Wednesday, October 16, 2013

ఓ వాన - ఓ కొబ్బరి చెట్టు - నేను

15 October 2013 at 01:05
ఇవాళ నేను నిజంగా పండుగ చేసుకున్నాను. అవును పండుగంటే ఏంటి? నా చుట్టూ ఉన్న వాళ్లనడిగా పండుగంటే పండుగే అన్నారు. నిజమేనేమో,.. పండుగంటే ఇది, ఇందుకోసమే పండుగ చేసుకుంటాం అని కచ్చితంగా ఎవరు నిర్వచించలేరేమో? అయితే మన పరిధిలో లేని దాన్ని చేరుకున్నప్పుడో, ఊహించలేని మంచి జరిగినప్పుడో, అసాధ్యమైన యుద్దాలో అవిశ్వాసాలను గెలిచినప్పుడో, మనసు నిండా హృదయం పొంగేంత ఆనందం నింపే క్షణాలు సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిజంగానే పండగ చేసుకుంటాం. ఆ క్షణాల్ని సజీవంగా బ్రతికించుకోడానికి పండగ చేసుకుంటాం.


ఈవేళ నేను పండగ చేసుకున్నా. హెచ్ ఆర్కే గారి "వానలో కొబ్బరిచెట్టు "కవితా సంకలనం చదువుతూ. ఒక జీవితం కవిత్వమై నాకు పంచ భక్ష్య పరమాన్నాలు వడ్డిస్తుంటే. ఒక వసంతాన్ని భుజాన వేసుకొచ్చి కోకిలై కవిత్వాన్ని వినిపిస్తుంటే. ఉగాది పచ్చడై జీవితాన్ని షడ్రుచులుగా రుచిచూపిస్తుంటే.

"వానలో కొబ్బరిచెట్టు " కవిత్వం నన్ను ఆసాంతం తడిపేసింది. నన్ను కొబ్బరి చెట్టుని చేసి, కవిత్వమై నన్ను తడిపింది. ఇందులోని మొదటి కవిత "వానలో కొబ్బరి చెట్టు " ఈ కవితలో కవి అంటాడు "నువ్వొక కొబ్బరి చెట్టు "(పు 12). కొబ్బరి చెట్టుకు వానకు సంబంధం ఇంత అధ్బుంగా చిత్రీకరించి నన్ను ఆ కవిత్వ వాన ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేసింది ఈ కవిత్వం.
 -
వానలో కొబ్బరి చెట్టు ఓలలాడుతుంది 
 కొబ్బరి చెట్టులో వాన నాట్యమాడుతుంది 
 అడవి -చెట్టును కప్పేసే లతలా బతుకు చుట్టూ మండుతుంది ( పు 12)
 అవునేమో వానలో కొబ్బరి చెట్టు, కొబ్బరి చెట్టులో వాన ఒదిగిపోయి పెనవేసుకునే  సందర్భంలోంచి కొద్దిగా బయటికొచ్చి, నీటి గురించి కవి రాసిన మాటలు ఒక దృశ్యాన్ని ఆవిష్కరించాయి.

మనిషి కొబ్బరి చెట్టైతే, వాన కవిత్వమని వాన కురిపించే నీరు కవిత్వమని  చెబుతూ (పు 13) లో ఇలా అంటాడు
-
నీరు బతుకును మోస్తుంది 
 విశ్లేషణకు వీలుగా చాకై కొస్తుంది 
 చల్లని మడతలలో దిగులును ముడిచి
 తెల్లని ఊపిరి ఉలిపిరి పొరల్లో దాస్తుంది
 శబ్దిస్తుంది, నిశ్శబ్దాన్ని నిర్వచిస్తుంది
అడవి దారిలో అలిసిపోయి ఒక దాపున కూర్చున్నప్పుడు
 విన్పించే
 కొండవీణ ఏక స్వరం సెల స్వనం లోని నిశబ్ధం నీటిది //
 ఈ నీరు ఏమై ఉంటుంది. నీరు బతుకును మోయడం ఏంటి? కొద్ది సేపు ఆలోచించిన నాకు అనిపించింది ఈ నీరు కన్నీరే అని. కన్నీరు తప్ప బతుకును ఏ నీళ్ళు మోయగలవు ? ఓ కవి అన్నట్టు కళ్ళు తడవకుండా జీవితం దాటలేమని, కన్నీరు లేకుండా జీవితం ముందుకు సాగదని. ఇంతటి బరువైన సాంద్రమైన మాటలు ఎంతటి జీవితాన్ని చూస్తె రాయగలం?
-
అన్నీ మరణిస్తాయి లేదా నశిస్తాయి నీరు ఉంటుంది
 అన్నీ విడిపోతాయి కలుసుకోవాలని అలమటిస్తాయి
విడిపోవడం కలుసుకోవడం ఒక్కటే నీటికి// (పు 13)
 నిజమే కదా (ఒక దీర్ఘ నిట్టూర్పు ) మొదట వాన కవిత్వామనుకున్నాను, తరువాత వాన కన్నీరనిపించింది. ఇప్పుడు వాన అనుభవాల సారం అనిపిస్తుంది. నిజమే ఈ మనిషనే కొబ్బరిచెట్టు, అనుభావాల సారంలో కన్నీటితో కవిత్వమై ఓలలాడుతుంది.
-
"వాన గొప్ప నాట్య గురువు "
"నీరు నాట్యం చేస్తుంది "
"నీరు మనిషికి మొదటి అద్దం "
"నీరు బతుకును మోస్తుంది "
"వాన బ్రతుకు నాట్య గురువు " 

అర్ధాలు అడక్కుండా ఆడుకోవడం. జీవితాన్ని అర్ధవంతంగా మొదలుపెట్టి ముగించడం "కళ" కదా ..!! అందుకే ఏ ద్వేషం, కలుషితం అంటని పాపాయిని, కల్మషంలేని నీటిని (కవిత్వాన్ని / కన్నీటిని )అడగమంటున్నాడెమో కవి .
-
అర్ధాలు అడక్కుండా ఆడుకోవదమేలాగో 
అడిగితే పాపాయి నడుగు
లేదా వానచినుకులుగా తనలోంచి తాను
తనలోనికి తాను రాలే నీటిని అడుగు  //

"అమ్మూ" అనే కవిత చదువుతున్నప్పుడు కవి విశ్లేషనాత్మక దృష్టికోణం నన్ను ఆశ్చర్యపరించింది. రెండు లైన్లలోని మాటలతో ఒక మనిషిగా మనిషి చేసే అయిష్టమైన పనిని చెబుతూ
-
నీలా ఉండలేక మేం
నిన్ను మాలా తయారు చేస్తాం // అంటాడు
కల్మషం అంటని పసితనాన్ని, ద్వేషం మోసం తెలియని పాపాయి ప్రాయంలోకి తిరిగి వెళ్ళడం సాధ్యం అవ్వక ఆ పసితనానికి ఎన్నెన్నోనేర్పుతాం. ఎన్నెన్నో కనుక్కోమని అభ్యాసం చేయిస్తాం. అలా తనను తాను కనుక్కొని వలయాల లోపలి  వలయాల్లోంచి జారిపోయే మనసును  గుర్తుకు చేస్తూ అద్దం ముందు నిల్చోబెట్టి నట్టు అనిపిస్తుంది.

తన నుండి తాను విడివడి, తనని తాను జయిస్తూ నడిచేవాడిలా చెప్పకనే చెపుతూ నడిపించే కవిత "చెంచు కుర్రాడు "
-
మర్నాటికి మాయమయ్యే కాసులు కొన్ని
జేబులో పోసుకొని
నా వంతు మోసం నేనూ చేద్దామని
బయల్దేరుతాను //
అంటూ ఒక నిజ స్థితి నుంచి ఓ కుర్రాడిని తనలో చూపిస్తూ కొన్ని తేడాలను విడమర్చి చూపిస్తూ చివరికిలా ముగిస్తాడు. ఆ ముగింపుతో మనల్ని తనతో పాటు కుదిపెస్తాడు.
-
కుర్రాడు వాడి పోతాడు
ఓడిపోతాడు
నా లోపలి బురదలోపలినుంచి
వికసిస్తూనే ఉంటాడు (పు 18)//

ఇక "నిర్ణయం " అనే కవిత. నిర్ణయమే ఫలితం అని చెపుతూ
-
వసంతం ఎప్పుడూ ఉంటుంది

వసంతం ఒక ఋతువు కాదు. అదొక నిర్ణయం //
అంటూ నిర్ణయం తాలూకు ఫలితాలు, ఆ ఫలితాల ప్రభావం స్వీకరించే జీవితంలో కొని కాలాలు చెప్తుంటాడు. అంతే కాదు. ఆ ఫలితాల వల్ల కలిగే పరిణామాలు స్వీకరించే దశల్లో బాధ కలిగితే దిగులేస్తే ఏం చేయమంటాడో కవి చూడండి
-
బాగా దిగులేస్తుందా. అయితే ఎవర్నీ ఏమీ అనకు ఊరికే
కూర్చుని ఒక మంచి పద్యం చదువుకో, పద్యంలో కలిసిపో 
ఆ తరువాత తీరిగ్గా సిగరెట్టు వెలిగించినా వెలిగించకున్నా
నీ ముందొక అద్దం ఉన్నా లేకున్నా నీకు నువ్వు మనోహరంగా కనిపిస్తావు //   
మనోహరంగా కనిపించడమే కాదు. ప్రేమకు మూలం. ప్రేమను ఆశించి పొందే విధానం కూడా ఆయనే చెబుతారు ఇలా.. ఓ పద్యంలో /పద్యంతో కలిసిపోయాక
-
నీ మీద నీకు గొప్ప ప్రేమ పుడుతుంది (నిజమేనండోయ్ ..! హెచ్ ఆర్కే గారి కవిత్వం చదువుతుంటే ఇప్పుడు అదే జరుగుతుంది )
ఆ తరువాత చాచిన కొమ్మల నిండా, కొమ్మలను సుతారంగా నిమురుతూ
వెళ్ళేగాలి నిండా, గాలి అలల మీద కదిలే పొగ మంచు నిండా
పొగమంచు మోసే లేలేత ఉదయం నిండా ప్రేమ ప్రేమ ప్రేమ ..//
నిజమే కదా !ఎవరైనా ఒప్పుకోవాల్సిందే !

ఇక  "నేనూ వాళ్ళు " అనే కవితలో సీతాకోక చిలుకను, తనతో అలాగే ఓ సమూహంతో అనుసంధానించి చెప్పే తీరు అధ్బుతం.

అలాగే "ఆకాశంలోంచి చూడు "అనే కవిత దూరంగా ఉంటున్న తన వారి గురించి తపించి ఓ మనవరాలి కలుసుకోవాలనే తపన వారి నావిష్కరించే అందమైన దృశ్యం. ఆ దృశ్యం ఎలాంటిదో తెలుసా..?! వీసాల గీతలు చెరిపి ఒకరి భుజం మీద ఒకరు చేతులేసుకొని ఒక నక్షత్రం మీద నుంచి ఇంకో నక్షత్రానికి పొద్దున్నే వాహ్యాళికి వెళ్లినట్టు అనే అనన్యమైన దృశ్యాన్ని మన ముందు ఉంచుతాడు.
ఇంత వరకు నేను పేర్కొన్నవి ఆ సంకలనం లోని కొన్ని కవితలు అంటే మొదటి ఓ అయిదు కవితల గురించే. ప్రతి కవిత, కవితలోని ప్రతి పాదం జీవితంలో ముంచి తీసిన పసిమిలా ఉంటుంది.

కవితలే కాదు ప్రతి కవిత్వపుస్తకానికి ముందు మాట ఉన్నట్టే ఈ పుస్తకానికి కూడా ఉంది అయితే.. ఈ ముందు మాటకు ఆయన ఇలా శీర్షిక పెట్టారు " ముందు మాట అనబడు సంజాయిషీ " . కవి సమయం గురించి అలాగే ఎడిటింగ్ గురించి ఆయన తీసుకున్న జాగ్రత్తల గురించి వివరంగా మనకు ఉదహరిస్తారు. ఇవి ముఖ్యంగా కవిత్వం రాయడం మొదలు పెట్టిన వారు తప్పక పాటించాల్సిన విషయాలని ఆయన రాసుకున్న ముందు మాట చదివాక అర్ధమయ్యింది. పత్రికలలో అచ్చైనా మళ్ళీ వాటికి కొన్ని మెరుగులు దిద్ది పుస్తకంగా అందించడం చూస్తె కవిత్వం పట్ల హెచ్ ఆర్కే గారికున్న శ్రద్ధ మనకు అర్ధం అవ్తుంది. ఈ ముందు మాటలోని కొన్ని లైన్లు ఇలా
-
యుగమంటే రెండేళ్ళు , మూడు లేక అయిదేళ్ళు అంతే. కవి ఎప్పుడు ఒకే యుగంలో జీవించలేడు. జీవిన్చాల్సి వస్తే వచ్చి పోతాడు.పోక పొతే ఉంటాడు గాని చచ్చి యుగారంభంలో ఒక సూక్ష్మాణువేదో పుడుతుంది. అదేమిటో దానికే తెలియదు. కవికేమి తెలుస్తుంది ?.కవి ఊరుకోడు శోదిస్తాడు. గోరింత లేని కాగితం ముక్కతో గంటల తరబడి ఆడుకునే పాపాయిలా సూక్ష్మాణువుతో ఆడుకుంటాడు. సూక్ష్మాణువు  పగిలి దాని నుంచి విస్తరించే చుక్కల వెంట పరుగెత్తుతాడు. అది వెదజల్లే అణుధార్మిక శక్తికి గాయపడతాడు. నల్ల బిలాలలో పడి కొట్టుకుంటాడు. గాయాల్ని ప్రదర్శించడు.కవి సిగ్గరి ; వయసెంతైనా వదలని కౌమారం ప్రదర్శిస్తే అందం అనుకున్నవే ప్రదర్శిస్తాడు.యుగం ఎన్నాళ్ళో ఉండదు. రెండేళ్ళు మూడు లేక అయిదు. అప్పటి వరకు తనకు కలిగిన ఆశ్చర్యాలు కవి పద్యాలు. వాటిని ఎవరికో ఇచ్చేసి తానూ ఖాళీ అయిపోవాలి. పుస్తకమైపోయి తనను తాను మరిచిపోవాలి. మళ్ళీ పుట్టడం కోసం చనిపోవాలి. పుస్తకం కావడమంటే చనిపోవడమే. //

అంతే కాదు మరో పేరా తరువాత పై దాన్ని కొనసాగిస్తూ ...

పుస్తకమయిపోవడం అంటే రచయిత చనిపోవడమే ఈ లోపల కొంచెం మరమ్మత్తులకు వీలుంటుంది.పత్రికలో అచ్చయిన పద్యాలతో సహా అన్నింటినీ మరో సారి చదువుకున్నాను. తొందరపాటు అనే దుర్గుణం వళ్ళ జరిగిపోయిన తప్పులు దిద్దుకున్నాను. అత్యధికం రూపానికి సంబందించిన తప్పులు. నాకు పాఠకుడు కావడంలో దొర్లిన వైఫల్యాలు,దరిమిలా పద్యాలు బాగా మారిపోయాయి. ఇప్పుడు మీకు తెలిసిపోయి ఉంటుంది.ముందు మాటను సంజాయిషీ అని ఎందుకన్నానో....

అంటూ ఆయన ఇచ్చిన వివరణలో ఎంత నిజాయితీ. పద్యంలో మమేకమై చనిపోయే స్థితికెళ్ళి బ్రతికి పద్యంలో సజీవమైన రూపాన్ని నిలబెట్టాలనే తపన నాకు ఎంతో నేర్చుకోవాలి అనే సవాలు ముందుంచింది.
ఈ కవిత్వ సంకలనం అంతా చదివినంత సేపు హృదయాన్ని ఒరుసుకు పోయే నదిలా ఉంటుంది. ఫుంఖానుపుంకలుగా రాసే కవిత్వం, ఎంత సేపుంటుందో తెలియదు కాని ఈ కవిత్వంలోని సజీవ లక్షణం చదివే ప్రతి పాఠకున్ని తనలోకి తాను , తన అనుభవాల దొంతరల్లో దూరి జీవితాన్ని మరో సారి జీవించమని చెబుతున్నట్టు ఉంటుంది .కొత్తగా కవిత్వం రాయడం మొదలు పెట్టినవాళ్ళు చదవాల్సిన ఉత్తమమైన కవి ఆయన కవిత్వం . నా అభిమాన కవులలో ముందు వరుసలో  నిలిపోయిన కవి.

No comments:

Post a Comment