Wednesday, May 9, 2018

మహానటి

#మహానటి

మాటల్లేవ్. గుండెబరువెక్కింది. మాటలు ఆమె అభినయ పరకాయప్రవేశం ముందు ఆమెని తప్ప ఇంకెవరినీ చూళ్లేక దాసోహం అన్నాయ్. మాటలు వెతుక్కుని రాసేందుకు ఇది కథ కాదు జీవితం. జీవితం మూడు ముక్కలు. సంసారం. చదరంగం. సముద్రం. ఎన్నెన్ని నిర్వచనాలు. ప్రతి జీవితం ఒక కథ. ప్రతి కథ ఒక అనుభవం. మహానటిది కూడా లెక్కలేనంత, లెక్కలేయలేనంత అద్భుతమైన జీవితం.  అందమైనదా ? దుఃఖభరితమైనదా ? ఏంటి ? మొత్తంగా ఆమె తనని తానూ మూర్తీభవించుకున్న సంపూర్ణ అనుభవసారం.

ఇప్పటి  వరకు జీవితం అంటే మగవాడిదే. కష్టాలంటే మగవాడివే. అనుభావాలు అంటే మగవాడివే. ఆడవాళ్లు ఎక్కడ తెరమీద తమ జీవితాల్ని తాము ఆవిష్కరించుకున్నది  కనబడదు. మగవాడు రాసిందే  చరిత్ర. కథ.

మాహానటి సావిత్రిగారి జీవితం తెర మీద చూస్తున్నంత సేపు ఎవరికి వారు ఆమెతో కనెక్ట్ అవకుండా ఉండలేరు. చాలా చోట్ల కంటతడి పెట్టించే సందర్భాలు. ఆ సినిమా మూడు గంటల సేపు ఆమె జీవితం మొత్తాన్ని ఆవిష్కరించడం కష్టం. చూపించినంతలో దర్శకుడు ఆమెని మొత్తంగా ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.

ఆమె బ్రతకడాన్ని, ఆమె వైభవాన్ని, ఆమె విలాసాల్ని , బలహీనతల్ని, వ్యక్తివాన్ని పరిచయం చేసాడు. దీనికే సగటు ప్రేక్షకుడు అంతలా కనెక్ట్ అయ్యాడు. తన అంతర్మధనాన్ని తన లోలోపలి సంఘర్షణలని ఇంకా లోతుగా చూపించుంటే ఏమైపోయే వాళ్ళో ప్రేక్షకులు.

ఇది బయోపిక్లు సినిమాగా వస్తున్న కాలం. మనం ఫిక్షన్లను దాటి జీవితాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులం గా ఇంటరెస్ట్ చూపిస్తున్న కాలం. బాగ్ మిల్కా బాగ్, మేరీ కామ్ , దంగల్ , ఇప్పుడు రాబోతున్న సంజూ భాయ్  బాలీవుడ్లో బయోపిక్లకు పెరుగుతున్న ఆదరణ నిదర్శనం. ఇక ఇప్పుడు తెలుగులో కూడా ఈ బయోపిక్ల పరంపర మొదలైన సందర్భంలో వీటిని చాలెంజింగా తీసుకుంటున్న దర్శకులను అభినందించాలి అందుకు సమానంగా ఎప్పుడు మూస ధోరణినే ఇష్టపడతారు ప్రేక్షకులు అనే దాన్ని కాదని మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని గురించి వారిని అభినందించాలి.

మహానటి విషయానికొస్తే ఒక అద్భుతమైన చిత్రాన్ని మనకి నాగ్_ అశ్విన్ అందించాడు. రెండు విషయాల్లో ఆయనని మనం అభినందించాలి. 1. సావిత్రి గారిని ఈ తరం పిల్లలకి పరిచయం చేయటం. 2. సావిత్రి గారిని మహానటిగా ఎప్పటికి బ్రతికుండేట్టు  చేయటం.

కేవలం నటి సావిత్రి గారి ఫోటోని డిస్ప్లే పిక్ గా పెట్టుకుంటే 200 కిలోమీటర్లు ఆ ఫేస్బుక్ అకౌంట్ ఎవరిదో ఆవిడ సావిత్రిలాగే ఉంటారని ఊహించుకుని ప్రయాణం చేసొచ్చిన ఒక అంకుల్ గురించి తెలుసు. సావిత్రి ఫోటో పెట్టుకోగానే ఆవిడ సావిత్రి కాకపోవచ్చు. కానీ సావిత్రి గారి ఫోటో చూసి ఆవిడని ఇంకొకకరిలో చూసుకోవాలనుకున్న ఆమె అభిమానులు లెక్కకుమించే.
ఇవ్వాళా ఆవిడ జీవితాన్ని తెరమీద చూస్తూ ఆ అంకుల్ లాంటి వాళ్ళు. కాటన్ చీరలని కట్టుకుని చేతిలో పుస్తకం పట్టుకుని BA చదవడానికెళ్లిన ఆంటీలందరూ మళ్ళీ ఆమెని గుండెలనిండా నింపుకునే ఉంటారు. 

ప్రస్తుత కాలంలో నటి అంటే జీరో సైజ్ ఉండాలి. డ్యాన్స్ విరగదీయాలి. స్కిన్ షో చేసేందుకు ఒప్పుకోవాలి. అసలు సినిమాలో హీరోయిన్ కి ఏ పాత్రా ఉండదు ముఖానికి మేకప్ వేసుకుని డైలాగ్ లేకున్నా హీరో పక్కనుంటే చాలు లాంటి పరిస్థితులు.  అవి చూస్తున్న ఇప్పటి జనరేషన్ మీద కూడా ఎంత ప్రభావం చూపిస్తున్నాయో చెప్పలేం. మరి మహానటి 300 సినిమాలు ఎన్ని డైలాగులు గుర్తుపెట్టుకుని ఎంత నటనా కౌశలం ప్రదర్శించి ఉంటుంది. హీరోయిన్ అంటే శరీర కొలతలు కాదు . నటనా కౌశలం అని మరో సారి సినీ రంగం వాళ్లకి ఆమె గుర్తుచేస్తే ఈ సినిమా ద్వారా అంతకన్నా ఆశించేదేముంది.

ఆమె ఎంత పట్టుదల గలిగిన మనిషి, ఎంత ధైర్యశాలి, ఎంత నిబద్దత , నిజాయితీ ఉన్న మనిషి, మాట మీద నిలబడగల మనిషి , మంచితనం నటనలా కాకుండా జీవన విధానంలా చేసుకున్న మనిషి, మోసపోతున్న ప్రేమించే మనిషి. మగవాళ్ళకి సమానంగా ఏదైనా చేయగల మనిషి. అంగరంగ వైభవంగా బ్రతుకగలిగి అవి లేకున్నా బ్రతుకును అంతే ధైర్యంగా బ్రతికిన మనిషి. అంతటి ధీశాలి కూడా" ప్రేమ " దెబ్బకి కుప్పకూలి పోవటం ఎంత నేర్పుతుందో చూసే జనాలకు. జీవితాన్ని అడ్వెంచర్ గా తీసుకునేవాళ్లు చాలా తక్కువ మంది వుంటారు. సావిత్రి గారు అంత అడ్వెంచరస్ వుమెన్ అయ్యుండి కూడా ప్రేమ దగ్గర ఎందుకింత పలచనయిపోవటం అనిపించొచ్చు.

ఆమె ఎక్కడా ఓడిపోలేదు. ప్రేమ మోసం చేసేంత చుట్టుకున్నా తనని తాను ప్రేమకోసం కాల్చుకుంది. ప్రేమ అందరికీ అర్ధం అయిన భావన అంటే పొరపాటే. లోకాన్ని ఎదిరించి ప్రేమకోసం సాహసం చేయడం. జీవితాన్ని ఫణంగా పెట్టడం సాహసవంతులే చేయగలరు. అది సావిత్రి గారికే సాధ్యమైంది. ఆమె ఎదుగుదలకి ఓర్చుకోలేని సహచరుడు. ఆమెతో ఉంటూనే ఆమెని మోసం చేసిన వ్యక్తులు పశ్చాత్తాపం లేకుండానే చనిపోయుంటే వాళ్లంత పాపాత్ములే ఉండరేమో. సావిత్రమ్మ జీవితం ఒక పాఠం. ఆమె అనుభవాలు ప్రతి స్త్రీ తన జీవితాన్ని ఎంత సమర్ధవంతంగా నిర్వహించుకోవాలో చెప్పే గురువులు. ఆమె మన ముందు తన జీవితాన్ని ఒక ఉదాహరణగా పరిచి వెళ్ళింది.  ఈ సినిమాతో ఆమె మళ్ళీ జీవించటం మొదలు పెట్టింది. ఆమె ఎప్పటికీ జీవిస్తుంది.

సినిమాని దర్శకుడు ఏ ఏ టెక్నీక్లు వాడి తీసాడన్నది పక్కన పెడితే. ఆ కాలంలోకి తీసుకెళ్లేందుకు వాడిన కలర్ బాలన్స్ అద్భుతం. ప్రతి ఫ్రేమ్ ఒక దృశ్యకావ్యం. నటులందరి సమిష్టి కృషి ఈ సినిమాలో కనిపిస్తుంది. దర్శకుడి దార్శనికత అతడు ఆమె జీవితాన్ని స్క్రిప్ట్ రాసుకుంటూ ఎంత ప్రేమించాడో కీర్తి సురేష్ని క్లోజ్ అప్ షాట్స్ తీసేప్పుడు కనిపిస్తుంది. కీర్తి సురేష్ సావిత్రిలాగా తనని తానూ మలుచుకోవడంలో విజయం సాధించింది.

ఇన్ని రోజులు ఆడవాళ్లు బలహీనులన్న అపోహలను బద్దలుకొట్టడానికి ఇలాంటి బయోపిక్ లు రావాల్సిన అవసరం ఇంకా ఉంది. వాళ్ల ఆలోచనా ధోరణులను క్షుణ్ణoగా చర్చకి పెట్టి వాళ్ళ మానసిక పరిస్థితులగురించి మాట్లాడాలంటే ఇంకా చాలా మంది జీవితాల్ని మన ముందు ఆవిష్కరించే సమయం రావాలి. అలాంటి వాటికి ఈ మహానటి సినిమా  ముందడుగు.

***

ఈ సినిమా కేవలం సావిత్రిగారి జీవితం గురించే మాట్లాడదు. ఆమె జీవితంతోపాటు ముడేసుకున్న అప్పటి కాలమాన పరిస్థితులగురించి మాట్లాడుతుంది. అణాలు , నాటకాల కంపెనీలు. నాట్యమండలిలు . సినిమా ప్రభావం వల్ల దెబ్బ తిన్న నాటకాలు. తెలుగు రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాలు. రాజకీయ పరిస్థితులు . సినిమా కోసం వచ్చే ఆడపిల్లల్ని ఎక్సప్లయిటేషన్ చేయడం చూపించే ఒక చిన్న సంఘటన సినిమా పరిశ్రమ పాడయ్యేందుకు ఎలా పూనుకోవడం. ఇవన్నీ రికార్డ్ చేసింది.

నాగ్ అశ్విన్ సావిత్రి గారి జీవితాన్ని మనకి సినిమాగా అందించడంతో పాటు ఆమెతో పాటు నడిచిన చరిత్రని కూడా దృశ్యమానంగా రికార్డ్ చేయడం ద్వారా తన ఎబిలిటీని ప్రూవ్ చేసుకున్నాడు.

"సినిమా పరాదిసో " నాకిష్టమైన సినిమాల్లో ఒకటి అందులో ప్రొటాగనిస్ట్ కారెక్టర్  బాల్యం నుంచి అతని జీవితాన్ని ఎలా ఆవిష్కరిస్తూ వెళ్లి సినిమా ప్రపంచాన్ని ఏలే ఒక డైరెక్టర్ గా మారతాడో ఎలా తన జీవితం మలుపులు తిరుగుతుందో విషాదాలు ఆనందాలు అన్ని కలగలిపి చూపించాడో దర్శకుడు. మహానటి సావిత్రి చూస్తున్నప్పుడు కూడా అదే అనుభవం కలిగింది. అనంతు చింతలపల్లి గారు అన్నట్టు ఆవిడని జాతీయస్థాయికి పరిమితం  చేయకుండా అంతర్జాతీయ స్థాయికి ఎక్స్ప్లోర్ చేయగలిగేలా ఇది వెళ్ళుండాల్సింది. వెళ్తుందేమో కూడా చెప్పలేం.

మొత్తంగా మహానటి సావిత్రి గారు you lives on and on... !!

-------------
మెర్సీ మార్గరెట్
9052809952







 











No comments:

Post a Comment