Monday, April 30, 2018

“ఫెంటాస్టిక్ ఫైవ్ “ఇంటర్నేషనల్  ఫిలిం ఫెస్టివల్
---------------------------------------------------------------
జర్మన్ ఫిలిం ఫెస్టివల్ ముగిసింది. ముఖ్యంగా జర్మన్ ఫిలిం ఫెస్టివల్ అనడానికి బదులు “వెర్నెర్ హర్జోగ్ “ఫెస్టివల్ ముగిసింది అనాలేమో. సినిమా ఏం చేస్తుంది అని ప్రశ్నించుకుంటే అనేకరకాల
సమాధానాలొస్తాయి. అన్నీ సమాధానాల వెనక డైరెక్టర్ బుర్ర బ్లూ ప్రింట్ లా కనిపిస్తుంది.
అతడేం అనుకున్నాడు. ఏం చూపించాలనుకుంటున్నాడు ?. ఏ ఆలోచనలతో తిప్పి
పంపాలనుకుంటున్నాడు ?. ఒక్కొక్కరికి ఒక్కోలా అతడెందుకు పరిచయం అవుతాడు.?
అన్నీ ఒక్కొక్కటి పక్కన కూర్చితే ఆ దర్శకుడు పది పేజీల వ్యాసంలా కనిపిస్తాడు. (నేను మాట్లాడుతుంది తెలుగు సినిమాల గురించి తెలుగు దర్శకుల గురించి కాదు )
ఒక ఆండ్రీ తార్కొవ్స్కి గురించి లేదు హీర్జోగ్ గురించి లేదా అబ్బాస్ కైరోస్టమి గురించి.


ఏప్రిల్ 9 తారీఖు నుంచి 13 తారీఖు వరకు రవీంద్ర భారతిలోని పైడి జయరాజు థియేటర్లో అయిదు రోజులు
వెర్నెర్ హర్జోగ్ పిచ్చితనంలో , రాక్షత్వంలో , మానవత్వపు లోతుల్లో , అధికారకాంక్ష సాగించే హింసలో,
రోజూ అతడితో పాటు ఒక్కో ప్రాతం , ఒక్కో ఖండం తిరిగి అవి చూసిరావడం ఎంత అదృష్టం. అదృష్టం అనే కన్నా ఎంత లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని అనాలి.


సహారా ఎడారులు. అమెజాన్ నదులు . అమెజాన్ అడవులు. మాచు పీచు కొండలు.
పేరు ప్రాంతపు మైదానాలు. సెంట్రల్ ఆఫ్రికా. రష్యా . మంగోలియా పాటలు, జర్మనీ జానపద కథలు.
అన్నీ ఒక దగ్గర కూర్చి  టూర్ ప్యాకేజి ఇచ్చి పంపినట్టుంది.


నావరకు నాకు వెర్నెర్ హర్జోగ్ ఒక అధ్బుతం . ఒక పిచ్చోడు. కాదు కాదు  బీభత్సాన్ని దగ్గరగా వెళ్లి
జుట్టు పట్టుకు వచ్చి చూపించే వాడు. భయపెడుతూనే మనం ఏం చేస్తున్నామ్ అని సున్నితంగా
మొట్టికాయ వేసి ప్రశ్నించే వాడు. మారిపోతున్న మనుషుల గురించి , అంతరించిపోతున్న మానవత్వం
గురించి చింతపడే వాడు. గుండెల నిండా చూపించాలనుకున్న దాని గురించి ఏ జంకు
లేకుండా చూపించే సాహసి. అన్నిటికి మించి సాహస యాత్రికుడు.


ఈ అయిదు రోజులు ప్రదర్శింపబడ్డ సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో మాస్టర్ పీస్.
భూగ్రహం మీద ఏడు ఖండాల గురించి సినిమా తీసిన వాడు సాహసి ఈ వెర్నెర్  హర్జోగ్ ఒక్కడే.
అంతరించి పోతున్న మనిషి తనం గురించి చాల సెట్టైరికల్ గా మాట్లాడగలడు. డాక్యుమెంటరీలకోసం
ఏదైనా చేయగలడు. ఎన్ని మైళ్ళ ప్రయాణం చేయడానికైనా వెనకాడడు. వెళ్లకూడని ప్రాంతాలకు వెళ్లి
ఆరోగ్యం మీదకి తెచ్చుకోగడు. ఏ గ్రాఫిక్లు ఇష్టపడని వాడు. జనాలతో అడ్వెంచర్లు చేయించగలడు.
వీలయితే పెద్ద స్టీమర్ పడవని కొండని తొలిచి దాటించగలడు.

వెర్నెర్ హర్జోగ్ నా హీరో. ప్రస్తుతం నన్ను సినిమా తీయడం చాల సులువు అని నేర్పించిన హీరో.


“ఫెంటాస్టిక్ ఫైవ్ “ఇంటర్నేషనల్  ఫిలిం ఫెస్టివల్లో భాగంగా జర్మన్ సినిమాలు :
డైరెక్టర్- “ వెర్నెర్ హర్జోగ్  “ రెస్ట్రాస్పెక్టివవ్
-----------------------------------------------------
సోమవారం : అగిర్రే వ్రాత్ ఆఫ్ గాడ్  ( AGUIRRE WRATH OF GOD)


1972 లో విడుదలైన వెర్నెర్ హర్జోగ్  సినిమా ఇటు ప్రేక్షకులను అటు సినిమా ఇండస్ట్రీతో సంభందం ఉన్న
ప్రతి ఒక్కరిని  ఒక కుదుపు కుదిపింది. ఇది దర్శకుడి ప్రతిభకి నిదర్శనం. తక్కువ బడ్జెట్ తో ఇలా అధ్బుతమైన
దృశ్య కళాఖండాన్ని సృష్టించొచ్చు అని వెర్నెర్ హర్జోగ్ నిరూపిస్తే , అధ్బుతమైన పాత్రదొరికితే ఎలా అందులో
జీవించవచ్చో “ క్లోస్ కిన్స్కి “ నిరూపించాడు.


పదహారవ శతాభ్దానికి చెందిన “ Lope de Aguirre “ అనే సైనిక నాయకుడు , స్పానిష్ సాహసయాత్రకు
సంభందించిన బృందంతో కలిసి బంగారపు నిధులున్న ఎల్ డొరాడో ని వెతుకుతూ వెళ్లేందుకు బయలుదేరడం ,
అధికారికంగా ఉన్న రాజును చంపి తనని తానూ రాజుగా ప్రకటించుకోవడం. చివరికి ఆ ప్రాంతాన్ని కనుక్కోలేక
ఒక్కడే మిగలటం అనే తన జీవితం ఆధారంగా దర్శకుడు రాసుకున్న కథ. బాలల కథల్లో ఆగిర్రే గురించి చదివి
ఆశ్చర్యానికి గురైన వెర్నెర్  హర్జోగ్ అతడి గురించి పరిశోధన చేసి ఈ సినిమాకి ప్రాణప్రతిష్ట చేసాడని చెప్తారు.


తాము జయించిన మూల వాసులైన ఆ దేశ ప్రజలని బానిసలుగా చేసుకుని El Dorado “ అనే ప్రాంతాన్ని
బంగారం కోసం వెతుకుతూ ఆగిర్రే బృందం   ప్రయాణం అవుతారు. వాళ్ళ ప్రయాణం లక్ష్యం బంగారం బాగా దొరికే ప్రాంతం
“ ఎల్ డోరాడో “ ని స్వాధీనం చేసుకోవడం. అక్కడ స్పానిష్ కాలనీని స్థాపించడం. క్రైస్తవ్యాన్ని పరివ్యాప్తి చేయడం .
అందుకని వీళ్ళ బృందంలో ఒక మతగురువు కూడా ఉంటాడు.  


భూమికి 14000 అడుగుల ఎత్తున్న నిటారుగా ఉన్న కొండమీద నుంచి 400 నుంచి 500 మధ్య
మనుషులని గుర్రాలతో , పందులు , పశువులు , యుద్ధ సామాగ్రి, ఆహారం , పల్లకీలు  
అందులో రాజవంశానికి చెందిన రాణి , ఆగిర్రే కూతురు Elvira తో సహా  బానిస బృందం కలిసి భయంకరమైన
దారుల గుండా ప్రయాణం చేస్టారు .  వాళ్ళు అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో అడవుల్లో
నీటి ప్రవాహాల మధ్య నడవలేని పరిస్తితిల్లో కూడా ప్రయాణం కొనసాగిస్తారు.


దర్శకుడు ఎంత రాక్షసుడంటే  “పెరు (peru)” లో రాష్ట్రంలో   “ మాచు పీచు “ ప్రాంతంలోని
కొండ మీద నుంచి బరువైన కాస్ట్యూమ్ లు వేసి పశువుల్ని గుర్రాల్ని ఇచ్చి వాళ్ళను మోయిస్తూ
మేఘాల గుండా వాళ్ళని నడిపించడం. సినిమా మొదటి దృశ్యం .
అది చూస్తుంటేనే రోమాలు నిక్కబొడుచు కుంటాయి.


“Gonzalo Pizarro “ పిజార్రో నాయకత్వంలో ఈ యాత్ర మొదలవుతుంది.   “Pedro de Ursúa “ ని
మొదటి కమాండర్ ఇన్ చీఫ్ గా , ఆగిర్రే ని సెకండ్ కమాండర్ ఇన్ చీఫ్ గా నియమిస్తాడు పిజార్రే .  
ముందు ప్రయాణంలో బాగానే ఉన్న ఆగిర్రెకి తానే వాళ్ళందరి మీద రాజవ్వాలి అన్న కోరిక మొదలవుతుంది.
అందులో భాగంగా కమాండర్ “ Gonzalo Pizarro “ ని పట్టుకుని బంధించి ఆ అడవిలోనే కారగారంలా చేసి
అందులో పెడతాడు. “Ursua “ ని షూట్ చేస్తాడు. కొంత కాలానికి అతన్ని ఉరి తీయిస్తాడు.
అతని భార్య స్పెయిన్ దేశపు ఒకానొక యువరాణి  అతడు కనబడక పోయేప్పటికి అతన్ని
వెతుకుతూ ఆ అడవుల్లోకి వెళ్ళిపోతుంది.


వీళ్ళు ప్రయాణం సాగించేదంతా అక్కడి నరభక్షకులైన మనుషులున్న గ్రామాలగుండా .
ఆ నరభక్షక సమూహాల్ని తాము తెచ్చుకున్న మందుగుండు సామాగ్రితో చంపేస్తూ ,
వాళ్ళ గ్రామాలకు నిప్పంటిస్తూ వెళ్తారు అగిర్రే బృందం . ఆ ప్రయాణంలో వాళ్లతో వచ్చిన మనుషులు ,
బానిసలు ఆకలివల్ల రోగాల వల్ల చచ్చిపోతూ ఉంటారు. ఒకానొక సమయంలో ఇక ఈ ప్రయాణం వద్దు
వెనక్కి వెళ్ళడం మంచిది అన్న సందర్భం వచ్చినప్పుడు  “ursua “ ఈ ప్రయాణం అన్వేషణ మానేసి వెనక్కి వెళదాం
అన్నప్పటికి ఆగిర్రే పట్టించుకోడు.అగిర్రే ఆ బంగారం నిధులున్న దేశం కోసం అన్వేషించడం ఆపకూడదు అని
గట్టిగానే ursua ని తృణీకరిస్తాడు. ఆ బృంద సభ్యులు బానిసలు కూడా వెనక్కి వెళ్ళడమే సరైనదని అనుకుంటున్న
సందర్భంలోనే ursua మీద పిస్టల్ దాడి జరుగుతుంది. ursua బ్రతికే ఉంటాడు . ursua ప్రమాదంలో
ఉన్నాడు ఏదో ఒకటి చేయమని మత గురువును సహాయం అడిగినా” Gaspar de Carvajal “ అనే మత గురువు
ఏమి చేయలేడు.  తనతో ఉన్న ప్రజలకి నమ్మకంలేదన్న కారణంగానే ursua ని ఉరేసి చంపించేస్తాడు ఆగిర్రే.


అక్కడితో ఆగకుండ స్థూల కాయుడు , భోజనప్రియుడు  నిర్ణయాత్మకంగా బలహీనుడైన Don de Guzmán ని
తమ అన్వేషణా యాత్ర బృందానికి తాము కనుగొన బోయే ప్రాంతానికి  రాజుగా నియమిస్తాడు. ఒకానొక చోట ఇద్దరు
నేటివ్ ఇండియన్లు వీళ్ళకి ఎదురుపడతారు. వాళ్ళ మెడలో బంగారం చూసి దగ్గరలోనే ఉన్నామని ఆనంద
పడతాడు అగిర్రే . ఆ ఇద్దరికీ మతప్రభోధకుడు బైబిల్ చేతులో పెడతాడు. దేవుడి గురిచి సువార్త చెప్పి దేవుడు
మాట్లాడతాడు అని చెప్తాడు. వాళ్ళు బైబుల్ ని చెవి దగ్గర పెట్టుకుని యెమీ వినిపించడంలేదు దేవుని మాటలు
ఇందులో నుంచి అని అమాయకంగా అడుగుతారు. అది దేవదూషనేనని వాళ్ళని బలవంతంగ మోకాల్లేయించి
ప్రార్ధన కూడా చేయిస్తారు.  మతాన్ని ప్రచారం చేయడం పట్ల వీళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఉన్నది చూపించడానికి
పదహారో శతాబ్దంలో ఇలా ప్రాంతాల అన్వేషణ నిధుల గురించి , అక్కడి జనాలకి కొత్త మతాన్ని పరిచయం
చేయడానికి స్పెయిన్ కాలనీలు తయారు చేయడం వెనక ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెపుతాడు డైరెక్టర్ .


యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఆకలి చావులు మొదలవుతాయి. అక్కడి లోకల్ ఇండియన్ల దాడి
జరిగి కొందరు చనిపోతారు. విషజ్వారాలు వస్తాయి. వాళ్ళ తెప్ప పాడవుతుంది. చివరికి పది పదిహేను మంది
మిగులుతారు. వాళ్ళ మీద కూడా దాడి జరుగుతుంది. తిండి లేక బలహీనపడ్డ మతగురువు అగిర్రే బానిస
అది భ్రమ అనుకునే అంత బలహీనంగా మారతారు. సొంత కూతురు కూడా దాడిలో బల్లెం పొడుచుకెళ్ళి చనిపోతుంది.
చివరిగా ఒకే ఒక్కడు మిగులుతాడు. తాను ఒక్కడే అయిన ఆ ప్రాంతాన్ని కనుక్కుని తానే రాజై ఆ ప్రాంతాన్ని
పరిపాలిస్తానని , తను ఉగ్రతని కుమ్మరించే దేవుడని  అనుకునే మాటలతో సినిమా ముగుస్తుంది.


సినిమాలో వీళ్ళు దాటే ఆ నదీ ప్రయాణం ఎంత సహజంగా ఉంటుందో. చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
వీళ్లు ఏర్పాటుచేసుకున్న తెప్ప పాడవుతుంది. కొంతమంది నది ఇవతలకు చేరుకుంటారు. కానీ కొంత మంది
అటువైపు ఆ ప్రవాహం ఉదృతం అవడంవల్ల ఆగిపోతారు. దర్శకుడు ఎంత దుర్మార్గుదంటే ఆర్టిస్ట్ లు  
ఆ భయంతో కొట్టుమిట్టాడేది కూడా దృశ్యీకరించి సినిమాలో వాడుకున్నాడు. ఇతనితో సినిమా తీయడమంటే
ప్రాణ సంకటమే.


ఈ సినిమాలో నటించిన బానిస ఇండియన్లు అందరు నేటివ్ అమెరికన్లు. వెర్నెర్ సినిమా తీస్తున్నట్టు వాళ్ళ
సహకారం కావాలని వెళ్ళినప్పుడు వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. కారణం ఆ సినిమా వల్ల నైన ఎలా
తాము విస్మరించబడింది ,ఆక్రమణకి గురైనది తెలుస్తుందని.


స్టూడియోలో  సెట్టింగ్లు వేసి వెర్నెర్ హేర్జోగ్ సినిమా తీసిఉండవచ్చు కాని నటుల సహజమైన హావభావాలను
భయాందోళనలను  ఉన్నవి ఉన్నట్టుగా చూపించేందుకు పెరూవియన్ అడవుల్లోనే అత్యంత సహజమైన
వాతావరణంలో ప్రకృతి మధ్య వెర్నెర్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు.


అత్యంత రమణీయమైన ప్రకృతి దృశ్యాలను చూపించడం పట్ల దర్శకుని ఆసక్తి కనిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్నో
అందమైన పచ్చని ప్రదేశాలు , కొండలు , లోయలు, నదులు చూపిస్తాడు. కొత్త ప్రాంతాలని చూడాలి
కనుక్కోవాలన్న ఆసక్తి ఈ దర్శకునికి లోలోపల ఉందేమో అన్న ఆసక్తి మనకీ కలుగుతుంది ఈయన గారి
సినిమాలు చూస్తె . అందుకు కారణమూ లేకపోలేదు.” Rudolf Herzog “ అనే ఆర్కియాల్జిస్ట్ మన
దార్శకుడు వెర్నెర్ హేర్జోగ్ తాత గారు. ఎందఱో వందల ఏళ్ళుగా వెతుకుతున్న కనిపెట్టలేకపోయిన
Asklepieion, the site of an ancient Greek hospital ని ఆయన తన పరిశోధనల ద్వారా కనిపెట్టాడు.
చిన్నప్పటినుంచి అతను పెరిగిన వాతావరణం ఆ వైపుగా దర్శకున్ని ఆ అభిరుచి పెంచుకోడానికి
పురికొల్పి ఉండవచ్చు.


తన సొంత డబ్బులు , తన సహోదరుని దగ్గర నుంచి తీసుకున్న అప్పు , తన దగ్గరున్న ఒకే ఒక్క
కేమరాతో వెర్నెర్ అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించాడు. జర్మన్ టెలివిషన్ స్టేషన్ కూడా
ఇతనికి ఫండింగ్ ఇవ్వడం వల్ల ఆ టీవీలో దీన్ని ప్రదర్శించేందుకు అతడు తొందర తొందరగా
ఈ సినిమాని తీయవలసి వచ్చింది.


ఈ సినిమా తీయడానికి ముందుగానే వెర్నెర్ సౌత్ అమెరికాకెళ్ళి అతడు తన సినిమాకి తగ్గ లొకేషన్లను
చూసుకున్నాడు. పెరూవియన్ అడవుల్లో అమెజాన్ పరీవాహక కొండజాతుల వాళ్లకు అతడు
తీయబోతున్న సినిమా గురించి ముందుగానే చెప్పాడు. 450 మంది ఈ సినిమా బృందం అక్కడ దిగింది.
వాళ్ళలో 270 మంది అక్కడి పెరూవియన్ కొండజాతుల వాళ్లు. పెరూవియన్ పాలిటిక్స్ లో ఆక్టివ్ గా
ఉంటున్న వాళ్ళు. స్పెయిన్ వాళ్లు ఎలా అమెరికాలోకి చొచ్చుకొచ్చి దాన్ని స్పెయిన్ కాలనీగా మార్చేందుకు
ఆక్రమణ చేసిన తీరు ఆ క్రమంలో నేటివ్ అమెరికన్లు ఎలా మాయమవుతూ వచ్చారో చూపించడానికి వెర్నెర్
సినిమా వాళ్లకి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని భావించవాళ్ళు ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు.
“ వేరే ఏ గ్రహాలనుంచో అంతరిక్షవాసులు వచ్చి తమ భూభాగాలను ఆక్రమించుకున్నారని “ ఇప్పటికీ అక్కడి
మూలవాసులు మాట్లాడుకుంటారు.


సినిమాలో అగిర్రెకి ఆగ్రహం , ఆందోళన కలిగినప్పుడు పిల్లనగ్రోవిలాంటి ఒక సంగీతవాయిద్యంతో
ఊదుతో సంగీతం వినిపించే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వాయిద్యం నాలుగైదు వెదురు వేణువులు మూడు
వరుసలుగా పేర్చి( వరుసలో నాలుగో ఐదో వేణువులు అన్నమాట ) ఊదడం ద్వారా సంగీతాన్ని సృష్టించడం .
సినిమా అంత నాలుగైదు సార్లు ఆ ఫ్లూట్ బిట్ వినొచ్చు. అది వాయించడానికి ఆ వ్యక్తి ముందు ఒప్పుకోలేదట.
తరువాత తనకి తానూ ముందు రావడం. సినిమాకి అదేంతో నేటివ్ ఫీలింగ్ తేవడానికి ఉపయోగపడిందని
వెర్నెర్ అంటాడు .


మంగళవారం :  ECHOES FROM A SOMBER EMPIRE


“ Jean-Bedel Bokassa,” తనని తానూ సెంట్రల్ ఆఫ్రికాకి రాజుగా ప్రకటించుకున్న సైనికాధ్యక్షుడు.
మనుషులను తిన్నాడన్నా నేరంతో పాటు ఇంకెన్నో నేరాలకి సంబంధించి అంతర్జాతీయ కోర్టులో
ముందు మరణశిక్ష ఆ తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ చనిపోయిన వ్యక్తి.


Michael Goldsmith అనే జర్నలిస్ట్ తిరిగి సెంట్రల్ ఆఫ్రికాకి ప్రయాణమై వెళ్తూ బోకాసా చేతుల్లో
తానూ చిత్ర వధ అనుభవించిన క్షణాలను గుర్తు చేసుకుంటూ వెళుతూ ఉండడటంతో
సినిమా ప్రారంభం అవుతుంది.


ఒక వైపు సెంట్రల్ ఆఫ్రికా ప్రజల మనోగాతాలు. మరో వైపు బోకాసా భార్యలు , పిల్లలతో మాట్లాడిస్తూ
డాక్యుమెంటరీ నడిపిస్తాడు వెర్నెర్. తన ఇల్లు తన వైభవానికి సంబంధించిన క్లిప్స్ . అతని రాజ్య పట్టాభిషేకం.
తన మీద మోపబడిన నేరారోపనలకి సంభందించి తన జస్టిఫికేషన్ గురించి రేడియోలో
ప్రసంగం చేయడం చూపిస్తాడు దర్శకుడు.


వెర్నెర్ అన్ని డాక్యుమెంటరీల లాగా ఇక్కడ ఎక్కడా లీడ్ మాట్లాడడు. లాయర్లు, సామాన్య ప్రజలు ,
బోకాస పత్నులు, పిల్లలు,  జాలరులు, విలేకర్లు ఇలా వాళ్ళతో మాట్లాడిస్తూ బోకాసాని క్షుణ్ణంగా
పరిచయం చేస్తాడు. ఎక్కడ కూడా ఎవరు సరైనవాల్లు అని చెప్పాడు గాని ప్రజల వ్యతిరేఖతని
చాలా డీటెయిల్గా మన ముందు ఉంచుతాడు. ఒక రకంగా ఫాక్ట్స్ ని కలెక్ట్ చేయడం చాల పెద్ద పని.
కలెక్ట్ చేసిన ఫాక్ట్స్ తో డాక్యుమెంటరీ చేయడం ఇంకా పెద్ద పని. డాక్యుమెంటరీని ఫీచర్ ఫిలిం అంత
ఈక్వల్ గా ప్రమోట్ చేయడం కూడా దర్శకుడి ప్రతిభకి నిదర్శనం.


ECHOES FROM A SOMBER EMPIRE చూసాక రాజరికంలో మగ్గిన ప్రజల మనోగాతాలు చాలా బాగా
అర్ధం అవుతాయి. ప్రజస్వామ్యయం కోసం ప్రజలు పడే తపన అర్ధం అవుతుంది. ఎంతటి రాజైన ఏదో ఒక రోజు
ప్రజాకోర్టులో నిలబడాల్సిందే అని కూడా అర్ధం అవుతుంది. అటుగా ఇంకో వైపుగా ఎంతటి ఆలోచనా పరుడైనా
పెద్ద రాజ్యాల మాట వినకపోతే తనకి తానూ నాశనం కొనితెచ్చుకోవడమే అనే అంశం కూడా మనకి అర్ధం అవుతుంది.


బుధవారం :ఫటా మార్గానా ;  fata morgana


ఎండమావుల గురించి మనకి చాలానే తెలుసు. కాని మయాన్ మిథ్ ని బేస్ చేసుకుని సృష్టి ఎలా జరిగింది
అనే విషయాన్ని వివరిస్తూ రక రకాల నేలని చూపిస్తాడు దర్శకుడు. దాదాపు పదహేడు రకాల ఆఫ్రికా నేలని
చూపిస్తూ దేవుడు మనుషులను ఎందుకు చేసాడు అని వివరిస్తాడు.


ఈ డాక్యుమెంటరీ ఒక దృశ్య కావ్యం. I క్రియేషన్ ii పారడైస్  iii గోల్డెన్ ఏజ్ అనే భాగాలుగా డాక్యుమెంటరీని
విడగొట్టి మానవ పరిణామ క్రమం గురించి వారి పరివర్తన నాగరికత గురించి మాట్లాడతాడు . గోల్డెన్ ఏజ్ కొచ్చే
వరకు చావుభయంతో మనిషి కోల్పోయే సంతోషాన్ని మాట్లాడతాడు.


ఈ డాక్యుమెంటరీ అంత దృశ్య కావ్యంగా సాగిపోతుంది.


ఈ డాక్యుమెంటరీ తీసేప్పుడు వెర్నెర్ ఏ కథ అనుకోకుండా వెళ్లి అన్నీ చిత్రీకరించి వచ్చాక స్క్రిప్ట్ రాసుకున్నాడని
చెప్తాడు. స్క్రీన్ ప్లే ని ఎలా రన్ చేయాలో తెలిసిన దిట్ట వెర్నెర్.


మనిషి జీవితంలో ఎందమావుల్లాంటి అనుభవాల్ని మాట్లాడడానికి వెర్నెర్ ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నట్టు
అతడి చిత్రాలు చూస్తే అర్ధం అవుతుంది ..


గురువారం : BELLS FROM THE DEEP  : బెల్స్ ఫ్రం ద డీప్


రష్యన్ మిస్టిసిజం గురించి మాట్లాడే డాక్యుమెంటరీ ఫిలిం.  రష్యాలో మతం పేరుతో వ్యాప్తి చెందుతున్న ఒక కల్ట్
గురించి చాల బాగా ద్రుశ్యీకరించాడు వెర్నెర్. మూఢనమ్మకాలు ఒక్క మన దేశంలోనే లేవు ప్రపంచం అంతా .
ఒక లాగే ఉంటాయని చూపించే అతని ప్రయత్నం నిజంగా అభినందనీయం .


తానే క్రీస్తు గా చెప్పుకునే వ్యక్తిని చూపిస్తూ ప్రారంభమయ్యే డాక్యుమెంటరీ అంత తప్పిపోయిన ఒక పట్టణం
గురింఛి దాని చుట్టూ జరిగే అనేకానేక సంఘటనల గురించి మాట్లాడతాడు. రష్యాలో ఉన్న స్వస్థత గురించిన నమ్మకాలు.
దయ్యాలు దేవుళ్ళ గురించిన నమ్మకాలను అక్కడి జనాలతో మాట్లాడిస్తూ చూపిస్తాడు.


1993 లో ఈ డాక్యుమెంటరీ వచ్చింది. మంగోలియన్ల చేతిలో నాశనం అయిన పట్టణం” Kitezh “ కీటిజ్
గురించి సెకండ్ హాఫ్ చూపిస్తాడు. ఒక పట్టణం అంత భూమిలోకి మాయమవడం. అక్కడ ఒక పెద్ద సరస్సు
లేదా కొలను ఏర్పడడం. దాని పక్కనుంచి లేదా దానిపై నుంచి వెళ్ళేప్పుడు చర్చి గంటల శబ్దం రావడం.
లేదా క్యాండిల్లు పట్టుకున్న వాళ్ళు కనిపిస్తూ మాయమవడం. అక్కడ చేట్టుకోట్టేసిన వ్యక్తి మరణించడం.
దయ్యాలు కనబడడం ఇలాంటివన్నీ డాక్యుమెంట్ చేస్తాడు వెర్నెర్.


ఏ కొలను మీద కొందరు మోకరించి ప్రార్ధనలు చేస్తారో అదే కొలనుకి సంబంధించి కొందరు చేపలు పట్టడానికి తవ్వడం.
ఇంకొందరు దానిమీద ఐస్ స్కేటింగ్ చేయడం చూపిస్తాడు. నమ్మకాలు మనుషుల అమాయకత్వం. మిత్ లను
గురించి ఎక్కువగా చర్చిస్తాడు వెర్నెర్. అవి చూపిస్తూనే ప్రక్రితినీ ఎంత బాగా చూపించగలడో ఏ గ్రాఫిక్ లేకుండా
అతనికే సాధ్యం. మతమా మనిషా ? అన్న ప్రశ్న , మనిషా అదికారమ రాజ్యామా ? అన్న ప్రశ్న అతని ప్రతి
డాక్యుమెంట్లో సినిమాలో ఇన్విసిబిల్  గా కనిపిస్తుంది.


శుక్రవారం : FITZCARRALDO : ఫిట్జ్కారల్డో :


తన అభిరుచికోసం సంతోషం వెతుకుతూ వెళ్ళే ఒక మనిషి ఆదివాసి ప్రజల సేవియర్ గా ఎలా మారి అదే
సంతోషం అనే సంతృప్తి నిర్వచనం ఇస్తాడో , ఓపెరా సంగీతం నేపద్యంలో చెప్పే కథ.


ఈ సినిమాకి , వేర్నేర్కి చాలా అవార్డ్లు వచ్చాయి.1982 లోవచ్చిన సినిమా . Peruvian rubber baron కి
సంబంధించిన సినిమా. ఫిట్జ్ కరాల్దో అనే వ్యక్తి ఒక పడవను కొని పడవను కొండ దాటించి అమెజాన్ అడవుల్లో
వున్న రబ్బర్ ని తీసుకుని గోప్పోడయ్యి తన కోసం తానే ఒక ఓపెరా హౌజ్ కట్టాలన్నది అతని కల . మోల్లీ అనే
తన ప్రేమిక అతనికి చాల సహాయంగా ఉంటుంది.


అతడు పడవ కొని అమెజాన్ వైపుగా ప్రయాణం అవుతున్న సమయంలో అక్కడి మూలవాసులు దాడికి ప్రయత్నించే
అవకాశం ఉందని భయపడి అతనితోవచ్చిన పని  వాళ్లు పారిపోతారు. ఇక్కడ కూడా ఒక మిత్ ఉంటుంది.
ఆ ఆదివాసి తెగలని రక్షించడానికి తెల్ల పడవనేసుకుని ఒక తెల్లవ్యక్తి వస్తాడని. వాళ్ళు ఇతని మీద దాడిచేయకుండా
ఫిట్జ్ కి సహాయం చేస్తుంటారు.


అసలు కొండని తవ్వే పనిని వెయ్యి మంది ఆర్టిస్ట్ లని పెట్టి నిజంగానే చేయించడం వెనక దర్శకుడి పిచ్చి డిటర్మినేషన్
కనిపిస్తుంది. ఆ అమెజాన్ అడవుల అందాలు చూడాలా .. ? ఆ పడవ ప్రయాణం చూడాలా ? పాపం ఈ ఆదివాసిల
కష్టాలను చూడాలా ? మనుషులని పాత్రలని ఇంత అవలీలగా ఎలా తన బుర్రలో చిత్రిన్చుకుంటాడో ఈ దర్శకుడు .
చాలా ఆశ్చర్యం కలుగుతుంది.


ఆ నీటి ప్రయాణం ఆ కొండలు .. ప్రకృతిని ఇంత అద్బుతంగా ఏ దర్శకుడు చూపించి ఉండలేదేమో అనిపిస్తుంది ..
ఒక్కో ఫ్రేం ఒక కవిత ..


…….


అయిదు రోజులు బుర్రంత వెర్నెర్ నిండిపోయాడు. అతని సినిమాలు నిండిపోయాయి. అతనితో చేసిన సాహస
యాత్రలు ఇలాగే గుర్తుండిపోతాయి. ఒక్కసారైనా అతన్ని వ్యక్తిగతంగా కలిసి అతని చేతుల్ని ముద్దుపెట్టేసుకోవాలని
అనిపించింది. ఆ చేతులు ప్రతి సృష్టి చేసేయగలవు. ఇలాంటి సినిమాలు కదా జనాల్ని వెంటాడేవి. ఆ డైలాగ్లు తక్కువ
మాటలతో ఎంత సూటిగా మాట్లాడేస్తుంటాడు . వెర్నెర్.. వెర్నెర్ ,, నువ్వేం చేస్తావో చెప్పడానికి మాటల్లేవు.
నీ పిచ్చి నాకు బాగా నచ్చింది. నీ తెగింపు నీ భోలా తనం. నీ మంచి తనం. నీ మానవత్వం.. చివరాఖరికి నువ్వు
దొంగతనం చేసిన నీ కెమెరా కూడా …


ఈ ఫెంటాస్టిక్ ఫైవ్ సినిమాల పేరుతొ రవీంద్రభారతిలో హరి కృష్ణ మామిడి అన్న పూనుకుని వేయకపోతే నేను  
చూసేదాన్నా !! thank you Hari krishna maamidi anna. Thank you Ravindra bharati




No comments:

Post a Comment