Tuesday, April 3, 2018

​​ఇవాన్స్ చైల్డ్ హుడ్

యుద్ధం ఎప్పుడు గొప్ప గొప్ప త్యాగాలను , యవ్వన ప్రాయాన్ని బాల్యాన్ని బలికోరుతుంది. యుద్ధంలో విజయం సాధించడం అంటే ప్రాణంతో కూడుకున్నవన్నీ మట్టి కలిసిపోవడం ,మంట కలిసిపోవడమే. ఒక గాయాన్ని చరిత్ర గుండెపై చేసి దాన్ని మానిపోకుండా  మాటి మాటికీ రేపుతూ ఉండడమే. యుద్ధం ఒక భయంకర స్వప్నం. యుద్ధాన్ని హత్తుకున్న ఎన్ని రాజ్యాలు దేశాలు సంతోషంగా విలసిల్లాయని చెప్పగలం. అలాంటి యుద్ధ వాతావరణాన్ని చూపిస్తూ , ఆ యుద్ధంలో తల్లిని తండ్రిని కుటుంబాన్ని కోల్పోయిన  పండ్రెండేళ్ల బాలుడి కథ " ఇవాన్స్ చైల్డ్ హుడ్ ".


రెండో ప్రపంచ యుద్ధంలో  "Ivan Bondarev" అనే 12 ఏళ్ల కుర్రాడు రష్యా సైన్యంలో సైనికుడిగా చేరతాడు. చిన్న కుర్రాడు నాజీలకు అనుమానం రాదని భావించిన రష్యా సైన్యం ఆ కుర్రోన్ని నిఘా కోసం గూఢచారిగా పంపుతుంది. రహస్యాలను ఎంతో నేర్పుతో తెచ్చే ఆ కుర్రాణ్ణి లెఫ్టినెంట్ " Galtsev "ఇంకొందరు సైనికులు ఎంతో  ఇష్టపడతారు. ఆ అబ్బాయి నాజీల మీద  ప్రతీకారంతో రగిలిపోతూ తను చేయలేని తీర్చుకోలేని పగని రష్యా సైనికులకు సహాయం చేయడం ద్వారా తీర్చుకోవచ్చని భావిస్తుంటాడు. అతన్ని అందుకు దూరంగా ఉంచాలని మిలటరీ స్కూల్లో వేసిన ,చిల్డ్రన్ స్కూల్లో వేసినా పారిపోయి వస్తానని చాలా సూటిగా కోపంతో రగిలిపోయే ఇవాన్ చెబుతుంటాడు. తనని మిలటరీ స్కూల్ కి పంపినా పారిపోయి వస్తానన్న ఇవాన్ చివరగా ఒక మిషన్ కోసం వెళ్తాడు. కానీ అతడెప్పుడు ఇక తిరిగిరాడు.   ఆ యుద్ధం ఆ కుర్రవాడికి ఎన్ని భయంకరమైన కలల్ని మిగిలిస్తుందో అతడు కనే కలల ద్వారా చూపిస్తుంటాడు దర్శకుడు. నాజీల పరాజయం తర్వాతా రష్యాన్ని స్వాధీనం చేసుకుని దేశంలోలోకి ప్రవేశించిన రష్యన్ సైనికులు ఇవాన్ అమరుడవడాన్ని ఒక ఫైల్ లో చూపిస్తూండడం అతడి మరణానంతరం అతడి కలని చూపిస్తూ సినిమాని ముగియడం మనం చూస్తాం. 

సినిమా నలుపు తెలుపుల బొమ్మలతో ఒక కవితగా సాగిపోతున్నట్టు ఉంటుంది. దర్శకుడు  Andrei tarkovsky ఈ సినిమాని స్వప్నాదృశ్యాలతో ప్రస్తుతాన్ని మిళితం చేస్తూ కథని కొనసాగిస్తూ దృశ్య కావ్యంగా మలిచిన తీరు అద్భుతం. ఇందులో ఇవాన్ కనే కలలు కథ నుంచి విడివడి వున్నవి కావు. అవి కథనాన్ని ముందుకు తీసుకెళ్లే తాళపు చెవుల్లా ఉంటాయి.

ఒక కుర్రవాడు పచ్చని చెట్ల మధ్య , సీతా కొక చిలుక కోసం సీతాకోక లా ఎగురుతూ ,గెంతుతూ పరుగెడుతూ ఆ ప్రాణంతో తొణికిసలాడే పచ్చని చెట్ల మధ్య హాయిగా ఆడుకుంటూ తిరుగుతూ వాళ్ళ అమ్మ తెచ్చిన నీళ్లను తాగి సేద తీరుతూ ఉన్నట్టు తన గతాన్ని కలగనడంతో సినిమా ప్రారంభం అవుతుంది.  కానీ యుద్ధం ఏంచేస్తుంది ప్రాణాన్ని ఎండిపోయేలా చేస్తుంది. అందుకు సాదృశ్యంగా బాంబులతో కాలిపోయి ఎండిపోయి బూడిదైన చెట్ల మధ్య కథ కొనసాగడం చూపిస్తాడు దర్శకుడు. తన కలల్లో తానూ చూసే అందమైన ప్రపంచాన్ని ఆస్వాదించే ఆ కుర్రాడు నిద్ర మేల్కొనేప్పటికీ ఎలాంటి భయంకరమైనవాతావరణంలో గడుపుతున్నాడో చూస్తే చూసే ప్రేక్షకులకు బాధేస్తుంది. 

ఇదే కథలో మాషా అనే ఒక యువతిని గురించి పార్లెల్ గా స్టోరీ రన్ చేస్తుంటాడు దర్శకుడు. మాషా ఆ యుద్ధంలో సైనికులకు సహాయం చేసేందుకు పనిచేసే మెడికల్ అసిస్టెంట్. కొహ్లీన్ అనే సైనికుడు తనని అడుగడునా సెడ్యూస్ చేయడం చూపిస్తుంటాడు. తరువాత తనతో చదివిన తన స్నేహితుడు. ఇంకో లెఫ్టినెంట్ . ఇలా యుద్ధంలో అమ్మాయిలకి రక్షణ లేకపోవడాన్ని చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. పిల్లలు బాల్యం కోల్పోవడమే కాకుండా స్త్రీలు యువతులు తమ విలువైన జీవితాన్ని ఎలా పణంగా పెట్టవలసి వస్తుందో ఈ సినిమా మాట్లాడుతుంది. 

సినిమాలో ఇవాన్ , మాషాలిద్దరిపై యుద్ధ ప్రభావం ఉండకూడదని కోరుకుంటాడు లెఫ్టినంట్ " గెల్స్టోవ్ " . ఇవాన్ ని స్కూల్కి పంపడం అతడి ఉద్దేశం కానీ యుద్ధంలో  తనకి తానె బాస్ నని ప్రకటించుకుంటాడు ఇవాన్. బక్క చిక్కి ఎముకలు బయటికి కనబడే బాలుడివి నువ్వేం చేయగలవు అనే గేళి ఇవాన్నీ ఇంకా కఠినంగా తయారు చేస్తుంది. అయితే మాష ఆ మిలిటరీ క్యామ్పు నుంచి పట్టణంలోని హాస్పిటల్కి పంపివేయబడుతుంది. యుద్ధం జీవితాలపై నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని కూడా కోల్పోయేలా ఎలా చేస్తుందో ఈ సినిమా మాట్లాడుతుంది. 

ఇవాన్ కలలు అబ్స్ట్రాక్ట్ గా అనిపించినా ప్రతి కల చర్చకి పెడితే ఒక గ్రంధం అవుతుంది. సినిమా ప్రతీ ఫ్రేమ్లో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. సినిమా అంత చీకటి వెలుగుల మధ్య ఏ  ఫ్రెమ్ లో ఆపిన ఒక అద్భుతమైన దృశ్యం. 

సినిమా విడుదలయ్యింది 1962 లో అప్పటికి అది ప్రపంచ యుద్ధకాలం కాదు. అయినా దర్శకుడు తన దర్శకత్వ పటిమతో ప్రేక్షకులను కాలంలో ప్రయాణించేలా చేస్తాడు.  “The past is more real than the present.” అని నమ్ముతాడు  Tarkovsky.

కలలకి యధార్ధతకి మధ్య ఒక వంతెన వేసి నడిపిన ఇవాన్స్ చైల్డ్ హుడ్ యుద్ధ బీభత్సాన్ని ,యుద్ధ ప్రభావాన్ని చూస్తున్న ప్రేక్షకుడి ముందు చాలా సున్నితంగా ఆలోచనాత్మకంగా ఆవిష్కరిస్తుంది.

1963 లో  Venice Film Festival’s లో " the Golden Lion " అవార్డును అందుకున్న చిత్రంగా  " ఇవాన్స్  చైల్డ్ హుడ్ " చరిత్ర సృష్టించింది. తరువాత Tarkovsky తీసిన సినిమాలన్నీ అద్భుతమైన సినిమాలుగా పరిగణింపబడ్డాయి.  ఈ దర్శకుడు  తీసిన ఈ సినిమాలైన cesspools in Stalker [1979] , swimming pool in Nostalgia [1983] ,  The Sacrifice (1986) , తప్పక చూడవలసిన సినిమాలు. 

ఈ సినిమా దర్శకుడు  Andrei tarkovsky కి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అతన్ని అంతర్జాతీయ దర్శకుడిగా నిలబెట్టింది.  4 April 1932 లో  Zavrazhye, Russia లో తార్కోవ్స్కీ జన్మించాడు. ప్రపంచ యుద్ధం జరిగేప్పుడు సినిమాలో కుర్రాడి పాత్రకున్న వయసు దర్శకుడి వయసు ఇంచుమించు సమానం. ఆ యుద్ధ ప్రభావం దర్శకుడి మీద కూడా ఉండి ఉండవచ్చు.  Ingmar Bergman  అనే దర్శకుడు టర్కోవ్స్కీ గురించి రాస్తూ  
- " When I discovered the first films of Tarkovsky, it was a miracle. I suddenly found myself before a door to which I had never had the key.a room which I had always wished to penetrate and wherein he felt perfectly at ease. Someone was able to express what I had always wished to say without knowing how. For me Tarkovsky is the greatest filmmaker
– Ingmar Bergman
టర్కోవ్స్కీ తండ్రి   Arseny Alexandrovich Tarkovsky గొప్ప కవి. తండ్రి కవి అవడం వల్ల టర్కోవ్స్కీ మీద ఆ ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు.అతని తల్లి Maria Ivanova Vishnyakova, the Maxim Gorky Literature Institute నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకుని ప్రూఫ్ రీడర్గా పని చేస్తుండిన వ్యక్తి . 

రచయిత ,కవి,. తనకి తానూ సినిమా విద్యార్థిని అని చెప్పుకునే దేవరాజు మహారాజు గారు మొన్నటి సండే సినిమాకి క్యూరేటర్ గా వ్యవహరించారు. దర్శకుడి గురించి అతని ప్రతిభ గురించి., ఇవాన్స్ చైల్డ్ హుడ్ సినిమాని ఎందుకు ఎంపిక చేసుకోవలసి వచ్చిందో చాలా విపులంగా తెలియజేసారు. 
ఆదివారం సినిమా పేరుతో రవీంద్రభారతి ,పైడి జయరాజు థియేటర్లో వేస్తున్న వరల్డ్ క్లాసిక్స్ ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం. మామిడి హరికృష్ణ అన్నకి, తెలంగాణా సాంస్కృతిక శాఖకి ఈ విషయమై అభినందనలు చెప్పకుండా ఉండలేము.  

No comments:

Post a Comment