యాసిగా, తపస్విగా గడిపిన దానికన్నా ఆమెకి ప్రేమ మీద వున్న భావన గురించి అందునా దైవీక సంబంధమైన ప్రేమ గురించి ఆమె పంచుకున్న విషయాలు అతివిలువైనవి. ఆ భావనలే ఆమెని ఇప్పటి వరకు గుర్తుంచుకునేలా చేసింది అనడంలో సందేహం లేదు. మొదటి తరం సూఫీ కవయిత్రిగా ఆమె తెలుసుకున్న కలిగివున్న దైవిక ప్రేమ భావన అప్పటి వరకూ ఎవరికీ లేదు. - " దేవునికి భయపడాలి కాబట్టి ప్రేమించాలి. అని ముందు తరం సూఫీలు చెప్పినట్టుగా కాక దేవుణ్ణి దేవునిగానే స్వీకరించి అంగీకరించి ప్రేమించాలి అని" రబియా అంటారు . 

1. నాలో చేరిన నువ్వు

నాలోకి నిన్ను  మళ్ళీ మళ్ళీ చేర్చుతూనే వున్నావు  ఎల్లవేళలా నా ప్రియాతిప్రియమైన స్నేహితుడా ఎంతగా అంటే నేను ఏది మాట్లాడినా నీ గురించే మాట్లాడేంత నేను మౌనంగా వున్నా నీ పై అతికాంక్షచే బెంగటిల్లేంత 

2. హృదయానికి హృదయానికీ మధ్య 

ప్రేమలో ఉన్నప్పుడు ఇరుహృదయాలు ఐక్యంగా వుంటాయి మధ్యలో ఏది వుండలేనంతగా మాటలు ప్రేమలో మునిగితేలుతూ ఎంత కాంక్షతో ఎదుటివారిని చేరుతాయో యే బేషజాలు లేక స్వచ్ఛంగా యధార్ధత కలిగిన శుద్ధమైన రుచిగల మాటలు మాట్లాడేవారికే తెలుస్తుంది ఎవరు అసత్యంగా బొంకుతున్నారో ; మీరెవరి ముఖంలోనో బంధించబడ్డప్పుడు ఒక వాస్తవమైన రూపాన్ని వర్ణించమంటే మీరెలా వర్ణిస్తారు? మీరెవరిలో వుంటే వారిలానే కదా

3. రెండు ప్రేమలూనీకిస్తాను

నా రెండు ప్రేమలూ నీకే ఇస్తాను నీ కొరకై పరితపించే ప్రేమ, ప్రేమవైన నువ్వు నాకొరకైన ప్రేమ. నీ కొరకైన నా పరితాపంలో జ్ఞాపకాలు నిన్నే వెతుకుతాయి; ఎందుకంటే త్రోవతప్పిన వేళ నిన్నుచేరేందుకు దిక్సూచి నీ తలపులు అలా అని నేను గొప్ప ప్రేమికని కాదు 
నాలో ఉంటూ నన్ను హత్తుకుని వుండే నీవే,
నీ వల్లే నీవైన ప్రేమే గొప్ప 

4. నిన్ను ఆరాధించేప్పుడు 
నరకానికి భయపడి నిన్ను ఆరాధిస్తే
ఓ ప్రభూ నన్ను నరకాగ్నిలోనే కాల్చెయ్ ; స్వర్గాన్ని ఆశించి నిన్ను ఆరాదిస్తుంటే ప్రభూ ఆ స్వర్గం నాకుండక పోవుగాక ; కానీ ప్రభూ నిన్ను నిన్నుగా ప్రేమిస్తూ నీకై పరితపించి ఆరాధిస్తుంటే గనక స్వామీ ఆ నిత్యత్వం, ఆ అనశ్వరమైన నీ సముఖపు అందం నా నుంచి తీసివేయకు 5. నీ ప్రార్ధనలు 
మీ ప్రార్ధనలు కాంతివంతమైనవి మరి మీ ఆరాధన శాంతియుతమైనది మీ నిద్ర ప్రార్ధన యొక్క శత్రువు జీవితం ఒక పరీక్ష కాని మీ చపలమైన ఆలోచనాతీరుతో ఒక పరీక్ష కాని మీ చపలమైన ఆలోచనాతీరుతో కొద్ది కొద్దిగా మీ ప్రయాణాన్ని నెమ్మదిగా
నీ అస్తిత్వాన్ని తెలియకుండానే కోల్పోతున్నారు
నీ అస్తిత్వాన్ని తెలియకుండానే కోల్పోతున్నారు 6. అరుదైన నిధి
గుండె లో నీ గురించిన ఆశ అరుదైన నిధి  నా నాలుక మీద నీ పేరు తియ్యని పదం మీతో గడిపిన కాలం అది నా జీవితంలోనే ఉత్కృష్టమైన కాలం ; నిన్ను స్మరించకుండా ఈ లోకంలో నేను ఉండగలనా నేను బ్రతికుండగలనా మీ ముఖారవిందం చూడకుండా; నీ దేశం లో నేనొక పరదేశిని నీ ఆరాధికులమధ్య ఒంటరిని స్వామీ ఇదే నే విన్నవించుకుంటున్న విజ్ఞాపనాసారం.  7. నా ఏకాంతమే నా విశ్రాంతస్థితి సహోదరులారా ఒంటరితనంలోనే నాకు విశ్రాంతి దొరుకుతుంది మరియు నా ప్రియులైనవారు ఎల్లప్పుడూ నా సముఖంలోనే వుంటారు ఏవీ నన్ను చలించానివ్వవూ అతని ప్రేమ తప్ప అతని ప్రేమ ద్వారానే ఈ లోకంలో నేను పరీక్షింపబడతాను ఎందుకంటే నేనెటు వెళ్లినా అతని అందం నన్ను వెంటాడుతుంది. నాకు కలిగే ఆనందం , సంతోషం సమస్తం అతని వల్లే నా ఉనికి పారవశ్యమూ అతడే సమస్త సృష్టి నుండి నేను దూరమైనా నాకు బాధ లేదు ఎందుకంటే అతనితో నేనెప్పుడూ ఐక్యమయ్యే వున్నాను ఉంటాను అదే నా ఆకాంక్ష కూడా  8. నా హృదయంలో నివసించండి దేవా ఇంకో రాత్రి గడిచిపోతుంది ఇంకో కొత్త రోజు పుట్టుకొస్తుంది రాత్రి నాకు బాగా గడిచిపోయిందని చెప్పండి దాన్ని బట్టి నా హృదయం నిమ్మళమై ప్రశాంతంగా వుంటాను లేదా ఎలా వృధా చేసుకున్నానో చెపితే కోల్పోయిన దాన్ని బట్టి నీ సముఖంలో రోదించను బాధపడను నేను ప్రమాణపూర్తిగా చెప్పగలను యే రోజైతే నేను మిమ్మల్ని కలిశానో ఆ రోజునుంచే నేను జీవించగలుగుతున్నాను యే రోజైతే మీరు నా స్నేహితులైయ్యారో అప్పటినుండి నేను నిద్ర పోనేలేదు మీరే నన్ను నడిపిస్తున్నారు , మీ గుమ్మం వద్ద నుండి నన్ను తోసివేసినా నేను ప్రమాణం చేసి చెబుతున్నాను మీ నుండి నన్ను ఎవరూ వేరు చేయలేరు ఎందుకంటే నా గుండెలో మీరు సజీవంగా ఉన్నారు