Wednesday, May 16, 2018

RAAZI- To love your country does not mean to hate another.

 " రాజీ " ( Raazi ) సినిమా చూసొచ్చానూ:

 సినిమా చూస్తున్నంత సేపు  ఎన్ని ప్రశ్నలు . ఎన్ని భావోద్రేకానికి లోనైయ్యే సందర్భాలు . ఎన్ని సవాళ్లకు మానవత్వం దేశభక్తి ముడిసరుకు? అని మనల్ని మనమే ప్రశ్నించుకునే సందర్భాలు . దేశభక్తి  ఇంత అద్భుతంగా ఉంటుందా అని అదేదో భావోద్రేకానికి లోనై రోమాలు నిక్కపొడుచుకోవటాలు. దేశభక్తి వర్సెస్ ప్రేమ ? ఎటువైపు ఎలా ఆలోచించాలో ప్రేక్షకునికి వదిలేసిన దర్శకత్వం. అన్ని కలిసి ఒక మంచి సినిమా. గుర్తుండిపోయే సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం చేసి అభినందనలు అందుకుంటున్న మేఘన గుల్జార్ ని మనమూ అభినందించకుండా ఉండలేము. ఆలియా భట్ నటన ఇంకా మెరుగైంది. తనకీ ఈ  విజయంలో ఎక్కువ  పాళ్లు క్రెడిట్స్ అందుతాయి.

అసలు కాశ్మీర్ అనేదే చాలా సున్నితమైన ప్రదేశం,సమస్య కూడా. బజ్రంగీ భాయ్ జాన్ సినిమాలో అర్ మన కాశ్మీర్ అక్కడ ఉందే అని చూసి ఆశ్చర్యపడ్డ సంఘటన ఇంకా మర్చిపోనే లేదు. ఎక్కడైనా ఒక బాంబ్ పేలిన సంఘటన అల్లర్లు జరిగిన సంఘటన వింటే ముందుగా అనుమానస్తులుగా ముస్లింలవైపే చూసే వర్తమాన పరిస్థితుల్లో మనం వున్నాం.  ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ అంటే పెద్ద వ్యాపారఅంశం అది. పరమ శత్రు దేశంతో మనం యుద్ధం చేస్తున్నట్టే ఫీల్ అవటం క్రికెట్ చూస్తూ కూడా.

దేశభక్తి మాకు మాత్రమే సొంతం అనుకునే ఒకానొక మత, పార్టీ   ప్రభావం  నడుస్తున్న గడ్డు పరిస్థితుల కాలం ఇది . ఇంత దైర్యంగా ఈ అమ్మాయి మేఘన గుల్జార్  1971 సంవత్సరం టైం పీరియడ్ని తీసుకుని తూర్పు , పశ్చిమ పాకిస్థాన్ల  మధ్య యుద్ధ వాతావరణం , ఘాజీ అటాక్ లకు సంబంధించి ఒక ముస్లిం యువతీ భారత దేశ గూఢచారిగా తన జీవితాన్ని ఫణంగా ఎలా  పెట్టింది అన్నదే సినిమా.

2017 సంవత్సరం లో the Centre for the Study of Developing Societies వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు.  ఆ సర్వే ప్రకారం 33% హిందువులు  ప్రాణస్నేహితుడుగా / స్నేహితురాలుగా ముస్లింని కలిగి ఉంటె , 74%  మంది ముస్లింలు తమ ప్రాణ స్నేహితులుగా కలిగి ఉన్నారంట. మతం , ఎలెక్షన్లు వాటికి గల  సంబంధం  గురించి తెలుసుకునేందుకు జరిగిన ఈ సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే  భారతదేశంలో ఏ వర్గం వాళ్ళు వాళ్ల వర్గం వాళ్ళతోనే  స్నేహం  చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.  ముఖ్యంగా  గుజరాత్ , హర్యానా , కర్ణాటక మరియు ఒరిస్సా  రాష్ట్రాల్లో ఈ విధమైన స్నేహాలు  నడుస్తున్నాయి,అక్కడ ముస్లిం లను చిన్న చూపు చూస్తూ ఒంటరివాళ్లను చేస్తున్నరు. 

13% మంది హిందువులు , ముస్లింలు " highly patriotic " అత్యంత దేశభక్తి కలిగిన వాళ్ళుగా భావిస్తుంటే 77% ముస్లింలు తమని తాము  " highly patriotic "గా భావిస్తున్నారు . ఇదెందుకు చెప్పాల్సివస్తుందంటే హిందువులు దేశభక్తి , ముస్లింల వైపు నుంచి  ఒకలా ఆలోచిస్తే , ముస్లిం లు దేశభక్తి గురించి తాము ఎంత నిబ్బద్దతో ఉన్నారో చెబుతున్నట్టు  ఉంది,

మరి మనం  ఎక్కడ పొరపాటుపడుతున్నాం ?    మతంకి దేశ భక్తి ఉంటుందా ? మతమే దేశభక్తా ?  పలానా మతస్తులే దేశభక్తులు అన్న ఎన్నో ప్రశ్నలు ఈ కాలంలో చాలానే చర్చకు  వచ్చాయి. నేనంటాను మత ప్రాదిపదికన దేశభక్తిని నిరూపించుకునే రోజు రావడమే మన  దౌర్భాగ్యం. స్వాతంత్య్ర పోరాటం సమయంలో హిందువులతో సమానంగా ఉద్యమంలో పాల్గొని ప్రాణాలర్పించిన ముస్లింలున్నారు. అతి భయంకరమైన బైఫర్కేషన్ చూసి వెళ్లలేక వెళ్లిన ముస్లింలు ఉన్నారు.  బాగ్ మిల్కా బాగ్ సినిమా ఆ పెయిన్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది. కానీ RAAZI  సినిమా కోణం బైఫర్కేటైన ఇరుదేశాల ప్రజలు ఎవరికీ వాళ్ళే గొప్ప  దేశభక్తులుగా నిరూపించుకోవలసిరావటం. 

సినిమా విషయానికొస్తే :

1971 సంవత్సర కాలంలో ఎమర్జెన్సీ పరిస్థితులు, పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితుల మద్య , ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న అమ్మాయి అనుకోని కారణాల వల్ల గూఢచారిగా మారాల్సివస్తుంది. తాతల తండ్రుల నించి ఆ దేశభక్తి తన నరనరాల్లో జీర్ణించుకుని ఉందని చెప్పే సెహ్మత్ ( ఆలియా ) షార్ట్ టర్మ్ ట్రైనింగ్ తీసుకుని పాకిస్తాన్ మేజర్ కొడుకుని పెళ్లి చేసుకుంటుంది. అదీ తండ్రి కుదిర్చిన సంబంధమే. పాకిస్తాన్ పోలీస్ మేజర్ తో స్నేహంగా ఉంటూనే దేశపు ఇంటలిజెన్స్కి ఉప్పందించే వ్యక్తిగా అతడున్నట్టు తన పాకిస్తాన్ స్నేహితుడికి తెలియనియ్యనివ్వడు. పెళ్లి చేసుకుని అత్తగారింట్లో పరాయి దేశంలో శత్రువుగా భావించే దేశంలో, క్రష్ ఇండియా అని ప్రతి చోట నినాదాలు ఇవ్వబడే దేశంలో తనని తానూ ఎలా కాపాడుకుంటూ దేశంపై జరుగుతున్న కుట్రను భంగం చేయడానికి ఎన్ని సాహసాలు చేసిందో. చివరికి తన ప్రేమనే ఎలా ఫణంగా పెట్టిందో చూపే సినిమా . ఈ సినిమా హరిందర్ సిక్కా నవల " కాలింగ్ సెహ్మత్ " ని బేస్ చేసుకుని తీసింది. ఈ నవల యాధార్ధ సంఘటనల్ని ఆధారం చేసుకుని రాయబడిందవటం కూడా అదనపు బలమేమో సినిమాకి. అందువల్ల ప్రేక్షకుడు ఇంకెక్కువ థ్రిల్ ఫీల్కాగలిగాడు.   

ఆలియా భట్ చాలా బాగా నటించింది. హై వేలో,  ఉడ్తా పంజాబ్, డియర్ జిందగీ  సినిమాలలో తన అద్భుతమైన  నటనతో ఆకర్షించిన ఆలియా ఈ సినిమాలో చాలా మెచ్యూర్ గా నటించటం గమనించొచ్చు.   అద్భుతమైన ప్రకృతి రామణీయతని ఈ సినిమాలో చూడొచ్చు. ఒక అమాయకమైన ఆడపిల్ల నుంచి స్పై గా మారడమే కాకుండా చంపే వరకు నరనరాల్లో దేశాన్ని నింపుకున్న ఒక ముస్లిం అమ్మాయి గాథని తన కథే అన్నంత బాగా చేసింది ఆలియా.  మిగతా అందరూ నటులు కూడా తమ పాత్రలని చాలా బాగా నిర్వర్తించారు. 

దర్శకురాలు ఏం చెప్పాలనుకున్నారో ప్రతి ఫ్రెమ్లో , ప్రతి షాట్లో క్లియర్ గా అర్ధం అవుతుంది. ప్రొటాగనిస్ట్ పాత్ర పడాల్సిన మానసిక సంఘర్షణని, ప్రతి సారి ప్రమాదపు అంచుల దాకా వెళ్లి తప్పించుకునే పరిస్థితుల్ని చూసే ప్రేక్షకుడు కూడా తీసుకునేట్టు చూపించడంలోనే ఆమె ప్రతిభ బేరీజు వేయొచ్చు,

మద్రాస్ కేఫ్ సినిమా కొంత ఇలాంటి నేపధ్యాన్ని సినిమాగా చూపించింది, తరువాత ఒక దేశం రక్షణవ్యవస్థ ఎంత చాకచక్యమైన సమాచార వ్యవస్థ విస్తృతి కలిగి ఉంటారు ? మనం ఇంత ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం అంటే మన కోసం ఎంత మంది గూఢచారులు వివిధ దేశాల్లో పనిచేయాల్సి వస్తుంది లాంటిని ఈ సినిమా చర్చిస్తుంది. చూస్తున్నంత సేపు  కుటుంబాలని దేశాలని విడిచి వాళ్ళు మనకోసం ఎంత కాశపడుతున్నారు అని  వాళ్లకు హృదయం లోలోపలే కృతజ్ఞతలు చెప్పుకుంటాం. 

సినిమా మొదట్లో ఒక చిన్న ఉడత పిల్లని కాపాడడానికి పూనుకునే ఒక అమ్మాయి ,పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లి , అత్తగారి కుటుంబాన్నే నాశనం చేయగలిగేంత దేశభక్తిని ఎలా నింపుకుందో తాత్వికంగా ఆలోచిస్తే బుర్ర వేడెక్కుతుంది. దేశం అంటే మనుషులు , మట్టి కాదని ముందు నుంచి నమ్ముతుంటాం మనం. మరి ఈ యుద్ధాలెందుకు, ఈ విడిపోయిన మనుషులు ఒకప్పుడు మన వాళ్ళే కదా, వాళ్ళ మీద మనకెందుకు అంత కోపం, వాళ్ళకెందుకు అంత పగ ?? . చివరాఖరికి దేశం విషయానికొస్తే ఆలీయానే ఇండియన్ ఇంటలిజెన్స్ చంపేయాలనుకోవడం తన కళ్ళతో తానె చూసాక జీవితమా దేశమా లాంటి పెద్ద పెద్ద మాటలు మనం కూడా మాట్లాడమేమో.. ! 

ఒక రకంగా బాలీవుడ్ లో ఉమెన్ ప్రొటాగనిస్ట్ ల పాత్రలు వచ్చినంత మన తెలుగులో లేవు. ఇలాంటి సబీజెక్ట్లను తీసుకుని  తెలుగులో కూడా ఇంత గొప్ప పాత్రలని సృష్టించగలగాలి. 

మొన్నీ మధ్య ఇరాన్ ఫిలిం ఫెస్టివల్లో ఇద్దరు విమెన్ డైరెక్టర్ల అద్భుతమైన సినిమాలు చూసాక మనకు ఎందుకు ఇలా స్త్రీ దర్శకురాళ్లు లేరు అని కొంచెం బాధనిపించిన మాట వాస్తవం. మేఘన గుల్జార్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రం రూపంలో చూసాక త్వరలో తనని చూసి ఇంకెందరో వుమెన్ డైరెక్టర్లు రాబోతున్నారన్న ఆశ కలిగించింది.  ఎక్కడ ఓవర్ యాక్షన్లు లేకుండా .. దేశభక్తి అనగానే జాతీయగీతం లాంటివి లేకుండా. బాక్డ్రాప్ లో విపరీతమైన BGM లు లేకుండా చాలా చక్కగా సినిమాని కూర్చి నా పేరు ముకేశ్ యాడ్ నుంచి,  స్ట్రాంగ్ వాల్  యాడ్స్ నుంచి కూడా కాపాడింది మేఘన. అంతేనా " Watan ke aage kuch bhi nahi, khud bhi nahi "    లాంటి డైలాగ్స్ విన్నప్పుడు మనకీ దేశభక్తి లోలోపల ఉప్పొంగుతుంది. 

ఈ సినిమాతో హిందూ ముస్లింలమధ్య ఆ వైరి భావం, దృక్పదాల్లో మార్ఫు తీసుకొచ్చే ప్రయత్నం కొంత వరకు జరిగింది. నిజంగా ప్రేక్షకులు ఈ సినిమాని అంతే పాజిటివ్ గా తీసుకోగలిగితే అంతకు మించిన సార్ధకత లేదు. 

ఈ సందర్బంగా మేఘన గుల్జార్ ఒక ఇంటర్వ్యూ లో అన్న మాటలు మనల్ని వెంటాడతాయి - " నువ్వు నీ దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడం గొప్ప విషయమే, అలా అని దేశాన్ని ప్రేమియించడం అంటే ఇతర దేశాలని ద్వేషించడం కాదు ". 





  






   





No comments:

Post a Comment