Monday, February 26, 2018

రన్ లోల రన్

పరుగు. గడియారం .కాలం .జీవితం.  నిమిషం.. నిమిషం.. ఏదో తెలియని ఉత్కంట. ఇరవై నిమిషాలు ప్రియుడి ప్రాణం. లోల పరుగు. "మని' కోసం పరుగు.
మని , లోల ప్రియుడు.

సమయం , గమ్యం. లక్ష్యం గమనం. ప్రణాళికలు పరుగులు. పర్సెప్షన్స్. పర్వర్శన్స్. లోల పరుగు.మని .. జీవితం..  కాలం ముగింపు. కాలం ఆట .. ఆట ముగింపు కాదు. 20 నిమిషాల్లో లోల .. చేయగలిగేది ఏంటి ? పరుగు చెప్పేదేంటి ?

నిన్న సినీవారంలో ప్రదర్శింప బడ్డ సినిమా " రన్ లోల రన్ ".

ఒక ఎనభై నిమిషాల  సినిమాలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు అని వెతికితే ముంజేతికి అద్దం కట్టి మిమ్మల్ని మీరూ ఒకసారి చూసుకోండి అన్నట్టు ఉంటుంది సినిమా.

చిన్న చిన్న స్మగ్లింగ్ వ్యాపారం చేసే మని వజ్రాలను చేరవేసి 100, 000 /- DM లక్ష డచ్ మార్క్ లను తీసుకుని డబ్బులు తిరిగిచ్చే క్రమంలో ట్రైన్లో పోలీసు లను చూసి కంగారుతో డబ్బు సంచి మర్చిపోయి దిగేస్తాడు. అప్పుడు అందులో ఎక్కినా బిచ్చగాడు ఆ సంచి ని చూసి అందులో డబ్బుల్ని చూసి తరువాతి స్టేషన్లో దిగిపోతాడు. ఆ లక్ష మార్క్స్ ఇవ్వకపోతే ఆ ముఠా మని ప్రాణం తీసేయడం ఖాయం. మనికున్న ఒకే ఒక ఆధారం లోల . లోల తన ప్రేమికురాలు. మని భయాన్ని అర్ధం చేసుకుంటుంది. ఇరవై నిమిషాల్లో డబ్బుతో వస్తాను అంటుంది. ఇరవై నిమిషాల్లో లోల డబ్బుని ఎలా సంపాదిస్తుంది. అసలు ఆ విపత్కర పరిస్థితి నుంచి మనిని రక్షించుకుంటుందా లేదా అన్నది సినిమా.

తన ఇరవై నిమిషాల కాలాన్ని . తన అనుకూలతల్ని దర్శకుడు మూడు సంఘటనలుగా విడగొట్టి చెప్పడం అధ్బుతం. ప్రేక్షకున్ని తనతో పాటు పరుగెత్తించాడు దర్శకుడు. అధ్బుతమైన స్క్రీన్ ప్లే, చివరకి వచ్చే హిందుస్తానీ సంగీతం వరకు మనమూ మన ఆలోచనల్ని లోల కాళ్ళతో పాటు పరుగులు పెట్టిస్తాడు దర్శకుడు.

లోల ప్రియుని కోసం పరుగేడుతుందా ? లేదా లోల స్థానంలో వుండి మనమే యే లక్ష్యం కోసం పరుగెడుతున్నాం అని ప్రశ్నించుకునేట్టు చేస్తాడు దర్శకుడు.

"అదే క్షణంలో అలాగే  జీవించు "అనేది జర్మన్ల ఫిలాసఫి. అప్పటికప్పుడు ఆ క్షణంలో ఎలాంటి ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటూ నిర్ణీత సమయంలో ప్రియున్ని కాపడుకోవడాన్ని ప్రయోగాత్మకంగా ఇరవై ఇరవై నిమిషాలుగా మూడు భాగాలుగా ఆమె పరుగును చిత్రీకరించాడు దర్శకుడు.

మనిషి తీసుకునే నిర్ణయాలు వాళ్ళ జీవితాలమీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి. సమయం గమ్యం నిర్దేషించబడి ఉన్నప్పుడు మనిషి తీసుకునే నిర్ణయాలు తన గమ్యానికి చేరువ చేస్తాయా ? దూరం చేస్తాయా ? అన్న పరిణతి మారుతున్న ఆమె ప్రతి పరుగులో కనిపిస్తుంది.

ఇదేదో సందేశాన్ని ఇచ్చే సినిమా కాదు. నీతి సూక్తులు వల్లిస్తూ భూమిలోకి దిగిపోయే అంత భారీ డైలాగులు వుండవు. its purely a German Classical Existentialism గురించి చెప్పే సినిమా. ఒకే సినిమాలో ఇరవై నిమిషాల్లో realism , Anti realism ,flashbacks ,  philosophical musings. emotional attachments and detachments. anger and acceptance  అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాడు దర్శకుడు టాం టైక్వార్ ( Tom Tykwar). 

సినిమా చూస్తూ మన జీవితానికి కూడా ఇలా రివైండ్ చేసుకుని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది. సినిమాలో ఆమె  పరుగుని అదే పరుగుని మూడు సార్లు ఒక్కోసారి పరుగెత్తేప్పుడు ఆమె ఎలా ఎలా తన పరుగు లక్ష్యాలను మార్చుకోవాలో చూపిస్తూ తీస్తాడు దర్శకుడు . ఒక పరుగులో ఆమె చనిపోతుంది అనే ఆలోచన. రెండో పరుగులో మని చనిపోతాడు . ఇద్దరి మరణాలు లేకుండా ఆ గడ్డు సమస్యనించి బయటపడటం గురించి మూడో పరుగు. ఒక abstract సినిమా. ఎవరిని వాళ్ళు తమ నిత్య జీవితాన్ని ఆ సినిమాలో  చూసుకునేలా ఉండే సినిమా " రన్ లోల రన్ " ఈ సినిమా 1998 లో "టాం టైక్వార్ " దర్శకత్వం వహించింది.

No comments:

Post a Comment