ఊహలకు ఆకారం ఉంటుందా? ఉంటె ఎలా ఉంటుంది. ఊహలని ఒక ఆకారం లోకి
ప్రవేశపెట్టడానికి మనిషి ఎలాంటి భావసంఘర్షణకి గురవుతాడు. ఊహలకి భావాలకి మనిషికి మనసుకు మధ్య అంతర్లీనంగా కనబడకుండా ఆవరించుకుని ఉండే ఆ వలయం వేటిని తనలోకి లాక్కుంటుంది. ఎప్పుడూ ఈ ప్రశ్నలకి సమాధానం కాలంతోనే మారుతూనే ఉంటుంది.
కొన్ని అనుభూతులు ఎప్పుడు మనసులోకి ప్రవేశించి ఆక్రమిస్తాయో తెలీదు.
ప్రవేశించడంతో ఆగకుండా అవి ఎప్పుడు ఒక రూపాన్ని సంక్రమించుకోవడం కోసం
అయస్కాంతంలా మారుతాయో తెలియదు. ఊహలకి నిర్దిష్టమైన ఆకారం ఉంటుందో లేదో కాని
అక్షరాలలోకి ఊహలు భావాలు ఒదిగేప్పుడు నిర్దిష్టమైన ఆకారాన్ని మాత్రం
సంతరించుకుంటాయి. భాష, వ్యాకరణం, వాక్య నిర్మాణం, తదితర నియమాలకు లోబడతాయి.
నియమాలకు లోబడే ఊహలు భావాలు ఏ సాహిత్య ప్రక్రియలోకైన ఒదిగిపోవచ్చు.
అయితే అవి కవిత్వంలోకి రూపాంతరం చెందేప్పుడు అప్పుడే పుట్టిన పసివాడంత
స్వచ్చంగా ఉండి మన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ పసితనపు స్వచ్చతలోకి
మనల్నీ లాక్కుంటాయి.
నా మట్టుకు నాకు కవిత్వం సంకల్పిత చర్యే.
ఒక సంఘటన, ఒక సందర్భం మనిషి మెదడులోకి అక్కడినుంచి
మనసులోకి చేరి మెల్లిగా మొలకెత్తి దాన్ని బయటికి విసిరి కొట్టే వరకు ఊరుకొని తుఫాను.
ఒకలాంటి అల్పపీడనం.
ఒక నిజాన్నికానీ, కోపాన్నికానీ, ఆనందాన్ని కానీ, ఉన్నదాన్ని ఉన్నట్టు అంటేనో
రాస్తేనో కవిత్వం కాదు. అయితే ఆ భావాలు పాఠకున్ని
గుండెలోకి చొచ్చి ఆ గుండెని మెలిపెట్టే భావాల అల్లికే కవిత్వం.
కవిత్వాన్ని ప్రేమించే ఒక్కొక్కరూ ఒక్కోలా దానికి జన్మనిస్తారు.
కవిత్వాన్ని నేను రాయడం మొదలుపెట్టినప్పుడు నాకు
దాన్ని కవిత్వం అంటారని తెలియదు. కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు ఇవీ అని తెలియదు.
కాని వ్యాసంలా రాసేస్ది మాత్రం కవిత్వం కాదు అనే ఒక స్పృహ నాకు ఉండేది.
నా చిన్నతనంలో రెండో తరగతిలో ఉన్నప్పుడు మిట్టమధ్యాహ్నం
మా బంగాళా పై బొంతేసుకుని పడుకుని ఆకాశంకేసి చూస్తున్నప్పుడు
మబ్బులు కదలడం చూసిన నాకు ఎదో కనుక్కు న్నానన్న సంబరంతో
మా అమ్మ దగ్గరకు పరుగెత్తి కెళ్ళి మబ్బులు కదులుతున్నాయి అని ఆశ్చర్యంగా చెప్పడం.
నాకు ఇంకా తాజా జ్ఞాపకం. రకరకాల ఆకారాల్లోకి మబ్బులు మారేప్పుడు
నాకు వాటిని అలా కళ్ళలో ఖైదు చేయడం చాల నచ్చేది. ప్రతి ఆకారం
నాతో స్పష్టంగా మాట్లాడుతున్నట్టు అనిపించేది.
రాత్రుళ్ళు పడుకుని ఆకాశంలోకి చూస్తున్నప్పుడు నక్షత్రాలని లెక్కపెట్టడం
లెక్క తప్పినప్పుడు మళ్ళీ లెక్కపెట్టడం చంద్రుని చుట్టూ వుండే
వలయాన్ని చూసి భయపడడం ఇవన్నీ ఏంటో తెలియని అనుభవాలు.
నా చిన్న తనంలో మేము చర్చికి ఎదురుగ ఉన్న ఇంట్లో ఉండేవాళ్ళం.
నేను మూడో తరగతికి వచ్చే వరకు ఆ ఇంట్లోనే ఉన్నాం.
చర్చ్ ని ఊడ్చి పట్టాలు వేసాక వాటిమీద ఆంధ్రక్రైస్తవ కీర్తనల పుస్తకాలు పెట్టేవాళ్ళు
ఎవరు ముందొస్తే వాళ్ళు ఆ పుస్తకాన్ని తీసుకుని పాటలు పాడడానికి వీలుగా.
నేను ఊడ్చేప్పుడే వెళ్లి చర్చ్ లోని ఆంధ్రక్రైస్తవ కీర్తనలని కంఠతా పట్టేదాక పాడాలని
మళ్ళీ మళ్ళీ పాడేదాన్ని. ఆ కీర్తనల్లోని పాదాలు పోలికలు నన్ను చాల ఆకర్షించేవి.
అలా కీర్తనలు రాయాలనే కోరిక కూడా బలంగా వుండడం
నన్ను తెలుగును ఇష్టపడేట్టు చేసిన కారణాల్లో ఒకటి.
కవితలు అని వేటిని అంటారో తెలియనప్పుడు నా చిన్న తనంలో
నేను ఆరో తరగతిలో వున్నననుకుంట అప్పుడు ఎన్. గోపి గారికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు
వచ్చింది. గోపి గారి గురించి ఒక డాక్యుమెంటరి దూరదర్శన్ లో వచ్చింది.
అప్పుడు గోపి గారు నానీలు చదివి వినిపుస్తున్నారు. ఆ నానీలు వింటున్నప్పుడు
ఓహ్ కవితలు ఇలాగే రాస్తారా అని ఒక బీజం నా మెదడులో పడింది.
ఇలాంటివి నేను కూడా రాయగలను అని అనుకుని
చిన్న చిన్న కోట్స్ రాసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
కవిత్వాన్ని ఇష్టపడడానికి ఈ సందర్భం కూడా ప్రేరణనే.
నేను మొట్టమొదటి సారిగా రాసిన కవిత ఇంటర్ రెండవ సంవత్సరంలో
ఉన్నప్పుడు “ప్రవహిస్తూ వస్తున్న విద్యను నీ వైపు దోసిళ్ళతో పుచ్చుకుని
దాహం తీర్చుకో “ అంటూ సాగుతుంది. విద్య ప్రవహించడం అంటూ
ఎలా మొదలు పెట్టానో ఇప్పటికి అర్ధం కాదు. ఇలా డిగ్రీ వరకు కవితలు అంటారో అనారో
తెలియని వాటిని ఒక నలభై వరకు రాసుకున్నా.
ఇలా కవితలు రాయడం మొదలు పెట్టినా ఫేస్ బుక్ లో రాయడం ఒక కొత్త అడుగు అనుభవం.
కవులతో పరిచయాలు . పత్రికలకు కవితల్ని పంపడం వాటిని అచ్చులో చూసుకోవడం
ఆనందపడ్డం మరో అనుభవం.
ఈ క్రమంలోనే అనేకమైన కవితల్ని ఫేస్ బుక్ లో
చదవడానికి నాకు ఆస్కారం దొరికింది.
అప్పటి వరకు నాకు అప్పుడొకటి అప్పుడొకటి దొరుకుతున్న కవితలు.
పూర్తి స్థాయిలో ఫేస్బుక్ లోనే దొరకడం.
అయితే
నాకవిత్వమధర్మాయ వ్యాధయే దండనాయ వా|
కుకవిత్వం పునః సాక్షాన్మృతి రాహుర్మనీషిణః|| –
భామహుడు, కావ్యాలంకారం. 7వ శతాబ్దం.
(నువ్వు కవిత్వం రాయకపోతే అది తప్పు కాదు. నీకు జబ్బు చేయదు. నిన్నెవరూ తిట్టరు, కొట్టరు. కానీ చెడు కవిత్వం రాస్తే నువ్వు తప్పకుండా నీ పాఠకులను చంపినవాడి వవుతావు.) లాంటి శ్లోకాలు కాని కుకవిత్వం అని వినడం కాని నాకు అంతకు ముందు వరకు ఎప్పుడూ తెలియదు. ఇవన్నీ ఫేస్ బుక్ లోనే వినడం.
కవిత్వంలో కుకవిత్వం కూడా ఉంటుంది అని తెలిసినప్పుడు నాకు చాల ఆశ్చర్యం కలిగింది.
అరె నేను రాస్తున్నది కవిత్వమా? కుకవిత్వమా? అన్న సందేహం కూడా నన్ను వెంటాడింది.
ఒక వేళ నేను రాస్తున్నది కవిత్వమే అయితే నా కవిత్వానికి వీళ్ళు కవిత్వం అని చెప్పుకోదగ్గ లక్షణాలు ఉన్నాయా ? అని రీసెర్చ్ చేసుకోవడం మొదలు పెట్టాను. అందుకు నాకు గూగుల్ చాల ఉపయోగపడింది. కవిత్వం అని కొడితే ఎన్నో వ్యాసాలు వాటికి సంభందించిన లింకులు నా ముందు ప్రత్యక్షమైయ్యేవి. వాటిని చదువుకోవడం నేను రాస్తున్న కవిత్వాన్ని పరీక్షించుకోవడం ఇదే పనిగా పెట్టుకున్నాను కొన్ని రోజులు. జాన్ హైడ్ కనుమూరిగారు , అలాగే అఫ్సర్ గారు కవిత్వం వాచ్యం అవడం గురించి నాతో పదే పదే చర్చించే వాళ్ళు. నా కవిత్వంలో అనవసర పదాలు వాడినట్టు కనిపిస్తే జాన్ హైడ్ కనుమూరి గారు వెంటనే ఫేస్ బుక్ లో మెస్సేజ్ పెట్టేవాళ్ళు. ఆ పదాల అవసరం అక్కడ ఉందా అని. ఇలా పేరు ప్రఖ్యాతలు ఉన్న కవులు కూడా ఫేస్ బుక్ లో వుండడం irrespective of their designation and position ఏ జంకు లేకుండా పలకరించి మాట్లాడడానికి ఫేస్ బుక్ వేదిక కలిగించింది.
ఇలా రాస్తూ ఉండగా నాతో పాటు కొత్తగా రాస్తున్న నా తరం పిల్లలం ఒకరితో ఒకరికి పరిచయాలు బలపడుతూ రావడం మొదలైంది. సమకాలీన కవిత్వం గురించి మాట్లాడాలంటే కవుల గురించి కూడా మాట్లాడాలి. కొత్త తరం కవులే కాదు. మా ముందుతరం సీనియర్ కవులు కూడా చాల మంది ఫేస్ బుక్ లో మా కళ్ళ ముందు ఉండడం మా అదృష్టం. వాళ్ళు కూడా ఫేస్ బుక్ వేదికగా కవిత్వం రాయడం. కవిత్వంపై చర్చలు వ్యాసాలూ కొనసాగించడం వాటిని చదువుతున్న నా లాంటి కొత్త పిల్లలకి కవిత్వం పట్ల అవగాహన్ ఏర్పడడం కవిత్వం రాయడం పట్ల మక్కువ ఏర్పడడం సర్వసాధారణంగా జరిగిన విషయం. అయితే ఫేస్ బుక్ లో నేను పేజీ మొదలు పెట్టి రాస్తున్న క్రమంలో ఫెంటోస్ అనే గ్రూప్ ఉండేది. అది మినీ కవిత్వ ప్రక్రియకి సంబంధించిన గ్రూప్. అయితే ఒక నిబంధన పెట్టుకుని ఆ నిబంధనకి లోబడి చిన్న చిన్న పాదాలు రాసేవాళ్ళం.
మొదటి వరుసలో పదిలైన్లు రెండో వరుసలో పదిహేను లైన్లు దాటకుండా భావాన్ని వ్యక్తపరచాలి. ఆ గ్రూప్ లో రాస్తూ పరిచయంఅయిన నేను , నర్ష్కుమార్ సూఫీ, అనిల్ డాని , చైతన్య శంకర్, వర్నలేఖ, వంశీధర్ రెడ్డి, ఇలా మా పిల్లల బ్యాచ్ అంత కవి సంగమం అనే ఒక గ్రూప్ ఏర్పడిందని తెలిసి అందులో చేరి అక్కడ కవిత్వం రాయడం మొదలు పెట్టాం. మేము కవి సంగమంలో చేరక ముందు విజయభాను అక్క, కేక్యూబ్ వర్మ గారు అడ్మిన్ లు గా స్వేచ్చ అనే గ్రూప్ వుండేది అందులో కవిత్వం దానికి సంభందించిన చర్చ జరుగుతుండేది. దాని తరువాత కవిత్వం కోసమే ఏర్పడ్డ గ్రూప్ గా కవి సంగమం ముందుకు రావడం. ఫేస్ బుక్ లో కవిత్వం రాస్తూ ఔత్సాహికులుగా ఉన్న వాళ్ళను ఒక చోటకు తెచ్చి రాసుకునే వేసలుబాటుగా వేదికగా మారడం అందులోఏ బేషజాలు లేకుండా సీనియర్ కవులు కూడా కవితలు రాస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ వ్యాసాలు వ్యాఖ్యలు రాయడం. నాకు /మాకు ఒక పాఠం. కవి సంగమం తో పాటు సింగిడి గ్రూప్ ఏర్పడడం, ఆ తర్వాత అనేక రకాలైన కవిత్వ గ్రూపులు ఏర్పడి విరివిగా కవితల్ని రాసే సమూహాల్ని నిర్మించడం ఆశ్చర్యానికి గురి చేసిన అంశం.
ఈ గ్రూప్ లలో అనేక రకాలైన కవిత్వం వచ్చేది. ప్రేమ కవిత్వం , విరహ కవిత్వం ,
ఒంటరితనానినికి సంభందించిన కవిత్వం, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, కాల్పనిక కవిత్వం.
విప్లవ కవిత్వం , అస్తిత్వ వాద కవిత్వం. మైనారటీ కవిత్వం , తెలంగాణ ఉద్యమం నేపద్యంగా
తెలంగాణా రాష్ట్ర అవతరణ కోరుతూ తెలంగాణ యాస ప్రతిఫలిస్తూ తెలంగాణ కవిత్వం.
తెలంగాణాని వ్యతిరేకిస్తూ కవిత్వం. సామాజిక జాడ్యాల మీద మూడ నమ్మకాల మీద , సామాజిక అసమానతల మీద , స్త్రీల మీద జరిగే అత్యాచారాల మీద ఇలా విపరీతంగా కవిత్వం ఫేస్ బుక్ ని ముంచెత్తింది.
కొందరు సీనియర్ కవులు ఇది మంచి పరిణామం అన్నారు.
కొందరు ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని భయపడ్డారు.
మరి కొందరు లైక్లు కామెంట్ల ధోరణి కవితా స్పూర్తిని చెడగోడుతుందని భయం వ్యక్తం చేసి దూరంగా
ఉన్నారు. ఆపై కొందరు కవితల్ని విమర్శించే విమర్శకులు ఉంటె బాగుంటుందని
అభిప్రాయం వ్యక్తం చేసారు.
నేను ముందు పేర్కొన్నట్టు కవిత్వం , కుకవిత్వం అన్న మాటలు మళ్ళీ మళ్ళీ వినిపించడం
మొదలైంది.మరి వేల సంఖ్యలో కవిత్వం గ్రూప్ లలో చేరుతున్న వాళ్ళందరూ కవులేనా ?
ఇదో పెద్ద ప్రశ్నగా తయారైయింది చాల మందికి. గ్రూప్ లో ఉన్నాం కదా అని రాసే వారి
సంఖ్య కూడా పెరగడం మొదలైంది. మరి కవిత్వాన్ని ఎలా వడబోసి కుకవిత్వం
కాని దాన్ని వెదికి పట్టుకోవడం ?? అదీ గాక ఇంటర్నెట్ కవులు అన్న ఒక ట్యాగ్ మొదలయ్యాక
అది ఒక లాంటి తిట్టు లాగా భావించేసున్నితత్వం. మా కవిత్వాన్ని పత్రికలకు పంపి
అక్కడ పబ్లిష్ అయ్యాక ఆనంద పడ్డం కూడా మొదలు పెట్టాం. ఈ క్రమంలో మాకు
ఒక విషయం అర్ధం అయింది. పత్రికలలో పబ్లిష్ అవడం
అంత తేలిక కాదు అని. అయితేనేం ఫేస్ బుక్ లో తమ భావాల్ని స్వేచ్చగా వ్యక్తం చేస్తున్న
వాళ్ళు ఎక్కువే వున్నారు.
అయితే నేను రాయడం మొదలు పెట్టినప్పటినుంచి ఎలాంటి కవిత్వాన్ని చూస్తున్నాను
ఏది రాస్తూ వస్తున్నాను అదంతా కాలంతో పాటు నా అనుభవంతో పాటు మారుతూ వస్తుంది.
కాలం పరిణతిని తీసుకోస్తూనే ఉంది. మాట్లాడేవాళ్ళు కొత్త తూనికరాళ్ళు కనుక్కుంటూనే ఉన్నారు.
కవిత్వం రాసే వాళ్ళు రాస్తూనే ఉన్నారు. వాళ్ళ అడుగుల పక్కగానో కాలిపో నేను
అడుగులేస్తున్నాను అవి ముందుకో వెనక్కో కాలం కొలమానంలో నిర్ధారించబడతాయి.
కాని తొందర పడి కూసే కోయిలలకు సమాధానం చెప్పే పని పెట్టుకోకూడదని మాత్రం నేను
అనుకున్నాను. అనుకుంటున్నాను. నన్ను నేను కవిత్వంతో నింపుకోవడం ప్రస్తుతం నా పని.
అది కవిత్వమనే కాదు నన్ను పరిపూర్ణం చేసే ఏ సాహిత్యమైన నాలో ఇంకిపోవాలని స్వీకరిస్తూనే
ఉన్నాను. నేనింకా కట్టబడుతున్నాను . నిర్మాణం మొత్తం అయ్యాకే దాని స్వరూపం స్వభావం
కట్టడం యొక్క అందం తెలిసేది. అది జీవిత చరమాంకానికి కాని అర్ధం అవదేమో.
ప్రస్తుతానికి ఇంతే సెలవు.
No comments:
Post a Comment