Friday, October 25, 2013

"రాతి కెరటాలు" - గోపి గారి కవిత్వపు ఒడ్డున..
______________________________

__"పగ్గాలు వేసి 
పర్వతాన్ని పడగొట్టకండి
 పద్యంలో ఉన్నాను 
లోకం తలుపులు తీయకండి " |రాతి కెరటాలు - గోపి గారి కవిత్వం | 
సాయంసంధ్యావేళ చెరువు అంచున కాళ్ళు ఊపుతూ కూర్చుని, చల్లని గాలి ఒంటిని స్పృశిస్తూ ఉన్నప్పుడు అస్తమిస్తున్న సూర్యుడి గురించి ఆలోచిస్తూ, మిగిలిన వెలుగును హృదయంలో నింపుకోవాలనే ఆరాటపడుతున్నట్టు కళ్ళు పడే తపనలా అనిపించింది ఈ కవిత్వం " రాతి కెరటాలు ".

నీటి కెరటాలు మనిషిని, మనసును సహజంగానే మెత్తగా తాకుతాయి. కొన్ని జ్ఞాపకాలను మృదువుగా కదిలిస్తాయి. ఇంకొన్ని జ్ఞాపకాలను కడిగేస్తాయి. కాని "రాతి కెరటాలు "అనే టైటిల్ గోపి గారు ఎందుకు ఎంచుకున్నారో ఆయన్నే అడగాలి. కెరటం జ్ఞాపకమైతే, కెరటం అనుభవమైతే, ఆ కెరటం స్వభావం రాయిలా కదలనిది, కదిలినా గాయం చేసేదైతే..?? ఆలోచించాల్సిందే. హృదయంలోంచి ఇలాంటి రాతి కెరటాలు అప్పుడప్పుడు బయటికి వస్తే ఇలాంటి కవిత్వం అవుతుందేమో ..!?నలభై నాలుగు కవితల సంకలనం ఈ "రాతి కెరటాలు "./రాతి గుండెను మించిన నవనీతం మరొకటి లేదు /
/రాయి కదలదు కదిలేది చరిత్రే /
/చరిత్ర ఓ సముద్రం రాయి
ఒక అనాది పడవ 
కదలని రాతివైపు కడలి వచ్చేది తీరమే / 
 ఇవ్వాళా రాయి అతని చేతిలో ఆయుధమయ్యింది - అంటూ
గోపిగారు "రాతి కెరటాలు" అనే శీర్షికతో మొదటి కవిత ప్రారంభించారు .

ఈ కవిత్వపుస్తకంలో . తన మనసును చరిత్రవైపుకు, జ్ఞాపకాల వెంట అడుగులు వేయిస్తూ ఆ జ్ఞాపకాలతో తనకున్న అనుభవాల పరిమళాల్ని కవితల్లో మనకు అందిస్తూ.'కాంతి' కవితలో గుండెకు మట్టికీ పోలికలున్నాయని రెండు స్పందనలే అంటూ -
/రొట్టెను ముట్టుకుంటే తెలిసింది 
ఆకలిదెంత చైతన్యమో !/ అంటూ
 /చెమట చుక్కల్ని చూస్తే అనిపించింది 
జీవకళలు వెదజల్లే శ్రమ సౌరభం ముందు 
చుక్కలు ఎంత కాంతిహీనమో !../ అని 
మనిషిలోని నిజమైన కాంతి మనిషి ఆశించే ఎదురుచూసే కాంతిని గూర్చి తెలియజేస్తారు.

 నన్ను ఆసాంతం ఆకట్టుకున్న కవిత 'మగ్న'______
"పద్యంలో ప్రవేశించాను 
వెనుకకు రావడం కష్టం
ఆకులను నిమిరే గాలి లాగ 
ఆకాశాన్ని అలుముకున్న ఆవేశంలాగ
సముద్రంలో వేలు అద్దుతూ 
సృష్టి గ్రంధంలోని 
ఒక్కో పుటను తెరుస్తున్నాను 
అధ్యయనంలో ఉన్నాను
అలజడి చేయకండి "____ అంటూ సాగుతుందీ కవిత.

ఎంత అందంగా కవి హృదయం, కవితా లోకంలో ఎలా విహరిస్తుందో చెప్తూ అదే తన ప్రపంచంగా ఎలా మారిందో అధ్బుతంగా రాసారు గోపి గారు. 'రాజ గోపురం ఆ రెండు పక్షులు' అన్న కవిత చదివినప్పుడు, మొన్న సిటి లైఫ్ హోటల్ కూలిన సంఘటన యధావిధిగా చూస్తూ రాసారా అన్నట్టు వుంటుంది. అయితే అది 2010లో గాలి గోపురం కూలినప్పుడు రాసిన కవిత. అప్పుడు ఇప్పుడు తరువాత కూడా కవిత ప్రాణంతో ఉందనడానికి ఉదాహరణా అని అనిపించింది.

అలాగే 'ఇల్లు 'అంటూ రాసిన కవిత మనకు మన ఇంటి మీద ప్రేమను పెంచుతుంది. 'బుజ్జిగాడు ' కవిత మరో ఆశ్చర్యం నాకు. ఇంత సున్నితమైన విషయాలను ఆయన ఎంత అధ్బుతంగా రాసారా ?అనిపిస్తుంది. వాళ్ళింట్లో బుజ్జిగాడు ప్రతి ఇంట్లో పారాడిన బుజ్జోల్లను గుర్తుచేస్తుంది. ఆ కవితలోని ఈ పాదాలు చూడండి ________
" పసి నిఘంటువు ముందు 
ముదురు మాటలు 
ముఖం ముడుచుకుంటాయి " __ఈ మాటలు ఆ కవితాసారాన్ని తెలియజేస్తాయి.

''అంక గణితం "అనే కవితలో తనకు కొండతో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ....
/దీనిపై వ్యాపారపు నీడను పదనివ్వకండి /అని విజ్ఞప్తి చేస్తూ ప్రకృతితో ఆయనకున్న అనుభంధం మనకు కూడా కలిగేలా చేస్తారు గోపి గారు ."నీళ్ళ సీసా " అనే కవిత చదువుతున్నప్పుడు నవ్వు నా పెదాలపై తెలియకుండానే చేరింది. నీళ్ళ సీసాను పట్టించుకొని దానిపై కవిత్వం రాయడం. అది కూడా తన ముద్రను కలిగి ఉండడం నన్ను ఇంకా ఎదో నేర్చుకోవాలని సూచిస్తున్నట్టు అనిపించింది. అందులోని నాలుగు లైన్లు చూడండి ____"బుజ్జి పిల్లిలాగా 
కుందేలు పిల్లలాగా
చంకలో ఒదిగిన సీస 
కలతలు చుట్టు ముట్టినప్పుడు 
వేళ్ళమధ్య నలిగిన సీస 
ఇప్పుడు ఎడారంత ఖాళీతో 
బోసిగా కనిపిస్తుంది అయితేనేమి ??
 నా కవిత్వంతో నింపుతాను 
కన్నీళ్లు కాదుకాని
దాని గోడల నిండా అలాంటి తడి
ఎదో మిగిలే ఉంది."_____అంటారు.. 

'ఆల్కెమీ ' కవితలో కవి అంటారు__'భావాలు ఒక గదిలోంచి మరో గదిలోకి వీచే ప్రాణ వాయువులు' అని . జాలరుల జీవనాన్ని చిత్రేకరిస్తూ 'ఆకాశం సాక్షిగా ' అని సముద్రపుత్రుల సాహసాన్ని కళ్ళకు కడతారు. నిన్న నేడులను జ్ఞాపకం చేసుకుంటూ రాసిన 'వ్యత్యాసం ' కవిత మరో మార్కు. అందులో పాదాలు చూడండి ___"నుదిటి మీది 
చెమట బిందువులను విదిలిస్తే 
నలువైపులా 
ముత్యాల విత్తనాలు రాలేవి" అంటూనే ..
నేటి విలాసవంతమైన జీవితంలో కొట్టుకుపోయే మనిషిని మళ్ళీ దొరికిన్చుకోవాలనే చేసే ప్రయత్నం మనల్ని కూడా అక్కడే ఆగిపోయేలా చేస్తుంది .
/నాకే కాదు నిద్రకు నిద్ర రాదు /.ఎప్పుడు నా దోసిట్లో గుప్పెడు /అక్షరాలూ పెట్టే నిద్రకు/నా కృతజ్ఞతలు /అంటూ గోపి గయు 'నిద్ర ' కవిత మనల్ని కూడా (కవులైన వారిని) నిద్రకు కృతజ్ఞతలు చెప్పేలా చేస్తుంది.మరో మంచి  కవిత 'పిడికిలి '__ /ఇప్పుడిది /శరీరానికి మొలిచిన/జెండాలా ఉంది /పిడికిలి ఇవాల్టి రెప రేపల అలజడి / అంటూ విప్లవాల చుట్టూ తిరిగే వారినే కాదు. సామాన్య మానవుణ్ణి కూడా ఆలోచించేలా చేసే కవిత ./ అందరికోసం స్వప్నించే పిడికిలి లేదంటే అది నిరర్ధకమైన ఎముకల అలికిడి / అంటూ పిడికిలి ఉద్దేశ్యాలు గుర్తు చేస్తారు. 

ప్రతి కవికి జ్ఞాపకాలు ఒంటిని అంటుకుని ఉండే పైవస్త్రం లాంటివి. " స్కూలు గంట " గురించి ఆయన రాసిన కవిత మళ్ళీ మనల్ని బడి మెట్లు ఎక్కేలా చేస్తుంది. గొడుగు, టెలిఫోను , మురళి అమ్ముకునే వాడిపై రాసిన "అమ్మకం", నీడ , స్నేహం . పెన్ను గురించి రాసిన కవిత 'ప్రక్రియ '. రోజులు మారిపోతున్నాయి అంటూ రాసిఇన కవిత "అవునా ".._____

ఇలా రాతి కెరటాలలోని ప్రతి కవిత కోట్ చేయగలిందే. ఒక్కో కవిత ఒక్కో అనుభూతిని మిగిలిస్తూ మన జీవితంలోని అనుభవాలకి దగ్గరగా జరిగి మనతో స్నేహం చేసేలా ఉన్నాయి. అందుకే ఇ/ప్పుడు ఈ కవిత్వ పుస్తకం నాకు దొరికిని కొత్త కవిత్వ నేస్తం. కొత్తగా కవిత్వం రాస్తున్న వారు చదవాల్సిన పుస్తకం
 ----------- (5/8/2013) ----------------------------------

No comments:

Post a Comment