Friday, October 18, 2013

"దేవరశిల"_మాట్లాడుతుంది

18 October 2013 at 19:06
తెల్లటి ఆకాశం మీద 
నల్లటి మోడాలు కమ్ముకుంటా వుండాయి 
నల్లమబ్బులు ఆకాశాన్ని ఈదుకుంటా 
ఎర్రకొంగల గు౦పొకటి
బయలు దేరింది ఈ దారిలోనే ________ ఈ మాటలు Vempalli Gangadhar   గారు రాసిన  "దేవరశిల" కథాసంపుటి లోవి.  

అప్పటి వరకు ఆదివారం మ్యాగజైన్లలో లేదా మాసపత్రికల్లో కథలు చదవడం వరకు తెలుసు. ఎందుకో మ్యాగజైన్ ల్లో అన్నీ చదివాక ఆ తరువాత తీరికగా  కవిత , కవిత తరువాత కథ చదివేదాన్ని. కాని ఈ కథా సంపుటి చదివాక నిజంగా కథల మీద అత్యంత ఇష్టం పుట్టుకొచ్చింది. వేంపల్లి గంగాధర్ గారు రాసిన రెండు కథల పుస్తకాలున్నాయి నా దగ్గర.  ఆయనకీ సాహిత్య యువపురస్కారం తెచ్చిపెట్టిన కథా సంపుటి "మొలకపున్నమి " అలాంటిదే "దేవరశిల "కూడా.. కాలేజ్ లో నా డెస్క్ లో ఈ రెండు పుస్తకాలు వీటితో పాటు చలం, శివారెడ్డి , తిలక్ కవితా సంపుటాలు౦డేవి. 


ఓ రకంగా కవిత్వాన్ని ఎక్కువ ఇష్టపడే నేను కథ మొదటి రెండు పేరాలు చదివి నచ్చక పోతే లేదా predict చేసేట్టు ఉంటే  అక్కడికి వదిలేయడం చేసేదాన్ని. కాని ఈ రెండు కథా పుస్తకాలు మనల్ని ఎంత సేపు వీలయితే అంత సేపు మాట్లాడకుండా పాత్రలద్వారా మనల్ని ఆలోచనలోపడేసి ఇక బయటికి రాకుండా ఉంచుతాయి. 


రామతీర్ధ  గారు  " దేవరశిల " పుస్తకానికి ముందు మాట రాస్తూ ___"బెన్ ఒక్రి" మాటలను కోట్ చేసారు. ఏంటంటే _" మన మూలాల్లో ప్రతిధ్వనించేవి , మన ముగింపులో మార్మికమై, అంతుపట్టని మన ఆరంభాల్లో, దైవీయమైన మన విధి బలీయతల పట్ల లోలోపలే గ్రహింపు కలిగిఉండి, ఈ రెండిటిని ఒకటిగానే ఏకం చేయగలిగేవే గొప్పకథలు " అని. ఈ కథాసంపుటి చదివాక ఎవరికైనా  అలాగే  అనిపించక మానదు. 


ఇప్పటికి సంవత్సరంన్నర.   ఈ పుస్తక౦  నా దగ్గరకొచ్చి.  ఇప్పటికి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తీసిచదువుతూనే ఉంటాను. ఉన్నట్టుండి గాలి కథలవైపు మళ్ళిందేటాని సందేహం రావచ్చు. ఉదయం టీవిలో ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ శివాలయం కింద వెయ్యిటన్నుల బంగారం ఉంది అనే వార్తా .  ఓ 30 నిమిషాల డాక్యుమెంటరీ వేసారు టీవీ లో . ఓ సాదువుకి కలలో ఆ ప్రాంతాన్ని పాలించిన రాజోచ్చి అక్కడ బంగారు నిధిని దాచిపెట్టాడని  దాన్ని కాపాడుతూ ఆయన ఆత్మలాగే అక్కడే తిరుగుతున్నాడని  అది త్రవ్వించి తనకి విడుదల కలిగించమని.   సాదువుకి  మనవి చేస్తే ఆయన ప్రభుత్వానికి, పురావస్తు శాఖ వారికి లేఖ రాసాడట .  ఆ బంగార౦ కోసం త్రవ్వకాలు చేసే పని మొదలు పెట్టేట్టు చేసారు  బాబా గారు అని వార్తలు. మొత్తానికి మరో పద్మనాభస్వామి  ఆలయంలా అక్కడ కూడా బంగారం దొరక్కపోదాని ప్రభుత్వ ప్రజల ఆశ. ఆ సాధువు బాబా ఏది చెపితే అది జరుగుతుందని ,అది రుజువైందని అక్కడి వారి నమ్మకం. పై సంఘటన చూస్తూ ఉన్నప్పుడు నాకు "దేవరశిల " కథా సంపుటిలోని కథ "అంజన సిద్ధుడు " గుర్తొచ్చాడు.  


రాయలకాలంనాటి కావలిసత్రంలో అంజనం వేసేవాల్లందరూ ఉండేవాళ్ళట. హిరణరాజ్యంలో ఎక్కడ ఏ౦  జరిగినా జనమంతా అక్కడికెళ్ళి తమకు కావలసిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండేవారు. అందుకే ఆ ప్రాంతాన్ని అంజన పల్లె అనే వాళ్ళు. అయితే చివరిగా పక్కీరయ్య అనే ఓ పెద్దాయన మాత్రం మిగిలిపోయి ఎప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండేవాడు . తన  మనోనేత్రంతో జరిగేదంతా చూస్తూ వచ్చిన వారి బాధల్ని కష్టాల్ని, విని సరి అయిన ఉపాయం సమాచారం చెప్పేవాడు . అంతే  కాకుండా పట్టిన దయ్యాలను కూడా వదిలించే వాడు. ఆయన ముసలితనానికి దగ్గరగా రావడంతో ఇద్దరు శిష్యులను తయారు చేసుకుని వారికి విద్యలు నేర్పుతాడు.ఒకడు అంజన సిద్దులయ్య ఇంకొకడు తిరుమలయ్య . పకీరు తరువాత పెద్ద దిక్కుగా ఇప్పుడు  ఆ ఊరికి మిగిలింది అంజన సిద్దులయే . ఓ రోజు కొండారెడ్డి వాళ్ళ దగ్గరకోస్తాడు .పూర్వం ఓ సారి ఆయన ఆవుల మంద తప్పి పొతే అంజనం వేసి చూసి అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పింధీ అంజన సిద్దులయ్యే . ఈ సారి వచ్చినప్పుడు కొండా రెడ్డి ఓ విచిత్రమిన విలువైన విషయం తీసుకుని అంజన పల్లె వెళ్తాడు.  తన భార్య మందను కాస్తున్నప్పుడు ఆమెకి ఓ బంగారు ముక్కు పుడక (ముక్కుకమ్మి ,ముక్కు నత్తు ) అక్క దేవతల కొండ మీద దొరికిందని , వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నా సమాచారం ప్రకారం అక్కడ ధన నిధి ఉండే అవకాశం ఉందని అంజనం వేసి తెలుసుకోమంటాడు . అంజన సిద్దయ్య ససేమీర కుదరదు అంటాడు . చివరికి   కరువు పేరుతో   కొండా రెడ్డి అలా ఇలా మొత్తానికి ఎలాగోలా బలవంత పెడతాడు. అంజన సిద్దయ్య ఒప్పుకోవడం వల్ల  ఏం జరిగి౦ది అనేదే కథ. ఈ కథ చదివాక ఏడవటం  ఖాయం .. 


ఈ కథ ఒక్కటే  కాదు ఈ పుస్తకంలో ఉన్న ప్రతి కథ  హృదయానికి హత్తుకుంటు౦ది .  ఎవరు ఆలోచించలేని కథా వస్తువులు వేంపల్లి గంగాధర్ గారు ఎంచుకోవడం ఆయన ప్రజ్ఞ్యకి నిదర్శనం. వేంపల్లి గంగాధర్ గారు  తెలుగులో మొట్ట మొదటిగా " సాహిత్య అకాడమీ అవార్డ్  యువపురస్కారం "అందుకోవడం నిజంగానే అభినందించాల్సిన విషయం. 


ఈ కథా పుస్తకంలో అన్నీ కథలు చెప్పుకోదగ్గవే -> తూరుపు కొమ్మలు , నెల దిగిన ఊడ, నెత్తుటి మాన్యం , వాన రాయుడి పాట, కొయ్య బొమ్మలు , అంజన సిద్ధుడు , ముడుపు కొయ్య, కొలిమ్మాను , వెనుకటి కాలం కాదు , నీడలు , ఊరిని మర్సిపోబాకురా అబ్బీ , పొద్దు పుట్టింది ... ఈ కథలే కాక ఆయన సాహిత్యం కథలు వ్యాసాలూ రచనలన్నీ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొని చదవచ్చు www.vempalligangadhar.in


కడప, రాయలసీమ మాండలికాల్లో రాసిన ఈ కథలు అంతే స్వచ్చంగా చదివిన ప్రతొక్కరిని హత్తుకుంటాయి. ఆ పాత్రలు సజీవంగా మనతో నడిచి వస్తాయి.. అలాంటి సందర్భాలు కనిపించినపుడు వెంటనే "దేవరశిల "గుర్తొస్తుంది .. ఇలాంటి అధ్బుతమైన కథల సంపుటిని తెచ్చిన రచయిత డా || వేంపల్లి గంగాధర్ గారికి అభినందనలు . 

చివరిగా k. వెంకటేశ్వర రాజు "దేవరశిల" పుస్తకం కోసం రాసిన మాటలు ______
ఎండపెడ్తా౦ది. వాన కురుస్తుంది,ఎండావాన.
మిట్టమధ్యాహ్నమప్పుడు ఈ సిత్రమేంది ?
గరుడ స్థంభం పక్కలో పెట్టుకొని గుడిమెట్ల మీద కూర్చున్నవాడు పాడే
పాటవినిపిస్తాందా ?
ఇప్పపూలు శబ్దం లేకుండా చెట్టునుంచి
రాలిపడ్త వుండాయా ?
పడమటి కొండ దిక్కు మోడాలు కమ్ముకొని చినుకులు కురుస్తాంటే
మట్టి వాసన వస్తాందా ?
రావిచెట్టు కొమ్మలు ఊగుతా ఊగుతా అప్పుడప్పుడు నేలపైకి వాలి
భూమి తల్లిని ప్రేమగా ముద్దాడతా వుండాయా ?
ఒక కంట్లో సూర్య భాగావానుడ్ని మరో చంద్రబింబాన్ని చెక్కిన
యుద్ధ వీరుడి వీరగల్లు నెత్తుటి మాన్యానికి కాపలా కాస్తా వుండాదా ?
ఓరి దేవుడా ?

No comments:

Post a Comment